Site icon vidhaatha

CPI| కాంగ్రెస్-కమ్యూనిస్టుల బంధం విడదీయరానిది: టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

mahesh-goud-makhdoom-bhavan

CPI| విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్-కమ్యూనిస్టుల అనుబంధం విడదీయరానిదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ప్రజా ప్రయోజనాల విషయంలో రెండుపార్టీలూ వేర్వేరు కాదని చెప్పారు. దేశ భవిష్యత్తు కోసం లౌకికవాద శక్తులు బలపడాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ పున: ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. మఖ్దూమ్ జీవితం తెలుగు నేలకే కాదు.. దేశ ప్రజలకు గొప్ప సందేశమన్నారు. మఖ్దూమ్‌.. సాహితీ, రాజకీయ వైభవానికి ప్రతీకగా నిలిచారని గుర్తుచేశారు. 1974 ఫిబ్రవరి 17న ప్రారంభమైన ఈ కార్యాలయానికి అప్పటి కాంగ్రెస్ మంత్రులే పునాది వేయడం మరో ప్రత్యేకతగా మహేష్ గౌడ్ గుర్తు చేశారు. కమ్యూనిస్టు భావజాలానికి మరణం లేదని, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కొదవ లేదని వ్యాఖ్యానించారు. “తమ పదవులను కాపాడుకునేందుకు ఫాసిస్టు శక్తులు ఎంత దూరమైనా వెళ్తున్నాయి. విద్యావంతులు సైతం హిందూత్వ కార్డును ఉపయోగించడం శోచనీయం. లౌకికత గురించి మాట్లాడితే అర్బన్ నక్సల్స్ అంటారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడితే దేశద్రోహులంటారు. ఇదే వారి తత్వం” అని టీపీసీసీ చీఫ్ ఉద్ఘాటించారు.

ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధమని ప్రకటించినా కేంద్రానికి మానవత్వం లేకుండా సీజ్ ఫైర్ దాడులకు పాల్పడటం దారుణమన్నారు. ఎలక్షన్ కమిషన్ కొందరి ప్రయోజనాలకు దాసోహంగా మారడం దురదృష్టకరమన్నారు. బీహార్‌లో ఓట్ల ఎలిమినేషన్ ప్రక్రియ ఒకే పార్టీకి మేలు చేసేలా సాగిందని విమర్శించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. ఉన్న ఉద్యోగాలు తీసేసి, పబ్లిక్ సెక్టార్ యూనిట్లను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే దిశగా కేంద్రం వెళ్తోందని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. దేశ భవిష్యత్‌ను రక్షించాలంటే లౌకిక వాద శక్తులు బలపడాలని, ప్రజల హక్కులను కాపాడేందుకు పార్టీ, భావజాల భేదాలు మరిచి ముందుకు రావాలని అని టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.

Exit mobile version