- బీసీ రిజర్వేషన్లలో చాంపియన్ ఎవరు?
- అన్ని పార్టీల పోటాపోటీ కార్యక్రమాలు
- నేడు ఎమ్మెల్సీ కవిత 72 గంటల దీక్ష
- ఢిల్లీకి రైలెక్కనున్న కాంగ్రెస్ నాయకులు
- రాష్ట్రపతిని కలిసి విన్నవించే అవకాశం
- జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ ఆందోళన!
- కరీంనగర్‌లో 8న బీఆరెస్ భారీ సభ
- ఇప్పటికే ఆందోళనల్లో బీజేపీ నేతలు
- రిజర్వేషన్లలో ముస్లిం కోటాపై అభ్యంతరం
హైదరాబాద్, ఆగస్ట్ 3 (విధాత) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై తెలంగాణలోని ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ అంశంలో ఎవరికి వారు తామే చాంపియన్లు కావాలనే లక్ష్యంతో వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కూడా బీసీ రిజర్వేషన్ల అంశంపై ఆందోళనలు చేస్తున్నారు. రిజర్వేషన్లకు అనుకూలమంటూనే ఎవరిదారిలో వారు తమకు మైలేజీ కోసం శ్రమిస్తున్నారు. ఏ పార్టీ ఏ దారిలో వెళ్లినా అంతిమలక్ష్యం రిజర్వేషన్ల సాధనే. అయితే రిజర్వేషన్ల సాధన కంటే రాజకీయ మైలేజీకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో ఆందోళనలకు కాంగ్రెస్
స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన రెండు బిల్లులను తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పంపిన డ్రాఫ్ట్ ఆర్డినెన్స్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లీగల్ ఒపీనియన్ తీసుకొని కేంద్ర హోం శాఖకు పంపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీలో తేల్చుకోవాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాని ప్రభుత్వం భావిస్తోంది. రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 5 నుంచి 7 వరకు కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిరసనలు చేపట్టనున్నారు. ఈ నెల 4నే ప్రత్యేక రైలులో కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో బయలుదేరుతారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రతినిధులు ఉంటారు. ఈ నెల 4న క్యాబినెట్ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీకి వెళ్తారు. అన్ని పార్టీలకు చెందిన బీసీ నాయకులు, ప్రజా ప్రతినిధులు కూడా ఢిల్లీకి రావాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ నెల 5న పార్లమెంట్ ఉభయ సభల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపై వాయిదా తీర్మానంతో పాటు చర్చకు పట్టుబట్టాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ నెల 6న జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి తనవద్ద పెండింగ్ లో ఉన్న రిజర్వేషన్ల అంశాన్ని క్లియర్ చేయాలని కోరుతారు. ఇప్పటికే రిజర్వేషన్లు, కులగణన విషయంలో తెలంగాణ మోడల్ అంటూ కాంగ్రెస్ పార్టీ ఊదరగొడుతోంది. ఈ అంశాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపీ ఆందోళనలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీజేపీ ఓబీసీ ఆధ్వర్యంలో ఆగస్టు 2న హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఆర్ కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు మేలు చేసేవిగా ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలున్నారని చెబుతోంది. బీసీల రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు ప్రయోజనం చేయాలని కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందనేది కమలం పార్టీ వాదన. మత పరమైన రిజర్వేషన్లకు తాము వ్యతిరేకమని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే తాము మద్దతిస్తామని చెబుతోంది. రిజర్వేషన్లకు తాము అనుకూలమని చెబుతూనే కాంగ్రెస్‌ను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ముస్లింల అంశాన్ని తెరమీదికి తెచ్చి పార్లమెంట్ లో కూడా ఈ బిల్లుకు సహకరించే ప్రశ్నే ఉండదని సంకేతాలు ఇచ్చింది.
బీసీలకు రిజర్వేషన్లపై కరీంనగర్ లో బీఆర్ఎస్ భారీ సభ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తాము వెనుకబడకూడదని కారు పార్టీ కూడా వ్యూహాలు రచిస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై గులాబీ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం తెలంగాణ భవన్ లో సమావేశమైన బీఆర్ఎస్ లోని బీసీ నాయకులు బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్దిని ప్రశ్నించారు. ఈ నెల 8న కరీంనగర్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సభకు లక్ష మందిని సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరోవైపు రిజర్వేషన్ల అంశంలో రాష్ట్రపతిని కూడా కలవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. దీన్ని అమలు చేయాలని కోరుతోంది. చట్ట సభల్లో ఈ బిల్లులకు సంబంధించి తాము సహకరిస్తామని కూడా గులాబీ పార్టీ హామీ ఇస్తోంది. అయితే గతంలో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను బీఆర్ ఎస్ 23 శాతానికి తగ్గించిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగుతోంది. అప్పట్లో ఈ రిజర్వేషన్లను ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తోంది. ముస్లింల కోసం బీసీల 34 శాతం ఉన్న రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గించారని గులాబీ పార్టీపై బీజేపీ ఆరోపణలు చేస్తోంది.
బీసీ రిజర్వేషన్లపై కవిత దూకుడు
బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ జాగృతి ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల 5, 6, 7 తేదీల్లో రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన మరునాడే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కూడా కవిత ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో ఆగస్ట్ 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 72 గంటల పాటు దీక్ష చేస్తామని ప్రకటించారు. ఈ దీక్షకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు. అనుమతి ఇవ్వకపోతే తమ కార్యాలయం లేదా ఇంటి నుంచైనా దీక్ష చేస్తామని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ కంటే దూకుడుగా తాను వెళుతున్నానని చాటుకునే ఉద్దేశం ఆమె నిర్ణయాల్లో కనిపిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తేవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమె స్వాగతించారు. రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వ్యహరిస్తున్న తీరును ఆమె తప్పుబట్టారు. ఎప్పటికైనా పార్టీ తన దారిలోకి రావాల్సిందేనని ఆమె చెబుతున్నారు. కవిత చేస్తున్న కార్యక్రమాలు రాజకీయంగా గులాబీ పార్టీని ఇరుకునపెడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇలా ఎవరికి వారు బీసీ రిజర్వేషన్ల అంశంలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కార్యాచరణను సిద్దం చేస్తున్నారు. ఇందులో ఎవరూ చాంపియన్లు అవుతారో కాలమే నిర్ణయిస్తుంది.