Kaveri Travels | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నుంచి బెంగళూరుకు బయల్దేరిన కావేరి ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 30 మంది సజీవదహనమైనట్లు తెలిసింది. మరో 12 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రాణాలతో బయటపడిన వారు రామిరెడ్డి, వేణుగోపాలరెడ్డి, సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం ఉన్నారు. బాధితుల్లో ఎక్కువ మంది హైదరాబాద్ నగరానికి చెందిన వారు ఉన్నట్లు సమాచారం.
బస్సు ప్రమాద ఘటనను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు గురువారం రాత్రి 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారు చిన్నటేకూరు సమీపంలో బైక్ ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం భారీగా జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 42 మంది ఉన్నారు. 30 మంది ప్రయాణికుల వరకు సజీవ దహనమైనట్లు తెలిసింది. ప్రమాదం తర్వాత ఘటనా స్థలం నుంచి బస్సు డ్రైవర్, సిబ్బంది పరారయ్యారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
పరారైన డ్రైవర్, సహాయక డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నాం అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు.
