Site icon vidhaatha

Artificial Intelligence | ఏఐతో ఆ మూడు ప్రొఫెషన్స్‌కు ఎలాంటి భయం లేదు! బిల్ గేట్స్ గుడ్ న్యూస్‌

Artificial Intelligence | ఏఐ రోజు రోజుకూ ఆకాశపు రెక్కలు విప్పుకొంటున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బిక్కుబిక్కుమంటున్నారు. రోజుకో టెక్ దిగ్గజం ఏఐతో పోయే జాబులు ఇవే అంటూ లిస్టు చదువుతున్నారు. 2022లో ఓపెన్ఏఐ త‌న చాట్‌జీపీటీని ప్రారంభించిన ద‌గ్గ‌ర నుంచీ కృత్రిమ మేధ మ‌న ఆలోచ‌నా విధానాన్ని, మ‌నం చేసే ప‌నుల‌ను స‌మ‌గ్రంగా మార్చివేసింది. అనేక రంగాల్లో మానవ జోక్యాన్ని చాలా పరిమితం చేస్తున్నది. ఇప్పటికే దాని ప్రభావం కనిస్తూనే ఉన్నది. కోడ్ రాయడం చాట్ బాట్‌లలో ఈజీ అయిపోయింది. కవిత రాసేస్తున్నది. స్క్రిప్ట్ తానే రాసుకుని, తాను చదివి.. తానే యాంకర్ అవతారం ఎత్తుతూ.. తానే ఎడిట్ చేస్తూ.. కొత్త పుంతలు తొక్కుతున్నది. వార్తలు సైతం రాసి ఇచ్చేస్తున్నది. ఈ క్రమంలోనే అనేక ప‌నుల్లో చాట్‌జీపీటీతోపాటు జెమినై, కాపిలోట్‌, డీప్‌సీక్ వంటివి సాధానాలుగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయి. రానున్న కాలంలో ఈ కృత్రిమ మేధ విభిన్న రంగాల్లోని అనేక కొలువులను పీకి పందిరేస్తుందని ఈ రంగంలోని నిపుణులు గడ్డం దువ్వుకుంటూ చెబుతున్నారు. గత నెలలో ఒక అంచనాను వెల్లడించిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌.. అనేక అంశాల్లో మానవులను ఏఐ రీప్లేస్ చేస్తుందని చెప్పారు. అయితే.. మూడు రంగాల్లో మాత్రం అది ఎలాంటి ప్రభావం చూపలేదని హామీ ఇస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు కృత్రిమ మేధ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నాయన్న గేట్స్‌.. రానున్న సంవత్సరాల్లో భవిష్యత్తుకు ఏది అనుకూలంగా ఉంటుందని తాను భావిస్తున్నారో వాటిపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

తొలిదెబ్బ కోడింగ్ పైనే పడనున్నది. సమీప భవిష్యత్తుల్లో ఏఐ కారణంగా ఉపాధి కోల్పోవారిలో తొలి జాబితాలో కోడర్స్ ఉంటారని టెక్ దిగ్గజాలు నివిడియాకు చెందిన జెన్సెన్ హుయాంగ్‌, ఓపెన్‌ఏఐకి చెందిన సామ్ ఆల్టమన్‌, సేల్స్‌ఫోర్స్ సీఈవో మార్క్ బెనియాఫ్ వంటివారు చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో మానవులకు ముఖ్యమైన పాత్ర ఉంటుందని బిల్ గేట్స్ విశ్వసిస్తున్నారు. ఏఐ ఎన్ని రంగాలను ఆక్రమించిన మూడు రంగాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం లేదని ఆయన స్పష్టం చేశారు. అందులో మొదటివారు బయాలజిస్టులు. బయాలజిస్టులను ఏఐ రీప్లేస్ చేయజాలదని బిల్‌గేట్స్ అన్నారు. అయితే.. వ్యాధుల నిర్ధారణ వంటివాటిలో సాధనంగా ఉపయోగపడగలదని చెప్పారు. మరోటి డీఎన్‌ఏ విశ్లేషణ. ఎందుకంటే కృత్రిమ మేధకు శాస్త్రీయ ఆవిష్కరణలు చేసే సృజనాత్మకత లేదని అన్నారు. ఇక మూడో అంశానికి వస్తే.. ఎనర్జీ రంగ నిపుణులకు కూడా ఏఐతో ఎలాంటి ముప్పు లేదని చెప్పారు. ఈ రంగాన్ని పూర్తిగా ఆటోమేటెడ్‌గా మార్చడానికి చాలా సంక్లష్టతలు ఉన్నాయని గేట్స్ వివరించారు. జనరేటివ్ ఏఐ రోజురోజుకూ మరింత శక్తిమంతమవుతుండటంతో, అనేక మంది బిజినెస్ లీడర్లు ఈ సాంకేతికత మనం ఎలా పని చేస్తామనేదానిపై భారీ ప్రభావాన్ని చూపుతుందని, కొన్ని రంగాలలో ఏఐ.. మానవ మేధస్సును అధిగమిస్తుందని పునరుద్ఘాటిస్తున్నారు.

Exit mobile version