మంత్రి ఉత్తమ్ రాజీనామా చేయాలి
తాము కాదు..కాంగ్రెసోళ్లే బీజేపీతో టచ్‌లో ఉన్నారు
బీజేఎల్పీ నేత ఏలేటి
విధాత: కల్లాల్లో ఉన్న ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేసి అకాల వర్షాలతో రైతులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..సీఎం రేవంత్ సర్కార్ బోగస్ ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శలు గుప్పించారు. వడ్ల కొనుగోలులో సీఎం రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. సివిల్ సఫ్లై శాఖామంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ధాన్యం కొనుగోలులో విఫలమయ్యారని విమర్శించారు. ధాన్యాన్ని కొనుగోలు చేయించలేని ఉత్తమ్.. మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఉత్తమ్‌కు రైతాంగ సమస్యలపై అవగాహన లేదన్నారు. ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లు రైతులను బెదిరించటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికలు అయ్యాక.. సన్న బియ్యానికి మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామనటం అన్యాయమని ఏలేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడు పడిపోతుందో.. తెలియని ప్రభుత్వాన్ని రేవంత్ నడుపుతున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. తాము కాంగ్రెస్‌తో కాదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బీజేపీతో టచ్‌లో ఉన్నారన్నారు. . కోమటిరెడ్డి బ్రదర్స్, జగ్గారెడ్డి మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు.