BRS Crisis Achampeta | అచ్చంపేటలో ఆత్మీయ సమ్మేళనం.. ఉనికి కోసం బీఆర్ఎస్ పాట్లు!

అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ని చక్కబెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తులు చేపట్టింది.

  • Publish Date - August 8, 2025 / 08:12 PM IST

BRS Crisis Achampeta | అచ్చంపేట నియోజకవర్గం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన రాజీనామా తో బీఆర్ఎస్ లో అలజడి మొదలైంది. దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ ని చక్కబెట్టేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం కసరత్తులు చేపట్టింది. అయోమయంలో ఉన్న పార్టీ క్యాడర్‌లో భరోసా ఇచ్చేందుకు బీఆర్ఎస్ కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, అచ్చంపేట పార్టీ ఇన్‌చార్జ్ మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్,సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, బీరం హర్షవర్ధన్ రెడ్డి, రాష్ట నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా నేతలు ప్రసంగిస్తూ అచ్చంపేట నియోజకవర్గం లో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావడం చూస్తే కేసీఆర్ నాయకత్వం పైన ఉన్న విధేయత, విశ్వాసానికి నిదర్శనమన్నారు. మీకు ఉన్న ఉత్సాహం చూస్తుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ ఎస్ జండా మీ ఎగరవేస్తామనే నమ్మకం కలుగుతుందని దీమా వ్యక్తం చేశారు. అచ్చంపేట నియోజకవర్గం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఎల్లవేళల అండగా ఉంటామని భరోసానిచ్చారు. గతం గురించి మాట్లాడటం కన్నా భవిష్యత్ గురించి ఆలోచించి పార్టీ ని బలోపేతం చేయడమే మన ముందున్న కర్తవ్యం అని నేతలు పేర్కొన్నారు. ఇక్కడి నాయకులను చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని తెలుస్తున్నదన్నారు. పార్టీని ఎవరూ వీడినా కార్యకర్తలు పార్టీ కి అండగా ఉంటారని నేతలు అన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం లోని బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.