Site icon vidhaatha

King Cobra viral video | షాకింగ్ వీడియో: అది కింగ్​ కోబ్రా కాదు, నువ్వు మనిషివీ కాదు..వామ్మో..

Adharva / Viral News / 17 July 2025
King Cobra viral video | పాము అంటేనే చాలు – చాలా మందికి హడలెత్తిపోతుంది. అంతేకాదు, అది కింగ్ కోబ్రా అయితే ఇక చెప్పేదేముంది! కానీ ఇటీవల వైరల్ అయిన ఒక వీడియోలో ఓ వ్యక్తి ఏ మాత్రం ఆందోళన లేకుండా, ఏ విధమైన భద్రతా జాగ్రత్తలు లేకుండానే… ఒక భారీ కోబ్రాను తన చేతులతో పట్టుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో పంచుకున్న వ్యక్తి మరెవరో కాదు –ఐఎఫ్​ఎస్​ అధికారి ప్రవీణ్ కస్వాన్. “ ఈ కింగ్ కోబ్రా సైజు చూసి మీరు ఆశ్చర్యపోయిఉంటారు . నిజంగానే కళ్లముందు ఇలాంటిది కనబడితే ఏం చేస్తారు? అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేశారు. కేవలం 11 సెకన్ల ఈవీడియో క్లిప్‌లో, ఒక మనిషి సుమారు 17 అడుగుల పొడవు ఉన్న గిరినాగును పట్టుకుని ఏ మాత్రం భయంలేకుండా, నిలబడటం చూసి నెటిజన్లు ఒక్కసారిగా ఆశ్చర్యంతో మునిగిపోయారు. పైగా అది చాలా లావుగా, బరువుగా కూడా ఉంది. దాన్ని పట్టుకోవడం మాత్రమే కాదు, మోయడం కూడా కష్టమే. కానీ, కింగ్​ కోబ్రా ఇంత పొడవు, లాంవు ఉంటుందని మాత్రం ఇప్పుడే తెలిసిందని అందరూ అంగీకరిస్తారు. ఏదైమైనా అతని గుండె ధైర్యానికి మాత్రం దండం పెట్టాల్సిందే. కింగ్ కోబ్రా అంటేనే ప్రపంచంలో అత్యంత పొడవైన విషపూరిత పాము. ఇది గరిష్ఠంగా 18 అడుగుల వరకు పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. భారతదేశంలో వీటిని పశ్చిమ, తూర్పు కనుమలు, అలాగే ఈశాన్య రాష్ట్రాలు – అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ లాంటి అటవీ ప్రాంతాల్లో చూడవచ్చు. ఇవి దట్టమైన అడవులలో నివసించడంతోపాటు, తాము మనుషులను చూసినప్పుడు తక్షణమే తప్పించుకునే స్వభావం కలిగి ఉంటాయి. కానీ, మానవులు దూరం ఉండకపోతే మాత్రం ప్రమాదకరంగా మారే అవకాశముంది.

వీడియో చూడండి:

ఒక కాటుతో ఏనుగును కూడా చంపగల కోబ్రా!

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాముల జాబితాలో కింగ్ కోబ్రా (King Cobra) ముందువరుసలో నిలుస్తుంది. దీని విషం(Venom) పరిమాణం దృష్ట్యా అత్యంత ప్రమాదకరం. ఒకే ఒక్క కాటు ద్వారా ఈ పాము 400–600 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేయగలదు. ఇది సుమారుగా 20 మంది మనుషులను లేదా ఒక ఏనుగును చంపగల మోతాదు. కింగ్ కోబ్రా విషం ప్రధానంగా న్యూరోటాక్సిక్(Neuro-toxic) స్వభావం కలిగి ఉంటుంది. ఇది నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతూ, శ్వాసను మందగింపచేస్తుంది. చికిత్స ఆలస్యం అయితే, కేవలం 30 నిమిషాల లోపే మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. విష ప్రభావంతో బాధితునికి పక్షవాతం, తలగిరుగుడు, చూపు మసకబారడం, మాట్లాడలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే కాటేసిన చోట వాపు, నొప్పి, మంట వంటి సమస్యలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో గొంతు భాగం మెల్లగా దెబ్బతింటూ శ్వాస ఆగిపోవచ్చు.

తప్పించుకు తిరిగే పాములు

అయితే స్వతహాగా సిగ్గరులైన ఈ పాములు సాధారణంగా మానవులను తప్పించుకుంటాయి. గుట్టలు, అడవులు, తక్కువ జనం ఉండే ప్రాంతాల్లో నివసించే ఈ పాములు తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కాటు వేస్తాయి. కింగ్ కోబ్రా కాటుకు ప్రత్యేకంగా తయారైన ఓహ్మావ్​ (OhMAV) అనే విరుగుడు ఇంజెక్షన్​(Anti-Venom) థాయ్‌లాండ్‌లో ఉత్పత్తి అవుతుంది. అయినా ప్రాంతానుసారంగా విష లక్షణాలు మారిపోతూ ఉండటం వల్ల, సమయానికి చికిత్స అత్యంత కీలకం. ఇది కేవలం పాముల్ని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తాయి. కింగ్ కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనదే కానీ… అవగాహన, జాగ్రత్త, వెంటనే చికిత్స తీసుకుంటే ప్రాణాలు రక్షించుకోవచ్చు.
ఇటీవలే మరో ఆసక్తికర సంఘటన కేరళలో జరిగింది. తిరువనంతపురం జిల్లాలోని పెప్పారా ప్రాంతంలో, ప్రవాహంలో ఇరుక్కుపోయిన భారీ కోబ్రాను ఓ మహిళా అటవీ అధికారిణి అద్భుతంగా రక్షించారు. ఆమె సాహసం చూసిన ప్రజలు హృదయపూర్వకంగా మెచ్చుకున్నారు. ఆమె నైపుణ్యంతోపాటు, భారత అడవుల లోతుల్లో పనిచేసే అధికారుల సేవలపై కొత్తగా దృష్టి మళ్లింది. ఈ రెండు వీడియోలు ప్రజల్లో ఒకవైపు భయాన్ని, మరోవైపు వన్యప్రాణుల పట్ల గౌరవాన్ని కలిగిస్తున్నాయి. నాగుపాములపై భయం కాకుండా అవగాహన కలిగి ఉండడం ఎంత ముఖ్యమో ఈ సందర్భంలో గుర్తించాలి. వీటిని ఎదుర్కొనాలంటే సమయోచిత స్పందన, నెమ్మదైన చర్యలే ఉపశమన మార్గాలు. “పామును చూస్తే దూరంగా వెళ్ళండి, హడావుడి చేయొద్దు” అనే సందేశాన్ని ఇటువంటి వీడియోలు చక్కగా చూపిస్తున్నాయి. వాటిని చూస్తేనే దడుచుకునే మనం… ఇంక చేతులతో పట్టుకునే వారి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే!

Exit mobile version