Snake Breeding Season | పాములు జతకట్టే సీజన్‌ ఇది.. ఈ సమయంలో పాములు ఎలా ప్రవర్తిస్తాయో తెలుసా?

ఇది పాములు జత కట్టే సీజన్‌. ఈ సమయంలో పాములు చాలా అగ్రెసివ్‌గా ఉంటాయని, గ్రామీణ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Snake Breeding Season | ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ఈ డిసెంబర్‌ వరకూ కాలినడకన వెళ్లేవారు కాస్త చూసుకుంటూ వెళ్లాలని! అంతేకాదు.. ఇళ్లలో కూడా ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవాలని సూచిస్తున్నారు! ఎందుకంటే.. డిసెంబర్‌ నెల వరకూ పాములు యథేచ్ఛగా తిరుగుతుంటాయి. ఎందుకంటే ఇది వాటికి ‘జత కట్టే’ సమయం. ఈ సమయంలో ఆడ తోడు వెతుక్కుంటూ మగ పాములు తిరుగుతూ ఉంటాయట. ఈ సీజన్‌లో పాములు మంచి మూడ్‌లో ఉంటాయని, కనుక వాటి దారికి అడ్డుపోవద్దని సూచిస్తున్నారు. సెప్టెంబర్‌–అక్టోబర్‌ నెల మధ్యలో ఇప్పటికే ఇళ్లలోకి, ఇళ్ల సమీపంలోకి వచ్చిన సుమారు 4వేల పాములను రక్షించారు. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. పాములు జత కట్టే ఈ సీజన్‌లో మనుషులు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఆడ పాములు ఫెరోమోన్‌ అనే రసాయాన్ని విడుదల చేస్తూ పోతూ ఉంటాయి. మగ పాములకు అదొక సంకేతం. ఆ రసాయనం ద్వారా మగ పాములకు అత్యంత ఇష్టమైన ఒక సువాసన వస్తుందట. దానిని వెతుక్కుంటూ మగ పాములు బుసలు కొడుతూ వెతుకుతుంటాయట. ఈ ప్రక్రియలో ఎంత దూరం వెళ్లాయో.. ఎక్కడికి వెళ్లాయో కూడా మగపాములు గుర్తించలేవని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బలమైన, తెలివైన పాములు మాత్రమే ఆడ పాముల చెంతకు చేరగలవని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఆడ పామును దక్కించుకునేందుకు మగ పాముల మధ్య భీకర పోరాటాలు కూడా సాగుతాయని చెబుతున్నారు. ఆ సమయంలో అక్కడ ఉండే మనుషులను కాటు వేసే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్‌ వరకూ జాగ్రత్తగా ఉండాలని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కేరళ అధికారులు కోరుతున్నారు. నిజానికి ఈ జత కట్టే సమయం అన్ని చోట్లా ఇదే కాలం కావడంతో ఈ హెచ్చరిక అన్ని గ్రామీణ ప్రాంతాలకు, ప్రత్యేకించి అటవీ ప్రాంతాల్లోని జనావాసాలకు వర్తిస్తుందని అంటున్నారు.

కేరళలో సెప్టెంబర్‌ – అక్టోబర్‌ నెలల్లోనే సుమారు 4000 పాములను రక్షించారు. ఇది అంతకు ముందు నెలలతో పోల్చితే చాలా అధికం. సాధారణ నెలల్లో అధికారులు రక్షించే పాముల సంఖ్య 1500 లోపే ఉటుందట. 2024లో సెప్టెంబర్‌ — డిసెంబర్‌ నెలల మధ్య ‘సర్ప వాలంటీర్లు’ రక్షించిన పాముల సంఖ్యకు ఇది 36 శాతం అధికమని కేరళ అధికారులు తెలిపారు. సాధారణంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ పాములు జత కట్టే సీజన్‌ అయినప్పటికీ.. వర్షాలతో ఈ ప్యాట్రన్‌లో కొన్ని మార్పులు కనిపించాయని, అందుకే పెద్ద సంఖ్యలో పాములు జనవాసాల్లోకి వచ్చిన సమయంలో వాటిని రక్షించినట్టు అధికారులు చెబుతున్నారు.

‘ఆడ పామును గెలుచుకునే క్రమంలో అనేక మగ పాములు పోటీ పడతాయి. ఆ సమయంలో అవి చాలా దుందుడుకు స్వభావంతో ఉంటాయి. సాధారణంగా పాములు ఘర్షణను కోరుకోవు. అవి తమ పుట్టల నుంచి ఆహారం కోసం లేదా ఎండ కోసం బయటకు వస్తూ ఉంటాయి. జత కట్టే సీజన్‌లో ఒక్కసారి అవి ఫెరోమోన్‌ వాసన పీల్చాయంటే వాటిని ఏవీ ఆపలేవు. రాత్రిపూట మాత్రమే బయటకు వచ్చే పాములు కూడా చాలా చోట్ల పగటిపూట కూడా కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అసాధారణ ప్రాంతాల్లో కూడా పాములు ఉంటాయనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించడం చాలా ముఖ్యం’ అని పాముల రక్షణ స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్స్‌ ముహమ్మద్‌ అన్వర్‌ వై చెప్పారు.

కింగ్‌ కోబ్రా వంటి సర్పాలు.. దూకుడు స్వభావంతోపాటు.. తమ పడగ విప్పి ఆడుతూ ఆడపాములను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తాయి. కింగ్‌ కోబ్రాలు ఆడ తోడు వెతుక్కుంటూ పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కూడా ప్రయాణించగలవు. ‘సాధారణంగా పాములు తమ ఆవాసాలను భీకరంగా రక్షించుకుంటాయి. ఆడ తోడు వెతుక్కుంటూ వెళ్లే సమయంలో అవి చాలా దూకుడుగా, పోటీ తత్వంతో ఉంటాయి. ఎందుకంటే.. ఈ సమయంలో పాముల్లో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ స్థాయి చాలా అధికంగా ఉంటుంది. ఆడ పామును గెలుచుకునే సమయంలో అవి తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. బలమైన మగ పాములు ఆడ పామును దక్కించుకుంటాయి. ఓడిపోయిన పాములు తీవ్ర ఒత్తిడికి గురై.. తమ దారికి అడ్డు వచ్చిన వాటిని కాటు వేస్తాయి’ అని తిరువనంతపురం జూ మాజీ వెటర్నరియన్‌, పశుసంవర్ధక శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జాకబ్‌ అలెగ్జాండర్‌ తెలిపారు.

మాములు రోజుల్లో పాములను రక్షించడానికి, ఈ సీజన్‌లో పాములను రక్షించడానికి చాలా తేడా ఉందని శిక్షణ పొందని స్నేక్‌ క్యాచర్స్‌ చెబుతున్నారు. అదే సమయంలో ఎక్కువ పాములను ఇళ్లలోని కిచెన్‌, కాంపౌండ్‌, మూసివేసిన ప్రాంతాల్లో గమనించామని అంటున్నారు. ఒక ప్రాంతంలో ఒక పామును పట్టుకున్నామంటే ఆ చుట్టుపక్కల చాలా పాములు ఉన్నట్టు అర్థమని ఒక కేరళ పోలీసు విభాగంలో పనిచేస్తున్న ముహమ్మద్‌ షేబిన్‌ చెప్పారు. ఆయన పాములు పట్టడంలో శిక్షణ పొందారు. తాము ఒక పామును పట్టుకోగానే.. చుట్టుపక్కల ఇంకా పాములు ఉన్నాయా? అని వెతుకుతామని తెలిపారు.