Meher Ramesh | టాలీవుడ్ దర్శకుడు మెహర్ రమేష్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన అత్తమ్మ పద్మావతి గారు కన్నుమూశారు. ఈ విషాద విషయాన్ని స్వయంగా మెహర్ రమేష్ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. తన అత్తమ్మతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఫోటోలను పంచుకున్న ఆయన, తన జీవితంలో ఆమె స్థానాన్ని ప్రత్యేకంగా పేర్కొన్నారు.
“ఇన్నాళ్లు మా అమ్మని తనలో చూసుకున్నాను. మా అత్తమ్మ పద్మావతి శివైక్యం పొందారు. మా అమ్మ వెంకట సుబ్బమ్మ గారు 2003 ఫిబ్రవరి 7న పరమపదించారు. సరిగ్గా అదే తేదీన అత్తమ్మకు ఆఖరి వీడ్కోలు చెప్పాల్సి రావడం మా కుటుంబానికి తీరని లోటు. ఓం శాంతి” అంటూ మెహర్ రమేష్ చేసిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒకే తేదీన తల్లి, అత్తమ్మలను కోల్పోవడం తన కుటుంబానికి మర్చిపోలేని దుఃఖమని ఆయన పేర్కొనడం హృదయాలను తాకుతోంది. ఈ పోస్టును చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు ధైర్యం చెబుతూ సంతాపం తెలియజేస్తున్నారు.
మెహర్ రమేష్ సినీ ప్రయాణాన్ని పరిశీలిస్తే కన్నడ సినీ పరిశ్రమలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అనంతరం టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన కంత్రి చిత్రంతో దర్శకుడిగా గుర్తింపు పొందారు. ప్రభాస్‌తో రూపొందించిన బిల్లా సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకుంది. అయితే ఆ తరువాత ఆయన చేసిన శక్తి, షాడో, భోళా శంకర్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని సాధించలేకపోయాయి.
భోళా శంకర్ విడుదల తరువాత మెహర్ రమేష్ పబ్లిక్‌లో పెద్దగా కనిపించకపోయినా, మెగా ఫ్యామిలీకి దగ్గరి బంధువుగా అప్పుడప్పుడూ మెగా హీరోల సినిమా ఈవెంట్లు, ఫంక్షన్లలో పాల్గొంటూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం అత్తమ్మ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు నెలకొనగా, సినీ వర్గాలు సానుభూతి తెలియజేస్తున్నాయి. ఈ సంఘటనతో టాలీవుడ్‌లో కూడా దుఃఖ వాతావరణం నెలకొంది.
