తెలంగాణలో బీజేపీకే మెజార్టీ ఎంపీ సీట్లు

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు.

  • Publish Date - May 14, 2024 / 04:42 PM IST

కాంగ్రెస్‌, బీఆరెస్ దుష్ప్రచారాలను తిప్పికొట్టిన ప్రజలు
సీఎం రేవంత్‌రెడ్డికి ఆగస్టు సంక్షోభం
కాంగ్రెస్‌లో బీఆరెస్ విలీనం
బీజేపీ రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌

విధాత : తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీనే మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్, బీఆరెస్‌లు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని నిలువరించే ప్రయత్నాలను చేసినా తెలంగాణ ప్రజలు ఆ పార్టీల కుట్రలను తిప్పికొటిట ప్రధాని మోదీ పక్షానే నిలిచారని ఓటింగ్ సరళి వెల్లడిస్తుందన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంపై తెలంగాణ ప్రజల్లో కూడా నమ్మకం కలిగి.. సానుకూలత పెరిగిందన్నారు.

బీజేపీ 12కు పైగా సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక చోట్ల రెండో స్థానం కోసం కాంగ్రెస్, బీఆరెస్‌ల మధ్యే పోటీ నెలకొందని వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత చూద్దామన్నా బీఆరెస్‌ ఎక్కడా కనిపించదని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేటీఆర్ నియంత ధోరణే ఆ పార్టీని బొంద పెట్టిందని, కుటుంబ పాలన నిర్వాకంతో ప్రజలు విసుగు చెంది ఉన్నందునా పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌కు ఒక్క సీటు కూడా కష్టమేనన్నారు. బీఆరెస్‌ చచ్చిన పాము వంటిదని, ఆ పార్టీకి ఎంత జాకీలు పెట్టి లేపినా పైకి లేవదన్నారు.

భవిష్యత్‌లో కాంగ్రెస్‌లో బీఆరెస్ విలీనం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తమ అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు బీఆరెస్‌ నేతలు కాంగ్రెస్‌లో కలవడం పక్కా అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడే బీఆరెస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తామని కేసీఆర్ అప్పట్లోనే సోనియా గాంధీ కాళ్ల ముందు మోకరిల్లిన సంగతి తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. రాజకీయంగా బీజేపీ తెలంగాణాలో శక్తివంతమైన పార్టీగా మారబోతున్నదని భవిష్యత్తులో కాంగ్రెస్, బీఆరెస్‌లకు ధీటుగా బీజేపీ రాబోతున్నదని చెప్పారు.

రేవంత్‌కు ఆగస్టు సంక్షోభం

లోక్ సభ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసి అలవిగాని హామీలు ఇచ్చారని, దేవుళ్లపై ఒట్టు పెట్టిన రేవంత్ రెడ్డి ఆగస్టులోపు రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభం తప్పదని ప్రజలు చర్చించుకుంటున్నారన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తూ ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలలోనే 16 వేల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ధ్వజమెత్తారు. ఈ ఐదు నెలల్లోనే విద్యుత్తు కోతలు, సాగునీటి సమస్యల పరిష్కారంలో స్పష్టత లేదన్నారు.

కాళేశ్వరం, ధరణి అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో ముందడుగు వేయకపోగా ధరణిలో అక్రమాలకు పాల్పడిన వారిని కాంగ్రెస్‌లో చేర్చుకుని పునీతులుగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా రేవంత్‌రెడ్డి ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలు కాంగ్రెస్ ను విశ్వసించలేదన్నారు. దీనిపై ఫేక్ వీడియో తయారు చేసిన రేవంత్ రెడ్డి ఫేక్ సీఎం అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని, ఇండియా కూటమి అంటే అరవింద్ కేజ్రీవాల్‌, హేమంత్ సోరెన్ వంటి జైలు నేతల కూటమే అని ఎద్దేవా చేశారు. దేశాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే సత్తా మోదీకే ఉందన్న నమ్మకం ప్రజల్లో నెలకొందన్నారు.

Latest News