Baghdad Battery | విద్యుచ్ఛక్తి అనేది ఆధునిక యుగం అందించిన బహుమానంగానే ఇప్పటి వరకూ భావిస్తూ వస్తున్నాం. అయితే.. ఇరాక్‌లో దొరికిన ఒక వింత వస్తువు.. ఈ నమ్మకాన్ని కొన్ని దశాబ్దాలుగా సవాలు చేస్తున్నది. ‘బాగ్దాద్ బ్యాటరీ’ చెబుతున్న ఈ వింత ఆబ్జెక్ట్‌పై కెమిస్ట్రీ వరల్డ్ (Chemistry World) జర్నల్‌లో ప్రచురితమైన కథనం.. మళ్లీ ఈ చర్చను వేడెక్కిస్తున్నది. సుమారు రెండు వేల ఏళ్లనాటిదిగా చెబుతున్న ఈ వస్తువు.. నిజంగానే బ్యాటరీగా పనిచేసిందా? లేక మతసంబంధిత ఆచార వ్యవహారాల్లో ఉపయోగించిన వస్తువా? అన్న ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది.
ఏమిటీ ‘బాగ్దాద్ బ్యాటరీ’…
అది 1930వ దశకం. ఇరాక్‌లోని ఖుజుట్ రబౌ (Khujut Rabu) అనే ప్రాంతంలో పురావస్తు శాస్త్రజ్ఞులు తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వారికి ఒక వింతైన వస్తువు కనిపించింది. అదొక మట్టికుండ. దాని విశేషం ఏమిటంటే.. అది అన్ని మట్టింకుండల్లా లేదు. అందులో ఒక రాగి సిలిండర్ వంటిది ఒకటి ఉంది. మరో విచిత్రం ఏమిటేంటే.. ఆ మధ్యలో ఒక ఇనుప కడ్డీ ఒకటి కనిపించింది. ఈ మూడింటినీ కలిపి గమనిస్తే.. ఇదొక ఆధుని గాల్వానిక్ సెల్ నిర్మాణాన్ని పోలి ఉన్నట్టు కొందరు శాస్త్రవేత్తలు భావించారు.
అలెగ్జాండర్ బాజెస్ అనే స్వతంత్ర పరిశోధకుడు ఈ వస్తువుకు పునఃసృష్టి చేసి, ప్రయోగాలు నిర్వహించాడు. ఇందులో ఒక రకమైన ద్రవం.. అంటే క్షారం, ఆమ్లం వంటివి పోస్తే.. సుమారు 1.1 నుంచి 1.4 వోల్టుల విద్యుత్తు ఉత్పత్తి చేయగలదని ఆయన నిర్వహించిన ప్రయోగాలతో వెల్లడైంది. అంటే.. దాదాపు ఒక AA బ్యాటరీ వోల్టేజ్‌తో సమానం అన్నమాట. ఇన్ని ప్రయోగాలు చేసినప్పటికీ బాజెస్ కూడా చెప్పేది తప్పు కూడా అయి ఉండొచ్చని.. కానీ ఇది నిజంగానే బ్యాటరీ అయినట్టయితే.. అది పనిచేసే విధానం మాత్రం ఇదేనని స్పష్టం చేశారు.
దీన్ని నగలు, ఆభరణాలకు బంగారుపూత పూసేందుకు ఉపయోగించి ఉండొచ్చనే ఒక వాదన ఉంది. అయితే.. బాజెస్ మాత్రం.. లోహపు పలకలను కరిగించే ఒకరకమైన ఆచార ప్రక్రియకు దీనిని ఉపయోగించి ఉండొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఏదిఏమైనా దీనిపై చాలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో పురావస్తు శాస్త్రవేత్తగా ఉన్న విలియం హాఫ్పోర్డ్ ఈ సిద్ధాంతాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఇటువంటి మట్టికుండల్లో మేకుల వంటి వాటిని పెట్టి, ప్రార్థన పత్రాలను లోపల వేసి, వాటిని భూమిలో పాతిపెట్టే ఆచారం అప్పట్లో ఉండేదనేది హఫ్ఫోర్డ్ వాదన. అంటే.. పాతాళ దేవతలకు అర్పణలుగా వీటిని ఉంచడం. అందుకే ఆయన ‘ఇవి బ్యాటరీలు కానేకాదు. ఇవి మంత్రాలు, తాంత్రిక ఆచారాలకు సంబంధించిన వస్తువులు’ అని ఆయన వాదించారు. కొన్ని ప్రాంతాల్లో ఒకే కుండలో పది వరకూ రాగి సిలిండర్లు దొరికిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ.. అవి బ్యాటరీ సిద్ధాంతానికి సరిపోవని చెబుతున్నారు.
బాగ్దాద్ బ్యాటరీ నిజమైన బ్యాటరీ వంటిదేననే విషయం శాస్త్రీయంగా నిరూపణ కాలేదు. అంటే.. దీనిపై పీర్ రివ్యూడ్ పరిశోధనలు తక్కువే. చాలామటుకు ప్రయోగాత్మకంగా చేసిన పునర్నిర్మాణాలు, పునఃసృష్టి, అదే విధంగా పురావస్తు వాదనల ఆధారంగానే ఈ చర్చలన్నీ నడుస్తున్నాయి.
బాగ్దాద్ బ్యాటరీ నిజమైనదా? కాదా? అనే సంగతిని పక్కనపెడితే.. ప్రాచీన నాగరికతల్లో మనం ఊహించిన దానికంటే ఎక్కువ సాంకేతిక అవగాహనను కలిగి ఉండేవారనే విషయాన్ని స్పష్టంచేస్తున్నది. అదికాకపోయినా.. కనీసం రసాయన శాస్త్ర లక్షణాలను అనుభవపూర్వకంగా ఉపయోగించి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బ్యాటరీ అయినా లేక మతపరమైన వస్తువైనా.. ఇది మాత్రం ప్రపంచ పురావస్తు శాస్త్రజ్ఞులకు ఇంకా కొరుకుడుపడని అతిపెద్ద మిస్టరీల్లో ఒకటిగా కొనసాగుతూనే ఉంది.
