Amazing Facts About Snakes | పాముల గురించి 16 ఆశ్చర్యకర నిజాలు! వీటిలో మీకెన్ని తెలుసు?

పాములు.. ప్రకృతిలో సమతుల్యం కాపాడే జీవులు. వాటిలో విషపూరితాలు కొన్ని, విషరహితాలు ఎన్నో! అయితే.. ఈ పాములకు సంబంధించి కొన్ని ఆశ్చర్యకర అంశాలు ఉన్నాయి. వాటిలో మీకు ఎన్ని తెలుసో సరదాగా చెక్‌ చేసుకోండి!

Amazing Facts About Snakes | పాములను చూస్తే చాలా మందికి భయం. అవి విషపూరితాలైనా, విషరహితాలైనా.. ముందుగా భయపడిపోవడం, వీలైతే ఏ కర్రనో తీసుకుని చంపేయడం.. సాధారణంగా జరుగుతూ ఉండేది. కాస్తంత అవగాహన ఉన్నవాళ్లయితే పాములు పట్టే స్వచ్ఛంద సంస్థలకు ఫోన్‌ చేసి.. వాటిని కాపాడుతూ ఉంటారు. మూడు వేలకుపైగా సర్ప జాతులు ఉంటే.. అందులో సుమారు 600 మాత్రమే విషపూరితాలని సర్ప శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పాముల గురించి పదహారు ఆశ్చర్యకర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

1. పాములు అత్యంత సిగ్గరితనంతో, రహస్యంగా ఉంటాయి. సరదాగా బయటకు వెళ్లి వేటాడటం వంటి పనులు పెట్టుకోవు. పాములు సహజంగా ఉద్రేకంతో ఉండవు. కేవలం ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వేటాడుతాయి. లేదా.. తమను తాము రక్షించుకోవాల్సి వచ్చినప్పుడే దాడి చేస్తాయి.

2. పాములు చాలా వరకూ ఏకాంత జీవులు. జతకట్టే సమయం ఇందుకు మినహాయింపు. అనాకొండాలు జత కట్టే సమయంలో గుంపులుగా ఉంటాయి. ఒక్కో ఆడ అనాకొండ.. సుమారు 12 మగ అనాకొండాలతో జతకడుతుంది. అదికూడా ఒక్క నెల మాత్రమే. అదీ వాటి ప్రకృతి జీవనం.

3. భూమిపై చాలా ప్రాంతాల్లో పాములు కనిపిస్తాయి. కానీ.. అంటార్కిటికా, ఉత్తర ధృవం, గ్రీన్‌లాండ్‌, ఐస్‌లాండ్‌, ఐర్లాండ్‌, న్యూజీలాండ్‌లో మాత్రం పాములు కనిపించవు.

4, ప్రపంచవ్యాప్తంగా సుమారు 3వేల వరకూ వేర్వేరు జాతుల సర్పాలు ఉన్నాయి. కానీ.. వాటిలో సుమారు 600 జాతుల సర్పాలు మాత్రమే విషపూరితమైనవి. అందులోనూ సుమారు 200 జాతుల సర్పాలు మాత్రమే మనిషిని చంపగల, లేదా తీవ్రంగా గాయపర్చగల విషాన్ని కలిగి ఉంటాయి.

5. పాములు ఆహారాన్ని వేటాడిన సమయంలో (ఎలుకలు, పందికొక్కులు, పిల్లులు, కుక్కలు లేదా ఇతర చిన్న జంతువులు) వాటిని కాటు వేస్తుంది. ఆ సమయంలో విషం దాని ఆహారంలోకి ప్రవేశించి.. స్థాణువుగా మార్చేస్తుంది. మరోవైపు అదే విషం.. సదరు ఆహారపు మాంసాన్ని విచ్ఛిన్నం చేసి.. సులభంగా జీర్ణమయ్యేలా చూస్తుంది. నిజానికి విషపూరిత పాములకు వాటిలో విషం ఉందన్న సంగతి కూడా తెలియదు. అనేక పాములు పొరపాటున తమను తామే కాటువేసుకుని చనిపోతుంటాయి.

6. అమెరికాలో పిడుగులు పడి చనిపోయేవారికంటే పాము కాట్లతో చనిపోయేవారే ఎక్కువట!

7. పాములను చూసి ఎక్కువగా భయపడటాన్ని ఓఫిడియోఫోబియా అని పిలుస్తారు.

8. అత్యంత విషపూరితమైన కొన్ని జాతుల్లో ఎక్కువ భాగం సముద్రజలాల్లో నివసిస్తాయి. అయితే.. వాటి నుంచి మనుషులకు పెద్దగా ప్రమాదం లేదు. ఎందుకంటే అవి చాలా సిగ్గరి. అంతేకాదు.. వాటి కోరలు కూడా చాలా చిన్నగా ఉంటాయి. కనుక సముద్ర జలాల్లో డైవింగ్‌ చేసేవారిని అంత సులభంగా కాటువేయలేవు.

9. చాలా వరకూ పాములు గుడ్డు పెట్టి.. పిల్ల పాములను పొదుగుతాయి. కొన్ని జాతులు మాత్రం నేరుగా పాము పిల్లలను ప్రసవిస్తాయి. తల్లి కొండచిలువలు తమ గుడ్లను పొదుగుతాయి. కింగ్‌ కోబ్రాల విషయానికి వస్తే.. అవి తమ గుడ్లను కాపాడుకోవడమే కాదు.. వాటికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటే ఎదురుదాడికి దిగి మరీ రక్షించుకుంటాయి. కొన్ని పాములు తమంతట తామే పిల్లలను కంటాయి. చిన్నగా ఉండే బ్రహ్మినీ గుడ్డి పాము.. (ఫ్లవర్‌పాట్‌ పాము) ఒక్కటే తనంతట తానుగా పునరుత్పత్తి చేసుకోగలదు.

10. పాములు సరీసృపాలు. ఈ భూమిపై సుమారు పది కోట్ల సంవత్సరాల నుంచీ ఉన్నాయని అంచనా. ఇవి ప్రిహిస్టారిక్‌ బల్లుల నుంచి అవతరించాయి. ఏడు కోట్ల సంవత్సరాల క్రితం వరకూ వాటికి కాళ్లు ఉండేవి. కాలక్రమేణా అవి కాళ్లను కోల్పోయాయి. దానిని నిదర్శనంగా కొన్ని కొండచిలువలు, బోవా అనే ఒక తరహా అనాకొండలకు నల్లని కాళ్లను పోలిన ఆనవాళ్లు ఇప్పటికీ కనిపిస్తాయి.

11. పాములు తమ నాలుకల ద్వారా వాసనలను పసిగడతాయి. అంతేకాదు.. ఏ దిశ నుంచి ఆ వాసన వస్తున్నదో కూడా గుర్తించగలుగుతాయి. అది కనుక వాటి ఆహారమైతే.. ఆ దిశగా వెళ్లి దాడి చేస్తాయి.

12. కొన్ని సముద్రజాతి పాములు తమ శరీరం ద్వారా ఆక్సిజన్‌ను పీల్చుకుంటాయి. తద్వారా నీటి అట్టడుగున దీర్ఘకాలం నివసించగలుగుతాయి.

13. విచిత్రమైన విషయం ఏమిటంటే.. పాములు సాధారణంగా సోలార్‌ పవర్డ్‌ జీవులు. సూర్యకాంతి నుంచే అవి శక్తిని పొందుతాయి. వెచ్చదనం లేకపోతే.. అవి కదలలేవు.. తిన్న ఆహారాన్ని జీర్ణించుకోనూ లేవు. అందుకే పాములు ఎక్కువగా గుట్టలు, రాళ్లు ఉన్న ప్రాంతాల్లో తలదాచుకుంటాయి. బండరాళ్లు సూర్యరశ్మిని తమలోకి తీసుకుంటాయి. కనుక అవి వెచ్చగా ఉండటంతో పాములు వాటి మధ్యకు చేరుతాయి. చలికాలంలో బ్రూమేషన్‌ అనే ప్రక్రియ ద్వారా తమను తాము కాపాడుకుంటాయి.

14. పాముల్లో 1200 వరకూ ఎముకలు ఉంటాయి. వయోజనులైన మనుషులకు 206 ఎముకలు మాత్రమే ఉంటాయి.

15. పాముల పొలుసులు మనిషి జుట్టు, గోర్లలో ఉండే కెరాటిన్‌ అనే పదార్థాన్ని కలిగి ఉంటాయి. అవి చాలా సున్నితమైనవి. నొప్పిని కూడా అనుభవిస్తాయి.

16. పాములకు కంటి చూపు అంత గొప్పగా ఉండదు. పాములు తమను భయపెట్టే సందర్భాల్లో మాత్రమే రియాక్ట్‌ అవుతాయి. చాలా పాములకు కలర్‌ విజన్‌ ఉండదు. మీకు పాము తారసపడితే.. కదలకుండా నిలబడితే వాటికి అదేదో చెట్టులానో లేదా బండరాయిలానో ఊహించుకుంటాయి.

శారీరకంగా పాములు చల్లటి రక్తాన్ని (కోల్డ్‌ బ్లడెడ్‌) కలిగి ఉంటాయి. కానీ.. మనుషులు పాముల పట్ల కిరాతకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆహారం కోసమో, మద్యం తయారీకి, పాము రక్తం కోసం, పాముల చర్మాలతో దుస్తులు, అలంకరణ సామగ్రి తయారీకి యథేచ్ఛగా చంపేస్తూ ఉంటారు. వీటికోసం ఒక్క ఇండోనేషియా, మలేషియా, వియత్నాంలలోనే 4.40 లక్షల కొండచిలువలను చంపుతున్నారు. మీ నివాసాల పరిసరాల్లోకి పాములు వస్తే.. అవి పర్యావరణ హిత జీవులని గుర్తించండి. పంటల పొలాలను నాశనం చేసే ఎలుకలు, పందికొక్కులు, బల్లుల వంటి చిన్న జీవులను చంపి తింటూ పర్యావరణానికి మేలు చేస్తున్న విషయాన్ని గ్రహించండి. వాటిని రక్షించండి.

పాముల గురించి ఎక్కువ మంది చదివిన కథనాలు.. మరి మీరు చదివారా?

Snakes Love explained | పాముల ప్రేమ నిజమేనా? నాగరాజు, నాగిని అనుబంధంపై మళ్లీ చర్చను రేపిన రెండు పాముల విషాదాంతం!
Snake Dens | దాదాపు లక్షన్నర పాములు ‘కలిసే’ అతిపెద్ద ‘పాముల జాత‌ర’ ఎక్కడో తెలుసా?
Snakes Brumation | చలికాలంలో పాములు ఎక్కడ ఉంటాయి? వాటిని కాపాడే బ్రూమేషన్‌ అంటే ఏంటో తెలుసా?
(వీడియో) Robots Catch pythons | కొండచిలువలను పట్టిస్తున్న ‘కుందేళ్లు’!

Latest News