Site icon vidhaatha

Paris Olympics 2024 | అట్టహాసంగా విశ్వ క్రీడల ఆరంభ వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా భారత క్రీడాకారులు..!

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తొలిసారిగా స్టేడియంలో కాకుండా పారిస్ నగరంలోని సెన్ నదిపై వేడుకలను నిర్వహించారు. కళ్లు జిగేల్‌మనే లైటింగ్స్, వాటర్ విన్యాసాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టోర్నీలో పాల్గొనే ఆయా దేశాల అథ్లెట్లు పడవల్లో పరేడ్ నిర్వహించారు.

గ్రీస్ దేశంతో ప్రపంచ దేశాల క్రీడాకారుల పడవ పరేడ్ ప్రారంభమైంది. ఫ్రెంచ్ అక్షరమాల ప్రకారం ఆయా దేశాలు పడవల్లో పరేడ్ నిర్వహించాయి. ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌కు గౌరవార్థంగా పరేడ్‌లో ముందు అవకాశం ఇచ్చారు. రెండో స్థానంలో శరణార్థుల ఒలింపిక్ టీమ్ వచ్చింది. భారత్ 84వ దేశంగా ఈ పరేడ్‌లో పాల్గొన్నది. టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫ్లాగ్ బేరర్స్‌గా వ్యవహరించారు.

భారత బృందంలోని అధికారులు, అథ్లెట్లు మొత్తం 78 మంది ఈ పరేడ్‌లో పాల్గొన్నారు. వీరంతా ఈ ఆరంభ వేడుకల కోసం రూపొందించిన ప్రత్యేకమైన సంప్రదాయ దుస్తులను ధరించారు. ప్రతి ఒక్కరూ మువ్వెన్నెల జెండా పట్టుకొని అభివాదం చేశారు. మహిళా అథ్లెట్లు భారత సంస్కృతి ప్రతిబింబించేలా చీరకట్టులో ఆకట్టుకున్నారు. పురుష అథ్లెట్లు షెర్వానీలో మెరిశారు.

ఈ విశ్వ క్రీడల ఆరంభ వేడుకలను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సెన్ నది తీరం వెంబడి భారీ సంఖ్యలో హాజరై ఆరంభ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు. వర్షం పడినా ఆరంభ వేడుకలు ఆగలేదు. భారత్ నుంచి మొత్తం 117 మంది పారిస్ ఒలింపిక్స్‌ బరిలో నిలిచారు. భారత క్రీడాకారులు 16 ఈవెంట్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో ఏడు పతకాలతో 48వ స్థానంలో నిలిచిన భారత్‌ ఇప్పుడు ఆ రికార్డును అధిగమించాలనే లక్ష్యంతో ఉన్నది.

Exit mobile version