Tomato Price | రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణలోని ఏ రైతు బజారుకు వెళ్లినా.. వెజిటబుల్స్ ధరలు అత్యంత దిగువకు పడిపోయాయి. మరి ముఖ్యంగా టమాటా ధర అయితే మరింత పడిపోయింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. పెట్టుబడి కూడా మిగలడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు పెట్టుకుంటున్నారు. టమాటాకు మార్కెట్‌లో ధర లేకపోవడంతో.. ఆయా మార్కెట్లలో రైతులు మహిళలకు ఉచితంగా పంపిణీ చేసిన పరిస్థితి దాపురించింది.
ప్రస్తుతం కిలో టమాటా రూ. 10 మాత్రమే పలుకుతుంది. హైదరాబాద్‌లో టోకు ధరల్లో కిలో టమాటా.. రూ. 8 చొప్పున అమ్ముడుపోతుండడంతో రైతులకు పెట్టుబడి కూడా దక్కడం లేదు. బహిరంగ మార్కెట్లో గత 15 రోజుల కిందట టమాట కిలో ధర రూ. 30 నుంచి రూ. 40 చొప్పున పలకగా ప్రస్తుతం కిలో ధర రూ. 10 కూడా అమ్ముడుపోవడం లేదని రైతులు, వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కూరగాయల ధరలన్నీ తక్కువగానే ఉన్నాయి. ఇంకొక 15, 20 రోజుల వరకు ఈ రేట్లే కొనసాగుతాయి. ఎందుకంటే మొదటి పంట అంతా అయిపోయింది. ఇది రెండవ సారి కావటంతో ఉత్పత్తి ఎక్కువగా ఉంది. దాంతో అన్నీ కూరగాయల రేట్లు పడిపోయాయి. టమాటా మొదట్లో కిలో రూ.40 రూపాయలు ఉండేది. కానీ ఇప్పుడు రూ. 10కే అమ్ముడుపోతోంది. రూ.70 పలికిన బీన్స్ కూడా ఇప్పుడు కిలో రూ.30 అయ్యింది. అన్నీ కూరగాయల ధరలు మరింత పడిపోయాయని రైతులు పేర్కొంటున్నారు.
తగ్గిన కూరగాయల ధరలతో సామాన్యులకు పెద్ద ఊరట లభించింది. పలు రకాల కూరగాయల ధరలు భారీగా పడిపోటంతో సామాన్యులు ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు.
