విధాత : క్రికెట్ వండర్ గా మారిపోయిన టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ఆఫ్ ఫీల్డ్ లో మరో ఘనత సాధించాడు. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డును అందుకున్నాడు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ పురస్కారం స్వీకరించాడు. చిన్న వయసులోనే క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకు గానూ వైభవ్‌ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
ఐపీఎల్ (IPL) 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున తన మొదటి మ్యాచ్ ఆడిన వైభవ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అతి పిన్న వయసులో (14 ఏళ్ల 23 రోజులు) అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆడిన మూడో మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. తర్వాత ఆసియా కప్ రైజింగ్ స్టార్స్, అండర్ -19 ఆసియా కప్, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీల్లోనూ సెంచరీలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతి పిన్న వయసులో శతకం (14 ఏళ్ల 250 రోజులు) బాదిన క్రికెటర్‌గా రికార్డ్ సృష్టించాడు.
తాజాగా విజయ్ హజారే ట్రోఫీలోనూ బుధవారం అరుణాచల్‌ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో బిహార్ తరఫున వైభవ్ సూర్యవంశీ కేవలం 36 బంతుల్లోనే సెంచరీ బాదాడు. ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన అతడు (190; 84 బంతుల్లో; 16 ఫోర్లు, 15 సిక్స్‌లు) కాస్తలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జనవరి-ఫిబ్రవరిలో జింబాబ్వే, నమీబియాలో జరిగే అండర్-19 ప్రపంచకప్‌నకు వైభవ్ ఎంపిక కావడం ఖాయం. త్వరలోనే వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో ఆడతాడనడంలో అతిశయోక్తి కాదు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ 16 ఏళ్ల వయసులోనే అరంగేట్రం చేశాడు. వైభవ్ అంతకుముందే అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు టీమిండియాకు ఎంపిక కావచ్చుంటున్నారు నిపుణులు.
ఇవి కూడా చదవండి :
Wedding Dates In 2026 : కొత్త ఏడాదిలో వివాహాలకు ముహూర్తాలు ఇవే!
Pongal Fight | సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ .. పోటా పోటీగా 7 సినిమాలు .. హై వోల్టేజ్ క్లాష్‌లో నెగ్గేదెవరో?
