BJP | ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి: ఎంపీ కే. లక్ష్మణ్‌

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు

  • Publish Date - May 31, 2024 / 12:50 PM IST

ఇందిరా పార్క్ వద్ధ బీజేపీ ధర్నా
ట్యాపింగ్‌తోనే చైతు సమంతల విడాకులు : బూర నర్సయ్యగౌడ్

విధాత : ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ధర్నాలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసును రాష్ట్ర ప్రభుత్వం నీరుగారుస్తుందని ఆరోపించారు. అసలైన నిందితులను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదని దీనంతటికీ కీలక సూత్రధారి మాజీ సీఎం కేసీఆరే అని విచారణలో తేలిందన్నారు. ఐనప్పటికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు.

ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు నేనే మొదటి బాధితుడని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర విచారణ చేయక కాలయాపన చేయడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందని ప్రశ్నించారు. కాంగ్రెస్ హైకమాండ్‌తో కేసీఆర్ లోపాయికారి ఒప్పందం చేసుకుని ట్యాపింగ్ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. లిక్కర్ కేసులో కూతురును తప్పించేందుకు బీజేపీ నేత బీఎల్‌.సంతోష్ అరెస్టుకు ట్యాపింగ్‌తో కుట్ర చేయడం దారుణమన్నారు.

అధికారం శాశ్వతం చేసుకునేందుకు, ప్రతిపక్షాలపై ట్యాపింగ్ చేసి వారిని ఆర్ధికంగా, రాజకీయంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన కేసీఆర్‌ను అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలన్నారు. టెలికామ్ చట్టాలకు, కేంద్ర హోమ్‌, రక్షణ చట్టాలకు భిన్నంగా కేంద్ర అనుమతులు లేకుండా ట్యాపింగ్ చేసి పెద్ద నేరాలకు పాల్పడ్డారన్నారు. బీఆరెస్‌, కాంగ్రెస్‌ల పాలన విషయంలో తేడా లేదన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతూ ముందుకెళ్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో అక్రమాలు జరిగాయంటునే వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.

ట్యాపింగ్‌తోనే చైతు సమంతల విడాకులు : బూర నర్సయ్యగౌడ్

పోన్ ట్యాపింగ్ కారణంగానే తెలుగు సినీ పరిశ్రమకు చెందిన అక్కినేని నాగచైతన్య-సమంతల జంట విడిపోయిందని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్యగౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఇందిరాపార్క్ వద్ధ ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు, సెలబ్రెటీలు, జడ్జీలు, జర్నలిస్టులు..రియలర్టర్లు ఇలా అందరి జీవితాల్లోకి అక్రమంగా ప్రవేశించి ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా అన్ని చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. పక్కా ప్రణాళికతో ట్యాపింగ్ నేరానికి పాల్పడ్డారన్నారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న రాజకీయ పోటీతో పరస్పమరం నమ్మకం లేక ఒకరికి తెలియకుండా మరొకరు ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు ఫోన్ ట్యాప్ చేయించి ఫైల్ తయారు చేశారని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్‌లో అన్ని వేళ్లు మాజీ సీఎం కేసీఆర్ వైపుకే చూపిస్తున్నాయన్నారు. అరెస్టయిన నిందితుల వాంగ్మూలంలోనూ అదే స్పష్టమైందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో సూత్రధారి కేసీఆర్ పై కేసు పెట్టి జైలుకు పంపించకుండా, పాత్ర దారులైన పోలీసుల్ని అరెస్టు చేయడం ఎందుకని ఫ్రశ్నించారు. కాళేశ్వరం కేసు, సీఎంఆర్‌ఎఫ్ బిల్లింగ్‌, గొర్రెల స్కామ్‌, విద్యుత్తు కొనుగోలు, ఫ్లాంట్‌ల నిర్మాణాల్లో స్కామ్‌లు అన్ని వెనుకకు పోయాయన్నారు.

సోనియాగాంధీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డికి కేసీఆర్ జోలికి వెళ్లవద్దని చెప్పారని ఆరోపించారు. ట్యాపింగ్ కేసును వెంటనే కేంద్రం, సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్నారు. ఫామ్‌హౌస్ కేసు, కస్టమ్ మిల్లింగ్ స్కామ్‌లపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఓటుకు నోటు కేసుకు కౌంటర్‌గా ఫోన్ ట్యాపింగ్ కేసును తెరపైకి తెచ్చి కేసీఆర్‌, సీఎం రేవంత్‌రెడ్డిలు పరస్పరం సెటిల్‌మెంట్లు చేసుకున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎంపీలు సుధాకర్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు విజయరామారావు, పెద్దిరెడ్డి, ఎంపీ అభ్యర్థులు గోమాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Latest News