Allu Arjun | నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు: అల్లు అర్జున్

నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, నా మిత్రులు, బంధువులకు వ్యక్తిగతంగానే ఎన్నికల్లో మద్ధతు పలికానని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

  • Publish Date - May 13, 2024 / 04:53 PM IST

వ్యకిగతంగానే నా వాళ్లకు మద్ధతు
అల్లు అర్జున్ స్పష్టీకరణ

విధాత : నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, నా మిత్రులు, బంధువులకు వ్యక్తిగతంగానే ఎన్నికల్లో మద్ధతు పలికానని సినీ నటుడు అల్లు అర్జున్ స్పష్టం చేశారు. సోమవారం ఫిలింనగర్లోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఓటు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పారవిరెడ్డికి అసెంబ్లీ ఎన్నికల్లో మద్ధతునివ్వడంపై అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదని, నాకు అన్ని పార్టీలు ఒక్కటేనని, నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా, లేకపోయినా వ్యక్తిగతంగా నా మద్దతు ఉంటుందన్నారు. నంద్యాలలో రవికి కూడా అలాగే మద్దతు తెలిపానని చెప్పారు.

ఒకవేళ భవిష్యత్‌లో మా మావయ్య చంద్రశేఖర్‌రెడ్డి, బన్నివాసు ఇలా వ్యక్తిగతంగా నాకు దగ్గరైన వ్యక్తులెవరికైనా మద్దతు ఇవ్వాల్సి వస్తే ఇస్తానని పేర్కోన్నారు. శిల్పా రవి 15 ఏళ్లుగా నాకు మిత్రుడని, రాజకీయాల్లోకి వెళితే మీ ఊరు వచ్చి సపోర్ట్ చేస్తానని గతంలో ఆయనకు ఇచ్చిన మాట మేరకు మద్దతునిచ్చానని తెలిపారు. 2019లో ఆయన రాజకీయాల్లోకి వచ్చాక వెళ్లి కలవలేకపోయానని, ఇచ్చిన నిలబెట్టుకునేందుకు ఒక్కసారైనా కనపడాలని నా మనసులో ఉందని, ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలిసి, నేనే ఫోన్ చేసి వస్తానని శిల్పా రవికి చెప్పానని, అందుకే నా భార్యతో కలిసి నంద్యాల వెళ్లానన్నారు. వ్యక్తిగతంగా ఆయనకు శుభాకాంక్షలు చెప్పి వచ్చేశానని, నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదన్నారు. మావయ్య పవన్ కల్యాణ్‌కు ఎప్పుడూ నా మద్దతు ఉంటుందన్నారు.

Latest News