Site icon vidhaatha

Jaggareddy | రుణమాఫీతో బీజేపీ, బీఆరెస్ నేత‌ల‌కు నిద్రపట్టడం లేదు .. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి..

విధాత‌, హైద‌రాబాద్‌:ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న రుణ‌మాఫీ ప్ర‌క్రియ‌ను చూసి బీజేపీ, బీఆరెస్ నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌ని టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి అన్నారు. శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సోనియా,రాహుల్‌గాంధీ డైరెక్ష‌న్‌లో రేవంత్‌రెడ్డి కేబినెట్ గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీని మొద‌లు పెట్టింద‌ని అన్నారు. గురువారం నుంచి లక్ష వరకు రుణాలు ఉన్న రైతుల‌కు రుణ‌మాఫీ అయ్యింద‌న్నారు. పంద్రాగ‌స్టు నాటికి సంపూర్ణంగా 2లక్షల రుణమాఫీ అవుతుంద‌న్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయగానే రైతుల ఇళ్లల్లో సంబరాలు జ‌రిగితే, ప్రతిపక్ష నేతల ఇళ్లలో ఆందోళనలు క‌నిపించాయ‌న్నారు. కొంద‌రు బీజేపీ, బీఆరెస్ నేత‌లు నిద్ర మాత్ర‌లు వేసుకుని ప‌డుకున్నార‌ని ఎద్దేవా చేశారు.

ప‌దేళ్ల‌లో గ‌త స‌ర్కార్ ఏడు ల‌క్ష‌ల కోట్ల అప్పులు చేసింద‌ని, అందులో రైతుల రుణమాఫీ చేసింది కేవలం 26 వేల కోట్లు మాత్రమేన‌న్నారు. సోనియాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 6 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 31వేల కోట్ల రుణమాఫీ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టింద‌న్నారు. బీజేపీ పదేళ్లు కేంద్రంలో ఉండి దేశంలో ఉన్న రైతులకు ఎన్ని వేల కోట్లు రుణమాఫీ చేశారో చెప్పగలరా.. అని బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ఉద్దేశించి జ‌గ్గారెడ్డి ప్ర‌శ్నించారు. పదేళ్లలో మోడీ నీరో చ‌క్ర‌వ‌ర్తిలా ప్ర‌వ‌ర్తించార‌ని, విజయ్ మాల్యా లాంటి పది మందికి 16 లక్షల కోట్లు మాఫీ చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ మాఫీలో ఎవ‌రైనా రైతుల‌న్నారా అని బీజేపీ నేత‌ను ప్ర‌శ్నించారు.

యూపీఏ హాయంలో ఒకే సారి 75వేల కోట్లు రుణాలు మాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదేన‌ని జ‌గ్గారెడ్డి గుర్తు చేశారు. పదేళ్లలో రైతులు కేసిఆర్ మీద పెట్టుకున్న ఆశలను కూని చేశారని, బీజేపీ ప్రభుత్వం రైతు నల్ల చట్టాలు తెచ్చి.. రైతుల‌ను హ‌త్య చేసింద‌న్నారు. దీని మీద బండి సంజ‌య్‌, కిష‌న్‌రెడ్డిలు చ‌ర్చ‌కు వ‌స్తారా అని ప్ర‌శ్నించారు. ఢిల్లీలో రైతులు నిరసనలు తెలిపితే, మంత్రుల పిల్లల వాహనాలతో రైతుల‌ను గుద్ది చంపార‌ని గుర్తు చేశారు. రైతుల గోస‌ల‌పై చిరంజీవి ఖైదీ నంబర్ 150 తీశారని, డిల్లీలో రైతులు నిరసనలు చేస్తుంటే ఎందుకు ఆయ‌న‌ మద్దతు తెలుపలేదన్నారు.

చిరంజీవి సినిమా హిట్.. రైతులు ఫట్‌..

తమ్ముడు పవన్ కళ్యాణ్ బీజేపీ కి మద్దతు ఇస్తుంటే రైతుల గురించి చిరంజీవి ఎందుకు చెప్పలేక పోయార‌ని జ‌గ్గారెడ్డి అన్నారు. డిల్లీలో రైతులు ఆందోళనలు చేస్తుంటే రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చార‌న్నారు. రైతుల పేరుతో సినిమాలు తీసి.. కోట్లు సంపాదించుకొని,బీజేపీ కి మద్దతు ఇచ్చార‌ని చిరంజీవిపై విమ‌ర్శ‌లు గుప్పించారాయ‌న‌.

కేటీఆర్ ట్వీట్ కే పని కి వస్తాడు.. పనికి పనికిరాడు

కేటీఆర్ ట్వీట్‌లు చేయ‌డానికే ప‌నికి వ‌స్తాడాని, ప‌ని చేయ‌డానికి ప‌నికి రాడ‌ని జ‌గ్గారెడ్డి విమ‌ర్శించారు. రైతులకు ఒకే సారి రుణమాఫీ చేస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారని, అందుకే లక్ష.. లక్షన్నర.. రెండు లక్షలు అని విడతల వారీగా అమ‌లు చేస్తున్నామ‌ని పేర్కొన్నారు. రుణ‌మాఫీ కోసం తెచ్చిన అప్పులు ఎక్క‌డి నుంచి తెచ్చారో సీఎం, ఆర్థిక మంత్రికే తెలుస‌న‌ని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా ఆయ‌న చెప్పారు.

Exit mobile version