ఈ ఏడాదిలోనే 10వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు అదనం, దరఖాస్తులు చేసుకున్న.. కళాశాలలకు అనుమతులు

రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లోనే మరిన్ని కంప్యూటర్ సైన్స్‌, ఐటీ సంబంధిత డిమాండ్ ఉన్న బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తగిన మౌలిక వసతులు చూపిస్తే ఎన్ని సీట్లకైనా అనుమతిస్తామని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గత ఫిబ్రవరిలో విధి విధానాలు వెల్లడించింది.

  • Publish Date - June 8, 2024 / 02:21 PM IST

విధాత, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ప్రస్తుత విద్యా సంవత్సరం(2024-25)లోనే మరిన్ని కంప్యూటర్ సైన్స్‌, ఐటీ సంబంధిత డిమాండ్ ఉన్న బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. తగిన మౌలిక వసతులు చూపిస్తే ఎన్ని సీట్లకైనా అనుమతిస్తామని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గత ఫిబ్రవరిలో విధి విధానాలు వెల్లడించింది. దీంతో ఇప్పటికే పలు కళాశాలలు సీట్ల పెంపుకు అనుమతికై దరఖాస్తు చేసుకున్నాయి. కళాళాలలు పెంచుకునే సీట్లకు అవసరమైన తరగతి గదులు, కంప్యూటర్లను, అధ్యాపకులను చూపాల్సివుంది. అయితే ఆ కళాశాలలు న్యాక్ ఏ-గ్రేడ్ లేదంటే స్వయం ప్రతిపత్తి హోదా కలిగి ఉండటం తప్పనిసరి. అలాంటి కళాశాలలు రాష్ట్రంలో 65కుపైగా ఉన్నాయి. ఇందులో దాదాపు 50 కళాశాలలు కంప్యూటర్ సైన్స్ సీట్ల కోసం ఏఐసీటీఈకి దరఖాస్తు చేశాయి. ఇప్పటికే కొన్నింటికి అనుమతులూ వచ్చాయి. కొన్ని కళాశాలలు 300-400 కొత్త సీట్లకు దరఖాస్తు చేసినట్లు తెలిసింది.

ఈనెల 10వ తేదీతో అనుమతుల ప్రక్రియ ముగుస్తుంది. అప్పటికి ఎన్ని కొత్త సీట్లు వచ్చాయో స్పష్టమవుతుందని రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 10 వేల వరకు కొత్తగా కంప్యూటర్ సైన్స్‌ సీట్లు రావొచ్చని ఓ కళాశాల యజమాని ఒకరు తెలిపారు. అంటే వాటిలో ఏడు వేల సీట్లను కస్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తారు. ఫలితంగా యాజమాన్య కోటా సీట్లకు కొంత డిమాండ్ తగ్గే అవకాశముంది. గత ఏడాది కన్వీనర్ కోటాలో 68 సీట్లు కంప్యూటర్ సైన్స్‌, ఐటీ బ్రాంచీలవే కావడం ఆ కోర్సులకున్న డిమాండ్‌ను చాటింది. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నాయి. గత విద్యా సంవత్సరం(2023-24)లో కన్వీనర్ కోటా 70% కింద 83,766 బీటెక్ సీట్లు ఉండగా… అందులో కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత బ్రాంచీల్లో 56,811 సీట్లున్నాయి. అంటే అది 68 శాతంతో సమానం. ఇక రాష్ట్రంలో ఉన్న అయిదు ప్రైవేట్ వర్సిటీలు, గీతం, కేఎల్, చైతన్య లాంటి డీమ్డ్ వర్సిటీల్లోని సీట్లను కలుపుకొంటే 75% వరకు ఉంటాయని అంచనా. మొత్తంగా ఈ ఏడాది కొత్తగా 10వేల కంప్యూటర్ సైన్స్ సీట్లు పెరుగనున్నాయి.

వాటిల్లో కొత్తగా 360సీట్లు
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేశారు. దాంతో అక్కడ నాలుగు బ్రాంచీల్లో 240 సీట్లు కొత్తగా రానున్నాయి. రాష్ట్రంలో తొలి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఇదే కావడం గమనార్హం. ఇది జేఎన్టీయూ అనుబంధంగా కొనసాగనుంది. దీంతో పాటు గత విద్యా సంవత్సరం(2023-24) ఖమ్మం జిల్లా పాలేరు, మహబూబాబాద్‌లో జేఎన్టీయూహెచ్ అనుబంధంగా కొత్త ఇంజినీరింగ్ కళాశాలలను ప్రభుత్వం ప్రారంభించింది. శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని హడావిడిగా కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత వాటిల్లో ప్రవేశాలకు అనుమతిచ్చారు. దాంతో కేవలం మూడేసి కోర్సుల చొప్పున ఒక్కో దాంట్లో 180 సీట్లకే ప్రవేశాలు కల్పించారు. అక్కడ సీఎస్ఈ, సీఎస్ఈ డేటా సైన్స్, ఈసీఈ బ్రాంచీలున్నాయి. ఈసారి కొత్తగా మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచీలు రానున్నాయి. అంటే ఒక్కో దాంట్లో 120 సీట్లు అదనంగా వస్తాయని జేఎన్టీయూహెచ్ వర్గాలు తెలిపాయి.

Latest News