Site icon vidhaatha

తెలంగాణ‌లో బీజేపీని భ‌హిష్క‌రించాలి: సీఎం రేవంత్‌రెడ్డి

 

విధాత‌: పోయిన ఎంపీ ఎన్నిక‌ల్లో మీరు న‌న్ను ఆద‌రించ‌డం వ‌ల్లే ఇప్ప‌డు మీ ముందుకు ముఖ్య‌మంత్రిగా వ‌చ్చాన‌న్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆదివారం ఎల్బీన‌గ‌ర్‌లో నిర్వ‌హించిన కార్న‌ర్‌మీటింగ్‌లో ఆయ‌న మాట్లాడారు. ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని, సునీత మహేందర్ రెడ్డిని గెలిపిస్తే మీ సమస్యలను పరిష్కరించేందు కృషి చేస్తారన్నారు. ఆనాడు నన్ను ఆశీర్వదించినట్లే, ఎల్బీ నగర్ నుంచి సునీతమ్మకు 30వేల మెజారిటీ ఇవ్వండని సీఎం కోరారు. ఎల్బీన‌గ‌ర్‌లో వ‌ర‌ద ముంపు స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డం, అలాగే హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరింప చేసే బాధ్యత నాదేన‌ని హామీ ఇచ్చారు.

తెలంగాణ‌ను నిండా ముంచేందుకు మోదీ ప్ర‌య‌త్నం
తెలంగాణను నిండా ముంచేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారన్నారు. బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వలేదు, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదని మండిప‌డ్డారు. ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ విభజన హామీలు ఎందుకు నెరవేర్చలేదో చెప్పాకే తెలంగాణ‌కు రావాల‌న్నారు. బీజేపీ కి ఓట్లు వేస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారట, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేస్తారో జవాబు చెప్పాకే మోదీ తెలంగాణకు రావాలని, అప్ప‌టి వ‌ర‌కు తెలంగాణలో బీజేపీని బహిష్కరించాలి, ఈ ఎన్నికల్లో బీజేపీని పడగొట్టాలన్నారు.

బండి రాలే కానీ అర‌గుండు వ‌చ్చింది
బీజేపీ అభ్య‌ర్థి ఈటెల రాజేందర్ ఏనాడైనా మీ సమస్యలను అడిగేందుకు ఇక్కడికి వచ్చారా? అని ప్ర‌శ్నించారు. వరదలు వచ్చినప్పుడు బండి పోతే బండి ఇస్తామని బండి సంజయ్ చెప్పిండు, బండి రాలే గుండు రాలేదు. కానీ ఇప్పుడు అరగుండు వచ్చి మిమ్మల్ని ఓట్లు అడుగుతున్నారని విమ‌ర్శించారు. దేవుడి పేరు చెప్పుకుని కొందరు బిచ్చమెత్తినట్లు, రాముడి పేరుతో బీజేపీ ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తోంద‌ని, దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలన్నారు.

కారు ఇక తిరిగి రాదు
కేసీఆర్ కారు తూకానికి వెళ్లింది, ఇక తిరిగి రాదన్నారు. ఉద్యోగం ఊడిందనే కేసీఆర్ బస్సు యాత్ర పేరుతో కొంగ జపం చేస్తున్నారని, ఈ కొంగకు ఓటేస్తే పరోక్షంగా బీజేపీకి ఓటు వేసినట్లేన‌ని విమ‌ర్శంచారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామ‌ని, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామ‌న్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు ఉచిత వైద్యం,పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామ‌ని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సునీతక్కను గెలిపించండి, మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత, 118 జీవో సమస్యను పరిష్కరించే బాధ్యత నాదని సీఎం రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు.

Exit mobile version