MLA Bhupathi Reddy Comments on Modi | ప్రధాని మోదీపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్ఎల్‌ఏ భూపతి రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ప్రధాని మోదీపై, రాముడిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ కలకలానికి దారితీశాయి. వీడియో వైరల్‌ కావడంతో బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Telangana MLA Bhupathi Reddy’s Controversial Remarks on PM Modi Spark Row

Telangana MLA Bhupathi Reddy’s Controversial Remarks on PM Modi Spark Row

హైదరాబాద్‌, అక్టోబర్‌ 2 (విధాత):
MLA Bhupathi Reddy Comments on Modi | తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూపతి రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. ఇటీవల నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఆయన, “మోదీ చనిపోతే రాముడు పోతాడా? మోదీ ఇంకా ఎన్ని రోజులు  బతుకుతాడు?? ఇప్పటికే 75 ఏళ్లు వచ్చాయి” అంటూ వ్యాఖ్యానించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారడంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

బీ భూపతి రెడ్డి వ్యాఖ్యలపై జేపీ తీవ్ర విమర్శలు

భూపతి రెడ్డి వ్యాఖ్యలు దేశ ప్రధానిని అవమానించేవి, హిందూ భావోద్వేగాలను దెబ్బతీసేవని బీజేపీ తీవ్రంగా ఖండించింది. శ్రీరామచంద్రుడు భారతీయ నాగరికత, సంస్కృతికి శాశ్వత ప్రతీక. అలాంటి దేవున్ని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు చులకనగా మాట్లాడటం ఆ పార్టీ నిజ స్వరూపాన్ని బయటపెడుతోందంటూ బీజేపీ విమర్శించింది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రచనారెడ్డి మాట్లాడుతూ, “ఇది కాంగ్రెస్‌ నిరాశను ప్రతిబింబించే వ్యాఖ్య. ప్రజల మద్దతు కోల్పోతున్న కాంగ్రెస్‌ తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడుతోంది” అని ధ్వజమెత్తారు.

గతంలోనూ వివాదాలు: అల్లు అర్జున్‌పై దూషణలు

భూపతి రెడ్డి గతంలోనూ వివాదాలకు కేంద్రబిందువయ్యారు. ప్రముఖ నటుడు అల్లు అర్జున్‌పై అసభ్యకర భాష వాడి, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తే ఊరుకోనని హెచ్చరించారు. ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత అల్లు అర్జున్‌ను టార్గెట్ చేస్తూ, “మీరు ఆంధ్రా వాళ్లు, తెలంగాణకు ఏం చేశారు? మా సీఎంను దూషిస్తే మీ సినిమాలు ఇక్కడ నడవవు” అని బెదిరించారు. ఇప్పుడు ప్రధాన మంత్రి మోదీపై చేసిన వ్యాఖ్యలు ఆయనను మళ్లీ వివాదాలు చుట్టుముట్టాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించకపోయినా, బీజేపీ మాత్రం ఈ వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది.

Exit mobile version