చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తాం

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు

  • Publish Date - January 17, 2024 / 10:30 AM IST

– అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి

– నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందజేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు తులం బంగారం అందజేసే కార్యక్రమానికి రాబోయే కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇకనుండి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర అన్ని పథకాలను అధికారులే పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తారని తెలిపారు.


ఇందిరమ్మ ఇండ్లు నిర్మించడానికి స్థలాలను గుర్తిస్తామన్నారు. నల్లగొండ నియోజకవర్గంతో పాటు నల్లగొండ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. కలెక్టర్ సూచన మేరకు నల్లగొండ జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రాంను ఏర్పాటు చేసి, యువతను అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతామన్నారు. త్వరలోనే టీచర్స్ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి గ్రూప్-2 ఎగ్జామ్ నిర్వహిస్తామని అన్నారు. కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ ప్రభుత్వo అమలు చేస్తున్న 6 గ్యారంటీలు, సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రజలు సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే జిల్లా యంత్రాంగంతో చర్చించి న్యాయం చేస్తామని తెలిపారు.


నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండలాలకు చెందిన 244 మందికి ఒక్కొక్కరికి ఒక లక్షా 116 రూపాయల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మొత్తం రూ. 2 కోట్ల 44 లక్షల 28 వేల 304 విలువైన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బీసీ అండ్ ఈబీసీ 153, ఎస్సీ 56, ఎస్టీ 3, మైనార్టీ 66 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) జే శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్, ఆర్డీఓ రవి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.