Site icon vidhaatha

Sajjan Jindal | పారిస్‌ ఒలింపిక్స్‌ పతక విజేతలకు సజ్జన్‌ జిందాల్‌ బంపర్‌ ఆఫర్‌.. ఎంజీ కారును గిఫ్ట్‌గా ఇస్తానన్న వ్యాపారవేత్త

Sajjan Jindal | పారిస్ ఒలింపిక్స్ ప‌త‌కాల‌ విజేత‌ల‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్స్‌ చైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌ బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఎంజీ విండర్స్‌ కార్‌ని కానుకగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. టీమ్ ఇండియా నుంచి ప్రతి ఒలింపిక్ పతక విజేతకు జేఎస్‌డ‌బ్ల్యూ ఎంజీ ఇండియా నుంచి ఓ అద్భుతమైన కారు ఎంజీ విండ్సర్ బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. ఉత్తమమైన అంకితభావం, విజయానికి ఉత్తమమైందని ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం ఆయన ట్వీట్‌ వైరల్‌ అయ్యింది. పలువురు నెటిజన్స్‌ స్పందిస్తూ ‘గొప్ప చొరవ’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. మ‌రొకరు ఒలింపియన్‌లకు ఇంత అద్భుతమైన బహుమతిని అందిస్తున్న సజ్జన్ జిందాల్, జేఎస్‌డ‌బ్ల్యూ, మీరు భారతీయ స్ఫూర్తికి విజేతలు అంటూ మరో యూజర్‌ పేర్కొన్నాడు. మరో వ్యక్తి ‘వావ్! క్రీడాకారులను ప్రోత్సహించడానికి గొప్ప చొరవ’ అని పేర్కొన్నారు. కాగా, ఈ కారు డిజైన్ విండ్సర్ కాజిల్ ఆర్కిటెక్చర్ నుంచి ప్రేరణ పొందిందని ఎంజీ సంస్థ పేర్కొంది. ఎంజీ విండ్సర్ సున్నితమైన హస్తకళ, శ్రేష్ఠత, రాజ‌సాన్ని కలిగి ఉంటుందని సంస్థ తెలిపింది. ఇక ఎంజీ విండ్సర్ కారు ధ‌ర రూ.25 ల‌క్షల నుంచి రూ.30 ల‌క్షల వ‌ర‌కు ధర పలుకుతోంది. ఈ కారును కంపెనీ త్వరలోనే మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నది. ఇది ఎలక్ట్రిక్‌ కారు కావడం విశేషం.

Exit mobile version