హామీలన్ని అమలు చేస్తే నేనూ రాజీనామా చేస్తా: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా 2లక్షల రుణమాఫీతో పాటు ఆరుగ్యారంటీలు..420హామీలు అమలు చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు

  • Publish Date - April 27, 2024 / 06:00 PM IST

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ఆగస్టు 15లోగా 2లక్షల రుణమాఫీతో పాటు ఆరుగ్యారంటీలు..420హామీలు అమలు చేస్తే తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సవాల్ చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. హారీశ్‌రావు తో సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా సవాల్‌తో రాజకీయ డ్రామా వేస్తున్నారన్నారు. వారిద్దరి వ్యవహారం చూస్తే బీఆరెస్ నుంచి 25మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్‌లోకి వచ్చే షిండే హరీశ్‌రావు అన్న అనుమానం వస్తుందన్నారు. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తానంటూ రాజీనామాల సవాళ్లు..దేవుళ్లపై ఒట్లు పెడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీలు..419హామీల అమలుపై సవాళ్లు ఒట్లు పెట్టుకోరా అని ప్రశ్నించారు. వాటిని గట్టు మీద పెడుతారా లేక ఎగ్గొడతరా అని ప్రశ్నించారు.

రుణమాఫీ చేయకుంటే అధికారం ఎందుకన్న రేవంత్‌రెడ్డి రైతుభరోసా, 500బోనస్‌పైన, ఇతర హామీలపైన ఎందుకు మాట్లడటం లేదని నిలదీశారు. 4వేల పింఛన్‌, నిరుద్యోగ భృతి, 2500మహాలక్ష్మి, తులం బంగారం..లక్ష రూపాయలు, స్కూటీల పథకాలపైన, బీసీ సమాజానికి 10లక్షల రుణం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, యూత్‌ డిక్లరేషన్ హామీలు ఎందుకు చాలెంజ్‌లు చేయడం లేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికలు తన పాలనకు రెఫరెండమ్ అని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, నిజంగా కాంగ్రెస్‌ 14ఎంపీ సీట్లు గెలిపిస్తే నేను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఇదివరకే సీఎంకు సవాల్ విసిరానన్నారు. 22వ తేదీ ద్వారా బహిరంగ లేఖ కూడా పంపించానన్నారు. లేఖలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో మీరు ఇచ్చిన హామీల అమలుకు ఎన్నిసార్లు మాట మార్చారో తేదీలు మార్చారో గుర్తు చేశానన్నారు.

రిజర్వేషన్ల రద్దుపై రేవంత్ బూటకపు ప్రచారం

బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు ఎత్తివేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి బూటకపు ప్రచారం చేస్తున్నారని, అసలు రాజ్యంగాన్ని అత్యధిక సార్లు సవరణ చేసిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తించుకోవాలన్నారు. ఈబీసీల కోసం రాజ్యంగ సవరణ బీజేపీ చేస్తే అన్ని పార్టీల మద్దతుతో చేసిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మైనార్టీ రిజర్వేషన్ల కారణంగా హైదరాబాద్‌లో బీసీ కోటాలోనూ మైనార్టీ కార్పోరేటర్లు గెలిచిన విషయం మరువరాదన్నారు. కాంగ్రెస్ మైనార్టీ రిజర్వేషన్ల కారణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు అన్యాయం చేస్తుందన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదని కనీసం 50సీట్లు కూడా గెలవని కాంగ్రెస్ పార్టీ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. కాంగ్రెస్ పార్టీ అటుఇటు కాని పార్టీగా ఉందన్నారు. బీజేపీతో ఫైనల్ మ్యాచ్ ఆడుతున్నామంటున్న సీఎం రేవంత్‌రెడ్డి అసలు కాంగ్రెస్ కెప్టెన్ ఎవరో చెప్పాలన్నారు. కెప్టెన్ లేని జట్టు మ్యాచ్ ఏం ఆడుతుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రీజినల్ పార్టీకి ఎక్కువ నేషనల్ పార్టీకి తక్కువని, రెండుసార్లు ప్రతిపక్ష హోదా సాధించలేకపోయిందన్నారు. రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణలో ఎగిసిపడుతూ పెద్దవాళ్ల మీద రాళ్లేస్తే పెద్దలీడర్ అవుతాడన్న రీతిలో ఉందని, ఆకాశం మీద ఉమ్మేస్తే అతని మీదనే పడుతుందని, మోదీని విమర్శించే స్థాయి రేవంత్‌కు లేదన్నారు.

Latest News