Pongal Fight | సంక్రాంతి బాక్సాఫీస్ రేస్ .. పోటా పోటీగా 7 సినిమాలు .. హై వోల్టేజ్ క్లాష్‌లో నెగ్గేదెవ‌రో?

Pongal Fight | ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సినీ సందడి గట్టిగానే ఉండబోతోంది. నువ్వా నేనా అన్నట్లుగా తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీలో నిలుస్తుండటంతో థియేటర్లు కళకళలాడనున్నాయి.

Pongal Fight | ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద సినీ సందడి గట్టిగానే ఉండబోతోంది. నువ్వా నేనా అన్నట్లుగా తెలుగు సినిమాలతో పాటు పలు డబ్బింగ్ చిత్రాలు కూడా పోటీలో నిలుస్తుండటంతో థియేటర్లు కళకళలాడనున్నాయి. స్టార్ హీరోలు ప్రభాస్, చిరంజీవి సినిమాల నుంచి యువ హీరోలు నవీన్ పోలిశెట్టి, శర్వానంద్ వరకు వరుసగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈసారి సంక్రాంతి రేస్ మరింత ఆసక్తికరంగా మారింది. అయితే విడుదలయ్యే సినిమాలు ఎక్కువగా ఉండటంతో… అన్నీ అనుకున్న తేదీలకే వస్తాయా? లేక కొన్ని వాయిదా పడతాయా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ది రాజా సాబ్ – ప్రభాస్ నుంచి హారర్ ట్రీట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న హారర్ మూవీ ‘ది రాజా సాబ్’ జనవరి 9న థియేటర్లలోకి రానుంది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జనవరి 8న ప్రీమియర్లు కూడా ప్లాన్ చేశారు. కామెడీ హారర్ జానర్‌లో ప్రభాస్ సరికొత్త యాంగిల్‌లో కనిపించనున్నాడనే హైప్ సినిమాపై భారీగా ఉంది.

మెగాస్టార్ 157వ సినిమా – మన శంకర వరప్రసాద్ గారు

దర్శకుడు అనిల్ రావిపూడి – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’

మాస్ మహారాజా రవితేజ హీరోగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై మంచి బజ్ ఉంది.

ఒకే రోజు యువ హీరోల పోటీ

జనవరి 14న యువ హీరోల మధ్య నేరుగా క్లాష్ జరగనుంది. నవీన్ పోలిశెట్టి – దర్శకుడు కల్యాణ్ శంకర్ కాంబోలో తెరకెక్కిన ‘అనగనగా ఒక రాజు’ కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. నవీన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. మరోవైపు, శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య కీలక పాత్రల్లో నటించిన ‘నారి నారి నడుమ మురారి’ కూడా అదే రోజు విడుదల కానుంది. ఈ సినిమాను రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

డబ్బింగ్ చిత్రాల దూకుడు

తెలుగు సినిమాలతో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా సంక్రాంతి రేస్‌లో ఉన్నాయి. దళపతి విజయ్ నటించిన ‘జననాయకుడు’ జనవరి 9న విడుదల కానుంది. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మ‌రోవైపు శివకార్తికేయన్ – సుధా కొంగర కాంబోలో తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ మొదట జనవరి 14గా అనుకున్నా, తాజాగా జనవరి 10కి రీషెడ్యూల్ చేశారు. ఇందులో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఏ సినిమాకు హైప్ ఎక్కువ?

మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 7 సినిమాలు పోటీపడుతున్నాయి. దీంతో థియేటర్ల అడ్వాన్స్ బుకింగ్స్, స్క్రీన్ల పంపిణీ కష్టంగానే ఉండనుంది. అందుకే చివరి నిమిషంలో ఏదైనా సినిమా వాయిదా పడుతుందా? లేక అందరూ అనుకున్న తేదీలకే వస్తారా? అన్నది వేచిచూడాల్సిందే.

హైప్ పరంగా చూస్తే, ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చే అవకాశముంది. యువ హీరోల సినిమాలు కూడా కంటెంట్ బలంగా ఉంటే సంక్రాంతి రేస్‌ను మరింత ఆసక్తికరంగా మార్చడం ఖాయం.

Latest News