లోకసభ ఎన్నికల సమయంలో రైతుల ఆందోళన

లోకసభ ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీని సాగునీటి కష్టాలు వెన్నాడుతున్నాయి.

  • Publish Date - April 1, 2024 / 12:37 PM IST

రైతులకు మద్దతుగా రంగంలోకి దిగిన బీఆర్ఎస్, బీజేపీ

దీక్షలు, ఆందోళనలతో రెండు పార్టీల ఎటాక్

కాంగ్రెస్ పార్టీని వెన్నడుతున్న సాగునీటి కష్టాలు

విధాత బ్యూరో, కరీంనగర్: లోకసభ ఎన్నికల సమయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీని సాగునీటి కష్టాలు వెన్నాడుతున్నాయి. తీవ్రమైన నీటి కొరత కారణంగా పంట పొలాలు ఎండిపోతుండడంతో ఆందోళన చెందుతున్న రైతులు రోడ్డెక్కుతుండడంతో, అధికార పార్టీ నేతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఏర్పడింది.

రైతుల నిరసనలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బీఆర్ఎస్, బిజెపి “వారికి మద్దతుగా ఉద్యమాలకు సిద్ధపడుతుండడం” కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తున్నది. శ్రీరామ్ సాగర్, కాళేశ్వరం, ఎగువ మానేరు, దిగువ మానేరు లాంటి జలాశయాల కింద ఇంతకాలం సాగునీటి కష్టాలు లేకుండా పంటలు పండించిన రైతులు, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో

ఆగ్రహానికి గురవుతున్నారు. వేసుకున్న పంటలు ఎండిపోకుండా చూడడానికి రైతులు కొన్ని ప్రాంతాలలో బావులలో పూడికతీత పనులు చేపట్టగా, మరి కొన్ని ప్రాంతాలలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకువచ్చి పొలాలకు నిరందిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతుల నుండి వ్యక్తమవుతున్న నిరసనలకు మద్దతుగా ప్రతిపక్ష బిఆర్ఎస్, బిజెపి నేతలు రంగంలోకి దిగుతుండడంతో ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది.

ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎండిపోయిన పంటలకు ఎకరాకు 25 వేల పరిహారం, రెండు లక్షల పంట రుణాలను వెంటనే మాఫీ చేయాలనే డిమాండ్లతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పెద్దపల్లి లోకసభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో 36 గంటల పాటు రైతు దీక్ష చేపట్టారు. పెద్దపల్లి, రామగుండం, చెన్నూరు మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, కోరు కంటి చందర్, బాల్క సుమన్, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి జిల్లా పరిషత్ చైర్మన్లు పుట్ట మధుకర్, దావ వసంత, జక్కుల శ్రీహర్షిని తదితరులు ఈ దీక్షలో పాల్గొన్నారు.

చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండల పరిధిలోని కురిక్యాల వరద కాలువ వద్ద ప్రధాన రహదారిపై మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేపట్టారు. శ్రీరామ్ సాగర్ నీటిని వరద కాలువకు విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ఆదుకోవాలని వారి సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో కరీంనగర్, జగిత్యాల ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లడంతో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ తో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు

రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట రైతు దీక్ష చేపట్టనున్నారు. సోమవారం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తెస్తూ అన్ని మండల కేంద్రాలలో అధికారులకు బిజెపి నేతలు వినతి పత్రాలు అందజేశారు. మంగళవారం ఒకరోజు నిర్వహించే రైతు దీక్ష అనంతరం బిజెపి నేత సంజయ్ కల్లాల్లోని వరి ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించనున్నారు. అవసరమైన పక్షంలో కల్లాల వద్దే బస చేయాలని ఆయన నిర్ణయించారు. ఓవైపు రైతులు, మరోవైపు విపక్షాల ముప్పేట దాడితో ప్రస్తుత గండం నుండి బయటపడే మార్గాల కోసం కాంగ్రెస్ నేతలు అన్వేషిస్తున్నారు.

Latest News