విధాత, హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష బీఆరెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హస్తం గూటికి చేరగా… పార్టీ మారేందుకు మరికొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. పార్టీని వీడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీను కట్టడి చేసేందుకు బీఆరెస్ అధిష్టాినం చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించకపోవడం ఆ పార్టీ భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తుంది. ఇప్పటికే బీఆరెస్ నుంచి ఎన్నికల 7గురు ఎమ్మెల్యేలు, తాజాగా 6గురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరిపోయారు. జోగులాంబ గద్వాల జిల్లా బీఆరెస్ పార్టీ అధ్యకుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆయన కొడుకు బండ్ల సాకేత్ రెడ్డితో కలిసి శనివారం కాంగ్రెస్ చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా అలంపూర్ ఎమ్మెల్యే విజయుడుతో పాటు ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామ్‌రెడ్డి కూడా త్వరలో కాంగ్రెస్ గూటికి చేరునున్నట్లు ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ సీఎం రేవంత్‌రెడ్డితో ఇప్పటికే భేటీ అయినట్లుగా సమాచారం. వారు నేడో రేపో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది. వారి చేరికపై అభ్యంతరం తెలుపుతున్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ సెక్రటరీ సంపత్‌కుమార్‌తో పాటు విజయుడు, వెంకట్రామ్‌రెడ్డిలతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చల పిదప రెండు రోజుల్లోగా విజయుడు, వెంకట్రామ్‌రెడ్డిలు కాంగ్రెస్‌లో చేరుతారని కాంగ్రెస్ వర్గాల కథనం. సీఎం రేవంత్‌రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు ముందే చేరికల తతంగం పూర్తి చేయాలని రేవంత్, జూపల్లిలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేరికల వ్యవహారాన్ని రానున్న అసెంబ్లీ సమావేశాల్లోగా పూర్తి చేయాలని, వీలైతే అప్పటిలోగా బీఆరెస్‌ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయాలని కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతుంది.
పాలమూరు జిల్లాలో ఖాళీ అవుతున్న కారు
సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి మహబూబ్‌నగర్(పాలమూరు) జిల్లాలోని నూతన జోగులాంబ గద్వాల జిల్లాలో బీఆరెస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే పరిస్థితి చేరుకుంటుంది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిపోగా, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామ్‌రెడ్డి కూడా నేడోరేపో కాంగ్రెస్‌లో చేరనుండంతో ఈ జిల్లాలో కారు పార్టీ ఖాళీ కాబోతున్న పరిస్థితి ఎదుర్కోంటుంది. మొన్నటి 20203 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14స్థానాల్లో 12స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. గద్వాల, అలంపూర్‌లలో గెలిచిన బీఆరెస్ ఎమ్మెల్యేలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరిపోగా, విజయుడు కూడా కాంగ్రెస్‌లో చేరిపోతే ఆ జిల్లా నుంచి బీఆరెస్‌కు అసెంబ్లీ ప్రాతినిధ్యం లేకుండా పోనుంది. కాగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో భాగంగా బీఆరెస్ నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన ఎన్. నవీన్ కుమార్ రెడ్డిని సైతం కాంగ్రెస్‌లో చేర్పించేందుకు ముమ్మరం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వెంట మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, మాజీ సర్పంచ్‌లు, మున్సిపాల్టీ కౌన్సిలర్లు కూడా భారీ సంఖ్యలో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌కు వలస కడుతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి.