Dark Oxygen Future Energy | హవాయి, మెక్సికో పశ్చిమ తీరం మధ్యలోని మహాసముద్ర ఉపరితలం నుంచి 13,123 అడుగుల లోతున భారీ స్థాయిలో నికెల్, మాంగనీస్, కాపర్, జింక్, కోబాల్ట్ వంటి అమూల్యమైన ఖనిజ సంపద కుప్పలు కుప్పలుగా ఉన్నట్టు పరిశోధకులు కనుగొన్నారు. ఈ ప్రాంతాన్ని పసిఫిక్ మహా సముద్రపు క్లారియన్ – క్లిప్పెర్టన్ జోన్ (Clarion-Clipperton Zone (CCZ)) అని పిలుస్తారు. ఇది సుమారు 4.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. అద్భుతమైన జీవ వ్యవస్థతోపాటు.. ఈ ప్రాంతంలో పాలీమెటాలిక్ నోడ్యూల్స్ (polymetallic nodules) అని పిలిచే రాళ్లు ఉన్నాయి. ఈ అపూరూపమైన ఖనిజాలను కలిగి ఉన్న ఈ రాళ్లు పర్యావరణ హిత విద్యుత్తు ఉత్పత్తికి పనికొస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతేకాదు.. మహాసముద్రాల్లో అత్యంత చీకటి లోతుల్లో ఆక్సిజన్‌ను కూడా ఇవి ఉత్పత్తి చేస్తున్నాయని పరిశోధకులు దీనిని డార్క్ ఆక్సిజన్‌గా పిలుస్తున్నారు. సూర్యకాంతి చొరబడని ప్రాంతంలో పుట్టేది కావడంతో దీనికి ఆ పేరు పెట్టారు. భూమిపై జీవం ఎలా మొదలైంది? అలాగే.. సౌర వ్యవస్థలో ఉన్న ఎన్సెలాడస్ లేదా యూరోపా, శని, బృహస్పతికి చెందిన మంచు చందమామలపై ఎలా పుట్టి ఉంటుంది? అనే అంశాల్లో ఇప్పటిదాకా ఉన్న నమ్మకాలను తాజా అధ్యయనం పటా పంచలు చేసిందని అంటున్నారు. ఈ పరిశోధనను నేచర్ జియోసైన్సెస్ (Nature Geoscience) జర్నల్‌లో ప్రచురించారు. ఫోటోసింథసిస్ ఆర్గానిజమ్స్ ద్వారా భూమిపై ఆక్సిజన్ సరఫరా మొదలైందని గత పరిశోధనలు చెబుతున్నాయని తాజా అధ్యయనం రచయితలు పేర్కొన్నారు.
వాయుసహిత జీవం (aerobic life) భూమిపై పుట్టడానికి ఆక్సిజన్ (oxygen) అవసరమని ఈ అధ్యయనానికి నాయకత్వం వహించిన డీప్ సీ ఎకోలజిస్ట్ అండ్రూ స్వీట్‌మాన్ చెప్పారు. ఈయన స్కాటిష్ అసోసియేషన్ ఫర్ మెరైన్ సైన్సెస్‌కు (Scottish Association for Marine Science) చెందినవారు. అయితే.. ఇప్పుడు శాస్త్రవేత్తలు కనుగొన్నది ఇందుకు భిన్నంగా ఉంది. సాధారణంగా సముద్రంలో కిందికి వెళుతున్న కొద్దీ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతూ ఉంటుందని పదేళ్ల క్రితం వరకూ అనుకున్నారని స్వీట్‌మన్ చెబుతున్నారు. కానీ.. సూర్యకాంతి చొరబడని సముద్ర గర్భంలో కూడా ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్నదంటే.. ఏరోబిక్ జీవం వాస్తవానికి ఎక్కడి నుంచి ప్రారంభమైందో మళ్లా ఆలోచించాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కానీ.. 2013లో సీసీజెడ్ ప్రాంతంలో అధిక ఆక్సిజన్ స్థాయిలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే.. అదేదో డాటా లోపం లేదా సిస్టమ్‌లో సమస్య అని తేలిగ్గా తీసుకున్నారు.
వివిధ రకాల బ్యాక్టీరియా, సూక్షజీవులు డార్క్ ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగలవని ఒక అధ్యయనం కనుగొన్న తర్వాత స్వీట్‌మన్ ఆ పరిస్థితులను పరిశోధన శాలలో పునఃసృష్టి చేశారు. సూక్షజీవులను మెర్క్యురీ క్లోరైడ్‌తో చంపినప్పుడు ఆక్సిజన్ స్థాయిలు పెరగడాన్ని ఆయన గమనించారు. ఈ రాళ్లు ఉపరితలం నుంచి 0.95 వోల్ట్స్ ఉత్పత్తి అవుతున్నదని కనుగొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న విద్యుత్తు సమస్యలను ఈ నోడ్యూల్స్ పరిష్కరిస్తాయన్న చర్చకు ఈ తాజా అధ్యయనం ఆజ్యం పోసింది. వీటిని వెలికి తీయాలని కొన్ని మైనింగ్ కంపెనీలు వాదిస్తున్నాయి. అయితే.. అటువంటి చర్యల పర్యవసానాలపై స్పష్టత వచ్చేంత వరకూ దీనిని ఆపాలని సుమారు 25 దేశాలు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ (ISA) కౌన్సిల్‌పై ఒత్తిడి చేస్తున్నాయి.