గతంలో బెంగళూరు (Royal Challengers Bengaluru)మూడు సార్లు ఫైనల్‌కు చేరుకున్నా, అన్నింటిలో ఓడిపోయి కప్పు అందుకునే అవకాశాన్ని చేజార్చుకుంది. ఫైనల్‌కు చేరుకోవడం బెంగళూరుకు ఇది నాలుగోసారి. ఈసారైనా కప్ కొట్టి, 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఘన బహుమతిగా ఇవ్వాలనేది జట్టు కోరిక. అన్నట్లు కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18.
టాస్ గెలిచి, పంజాబ్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన బెంగళూరు, తన నిర్ణయం సరైనదేనని నిరూపించుకుంది. బెంగళూరు బౌలర్లు పంజాబ్‌ను నిప్పులవంటి బంతులతో హడలెత్తించారు. రెండో ఓవర్లోనే పంజాబ్ వికెట్ల పతనానికి నాంది పలికిన బెంగళూరు బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో పరుగులు రాబట్టడం గగనమైపోయింది. దాదాపు ప్రతీ పది పరుగులకో వికెట్ కోల్పోయిన పంజాబ్ మొత్తానికి 101 పరుగులకు ఆలౌట్ (101 Allout)అయింది. 26 పరుగులు చేసిన స్టెయినిస్ టాప్ స్కోరర్. ఆర్సీబీ బౌలర్లలో హేజిల్‌వుడ్, సుయశ్ శర్మ మూడు వికెట్లతో రాణించగా, యశ్‌దయాల్ 2, భువనేశ్వర్, షెప్పర్డ్ చెరో వికెట్ తీసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు, ధాటిగా ప్రారంభించినా, కోహ్లీ(12) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్(56 నాటౌట్)(Phil Salt) ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి, మయాంక్, పటీదార్ల సహకారంతో పని పూర్తిచేసాడు. చివరికి సరిగ్గా పది ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు(106 for 2) చేసి ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. జేమీసన్, ముషీర్ చెరో వికెట్ సాధించారు.
రేపు గుజరాత్, ముంబై జట్ల మధ్య జరుగబోయే ఎలిమినేటర్(Eliminator) మ్యాచ్ విజేతతో నేడు ఓడిపోయిన పంజాబ్ క్వాలిఫయర్–2(Qualifier-2) మ్యాచ్ ఆడుతుంది. ఒకవేళ అందులో గెలిస్తే, మళ్లీ బెంగుళూరుతోనే ఫైనల్ ఆడాల్సివుంటుంది.