India VS South Africa : రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 247/6

గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా 247/6తో నిలిచింది. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా సఫారీలు స్థిరంగా రాణించి ఆధిక్యం చూపించారు.

India VS South Africa

విధాత : భారత్ తో గౌహతి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి రోజు ఆట ముగిసే సరికి 6వికెట్ల నష్టానికి 247పరుగులు చేసింది. ముత్తుస్వామి (25*), కైల్ వెరినె (1*) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్ల కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినప్పటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. సఫారీ బ్యాటర్లు మార్‌క్రమ్ (38), రికెల్‌టన్ (35), ట్రిస్టన్ స్టబ్స్ (49), తెంబా బావుమా (41) రాణించారు. టోనీ డి జోర్జి (28), ముల్డర్(13) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఒక జట్టు ఇన్నింగ్స్‌లో టాప్‌-4 బ్యాటర్లు 35 కంటే ఎక్కువ పరుగులు చేసినా అందులో ఒక్కరూ కూడా హాఫ్ సెంచరీ చేయకపోవడం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం విశేషం.

తొలి రోజు ఆటలో పట్టుదలతో ఆడిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు మార్ క్రమ్, రికెల్ టన్ లు తొలి వికెట్ కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అద్భుతమైన యార్కర్‌తో బూమ్రా మార్‌క్రమ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో భారత్ తొలి వికెట్ సాధించింది. రెండో సెషన్‌లో కుల్‌దీప్ తొలి ఓవర్‌లోనే రికెల్‌టన్ వికెట్ పడగొట్టాడు. అనంతరం స్టబ్స్, బావుమా నిలకడగా ఆడి రెండో సెషన్‌లో మరో వికెట్ పడకుండా చూసుకున్నారు. వారిద్దరు 84 పరుగుల భాగస్వామ్యం సాధించారు. లంచ్ బ్రేక్ తర్వాత జడేజా బౌలింగ్‌లో తెంబా బావుమా.. జైస్వాల్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివరి సెషన్‌లో సఫారీలు నాలుగు వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేశారు. స్వల్ప వ్యవధిలో స్టబ్స్, వియాన్ ముల్డర్ (13)లను కుల్‌దీప్ పెవిలియన్‌కు పంపాడు. మరికాసేపట్లో ఆట ముగుస్తుందనగా.. సిరాజ్ బౌలింగ్‌లో జోర్జి.. పంత్‌కు క్యాచ్ ఇచ్చాడు. మొత్తం మీద తొలి రోజు ఆటలో సఫారీలే ఆధిక్యత కనబరిచారు. రెండు టెస్టుల సిరీస్ లో దక్షిణాఫ్రికా తొలి టెస్టులో గెలిచి 1-0 ఆధిక్యతలో కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి :

AUS VS ENG : యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం
Australia vs England| యాషెస్ తొలి టెస్టులో ఆస్ట్రేలియా టార్గెట్ 205పరుగులు

Latest News