కేటీఆర్ మాటలే … ఓటమికి బాటలా ?

వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఓటమితో ఆ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. వరసగా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆరెస్‌ ఈసారి తమ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జారవిడుచుకుంది

  • Publish Date - June 8, 2024 / 04:05 PM IST

పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిపై రచ్చ
చేజారిన బీఆరెస్ సిటింగ్ స్థానం

విధాత : వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డి ఓటమితో ఆ పార్టీ తమ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. వరసగా ఇప్పటి వరకు నాలుగు సార్లు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన బీఆరెస్‌ ఈసారి తమ సిట్టింగ్ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జారవిడుచుకుంది. ఈ స్థానంలో బీఆరెస్‌ నుంచి కపిలవాయి దిలీప్ కుమార్ రెండు సార్లు, పల్లా రాజేశ్వర్ రెడ్డి రెండు సార్లు విజయం సాధించారు. పల్లా ఎమ్మెల్సీ పదవీ కాలం 2027మార్చి 29వరకు ఉన్నప్పటికి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయగా ఈ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. గతంలో పల్లాపై ఇండిపెండెంట్‌గా రెండు సార్లు పోటీ చేసి ఓడిన తీన్మార్ మల్లన్న ఈ దఫా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆరెస్ అభ్యర్థి రాకేశ్‌రెడ్డిపై విజయం సాధించారు. అంతకుముందు హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లోనూ ఒకసారి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ఓడిన తీన్మార్ మల్లన్న నాల్గవ ప్రయత్నంలో చట్టసభల్లోకి అడుగు పెట్టగలిగారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి..పార్లమెంటు ఎన్నికల్లో జీరో స్థానాలతో చతికిల పడిన బీఆరెస్‌కు మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ విజయం కొంత ఊపిరి పోసినట్లయ్యింది. ఇంతలోనే వరంగల్ ఖమ్మం నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ సిటింగ్‌ స్థానం ఓడిపోవడం బీఆరెస్ పార్టీని తిరిగి నైరాశ్యంలో పడేసింది.

కేటీఆర్ వ్యాఖ్యలే ఓడించాయా ?

సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని రాకేశ్‌రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి, వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉమ్మడి జిల్లాల బీఆరెస్ నాయకులను సమావేశ పరిచి బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తాను స్వయంగా నియోజవర్గాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో పాటు మరోవైపు హరీశ్‌రావు సహా ఆయా జిల్లాల మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలంతా తమవంతుగా గెలుపు కోసం కష్టపడ్డారు. అభ్యర్థి రాకేశ్‌రెడ్డి సైతం విజయం కోసం గట్టి పోరాటమే చేశారు. పోల్ మేనేజ్‌మెంట్‌లో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగానే వ్యూహాలను అమలు చేశారు. 34నియోజకవర్గాల్లో 32మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 5గురు మంత్రులున్నా ఎక్కడా తొణకకుండా రాకేశ్‌రెడ్డి తన ప్రచారాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు అటు కాంగ్రెస్ బడా నేతలు పూర్తి స్థాయిలో సహకరించని పరిస్థితి కూడా కనిపించింది.

కేటీఆర్ బిట్స్ పిలానీ ,పల్లీ బఠానీ వ్యాఖ్యలు దుమారం రేపాయి

అయితే ప్రచార ఉదృతి పతకాస్థాయిలో ఉన్న దశలో కేటీఆర్ బిట్స్ పిలానీలో చదివిన రాకేశ్‌రెడ్డిని గెలిపించుకుంటారో లేక పల్లీ బఠానీ, బ్లాక్ మెయిలర్‌ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించుకుంటారా అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బూమ్‌రాంగై ఆ పార్టీ ఓటమిగా బాటలు వేశాయంటున్నారు విశ్లేషకులు. కేటీఆర్ వ్యాఖ్యలు ఉస్మానియా, కాకతీయ, జెఎన్టీయూ వంటి తెలంగాణ యూనివర్సిటీల్లో చదివిన విద్యార్థులను అవమానించేదిగా ఉన్నాయని, ఇక్కడి డిగ్రీలు పల్లి బఠానీలంటూ అపహాస్యం చేసేదిగా ఉన్నాయంటూ కాంగ్రెస్ ఎదురుదాడికి దిగింది. కేటీఆర్ వ్యాఖ్యలు తమ డిగ్రీలను అవమానించేదిగా ఉన్నాయని ఇది మా మనోభావాలను దెబ్బతీశాయని భావించిన పట్టభద్రులు ఎన్నికల్లో కేటీఆర్ వ్యాఖ్యలపై కోపంతో తీన్మార్ మల్లన్నకు ఓట్లేశారని ఫలితాల విశ్లేషకులు చెబుతున్నారు. కేటీఆర్ బిట్స్ పిలానీ, పల్లీ బఠానీ వ్యాఖ్యలతో పాటు గ్రూప్ పేపర్ల లీకేజీల వివాదంలో, నిరుద్యోగుల ఆత్మహత్యల సందర్భంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనూ పట్టభద్రులు బీఆరెస్‌కు వ్యతిరేకంగా ఇతర పార్టీల అభ్యర్థులకు ఓట్లేశారని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజాతీర్పును అర్ధం చేసుకోకుండా ప్రజలే తమను ఓడించి తప్పుచేశారంటు కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావులు పార్లమెంటు ఎన్నికల్లోనూ అదే మాటల పరంపర కొనసాగించి మరోసారి ప్రజా తిరస్కరణకు గురయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీలోనూ అదే తరహా వ్యాఖ్యలతోనే ఓటమి పాలయ్యారంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Latest News