32లక్షలకుపైగా ఓటర్లున్న అతిపెద్ద నియోజకవర్గం
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు సెగ్మెంట్లో బీఆరెస్ గెలుపు
ఇప్పుడు ఉనికి చాటుకునేందుకు తాపత్రయం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం.. కానీ.. దాని పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆరెస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది. మామూలుగా అయితే.. ఇక్కడ పోటీ కాంగ్రెస్‌కు, బీఆరెస్‌కు మధ్య ఉండాలి.. అయితే.. అనూహ్యంగా.. ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయని అనేక సర్వే సంస్థలు చెబుతున్నాయి.
తాజాగా పీపుల్స్ పల్స్ సర్వే, 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థలు మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. మల్కాజిగిరిలో భారతీయ జనతాపార్టీకి 46.79 శాతం ఓటు షేరు రానుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో సర్వే చేపట్టిన 26 స్ట్రాటజీస్ సర్వే సంస్థ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం 1,729 శాంపిల్స్ సేకరించింది. ఈటల రాజేందర్‌కు 61.1 శాతం, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్‌రెడ్డికి 24.6 శాతం, బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి 13.1 శాతం మంది ఓటర్లు మద్దతుగా నిలిచారని ఆ సంస్థ సర్వే పేర్కొంటున్నది. ఎటువంటి స్పందన తెలుపని వారు 1.2 శాతం మంది ఉన్నట్లు తేలింది.
అభివృద్ధి అంశం ఆధారంగా ఓటు వేస్తామని 42 శాతంమంది, పార్టీని చూసి ఓటు వేస్తామని 34 శాతం మంది, ప్రధాని అభ్యర్థిని చూసి 20.9 శాతంమంది, ఇతర కారణాలతో 1.9 శాతం మంది ఓటు వేయబోతున్నట్లు తెలిపారు. ఇక 63 శాతం మంది పురుష ఓటర్లు, 54 శాతం మంది మహిళా ఓటర్లు ఈటల రాజేందర్‌కు అనుకూలంగా ఉన్నట్లు వెల్లడైంది.
సునీతా మహేందర్‌రెడ్డికి ఈ ఎన్నికల్లో గట్టి షాక్ తగలబోతున్నట్లు పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఆమె.. రెండో స్థానానికే పరిమితం కాబోతున్నారని ఈ సర్వే అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాలను బీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది.
అయితే లోక్‌సభ ఎన్నికల వరకు వచ్చే సరికి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ వెనుకబడిపోయినట్లు, ప్రధానంగా ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ అసెంబ్లీ స్థానంలోనూ గులాబీ పార్టీ థర్డ్ ప్లేస్‌కు పరిమితం కాబోతున్నదని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. మొత్తానికి ఈ సర్వేలు కాంగ్రెస్‌కి, బీఆరెస్‌కు కునుకుపట్టకుండా చేస్తున్నాయి.
సర్వేల ఫలితాలను గమనిస్తే.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఖాతాలో ఇప్పటికే పడినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గెలిచిన ఈ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆరెస్ పై చేయి సాధించింది. కానీ విచిత్రంగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మల్కాజిగిరి పార్లమెంటు బీజేపీకి రాజకీయ జీవనాడిగా మారిందని అంటున్నారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ఖాళీ చేసినప్పటి నుండి మల్కాజిగిరి తెలంగాణలోని హాట్ సీట్లలో ఒకటిగా మారింది.32 లక్షలకు పైగా ఓటర్లు నమోదు చేసుకున్న మల్కాజ్‌గిరి దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానమేకాదు, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి దశాబ్దాలుగా ఇక్కడ స్థిరపడిన వలస జనాభా అధిక సంఖ్యలో ఉన్నారు. అందుకే దీన్ని “మినీ ఇండియా” అని పిలుస్తారు.
జనంలో ఈటలకు ఆదరణ
తెలంగాణ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి, రెండో ప్రభుత్వంలో వైద్యారోగ్య శాఖ మంత్రిగా పని చేసిన ఈటల.. ఆ రెండు పదవుల్లోనూ తన సత్తా చాటుకున్నారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఆయన కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడం ప్రజలు చూశారని, రాజకీయంగా ఈటలను బీఆరెస్ అధినాయకత్వం ఎన్నిరకాలుగా వేధించిందో కూడా అర్థం చేసుకున్నారని ఒక రాజకీయ విశ్లేషకుడు గుర్తు చేశారు. అందుకే అందరూ మల్కాజిగిరిలో ఈటలకు మద్దతు ఇస్తున్నారని చెప్పారు.
త్రిముఖ పోరులో గత ఐదేళ్లలో ఎంపీగా రేవంత్ రెడ్డి పనితీరుపై ఈ ఎన్నికలను రెఫరెండంగా భావించిన కాంగ్రెస్ ఈ స్థానాన్ని నిలబెట్టుకోవడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మరోవైపు 2023 ఎన్నికల్లో దారుణ ఓటమి ద్వారా అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బీఆరెస్, ఈ పార్లమెంటు పరిధిలోని మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలనూ గెలుచుకున్నందున తన ఉనికి చాటుకోవడానికి తాపత్రయ పడుతోందికానీ, డిపాజిట్ దక్కితే చాలన్నట్లు వాస్తవ పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
జోష్ పెంచిన మోదీ రోడ్ షో
మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో మార్చి ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షో నిర్వహించారు. ఈ రోడ్ షోకి జనం నుంచి వచ్చిన స్పందనతో ఆనాడే మల్కాజిగిరిలో తమ విజయం ఖాయమైందని పార్టీ బీజేపీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. రాజేందర్‌కు పోటీగా వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పట్నం సునీతారెడ్డిని కాంగ్రెస్ రంగంలోకి దింపింది. అంతకుమందు వరకూ బీఆరెస్‌లో ఉండి, పదవులు అనుభవించి ఉన్నపళంగా పార్టీ మారి కాంగ్రెస్ అభ్యర్థిగా రావడం ఆమెకు ఇబ్బందికర అంశంగా పరిణమించిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గాన్ని దాటి ఓట్లు సంపాదించుకునే పరిస్థితి లేదని అంటున్నారు.