Site icon vidhaatha

MLA Harish Rao | నా నియోజక వర్గానికి నువ్వు వస్తావా?.. నీ నియోజకవర్గానికి నేను రావాలా?: హరీశ్‌రావు

సంపూర్ణంగా రుణమాఫీ ఏ గ్రామంలో జరిగిందో చూపించాలి
సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు మరో సవాల్

MLA Harish Rao | సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) 2లక్షల రుణమాఫీ పూర్తయినట్లుగా రైతులను మోసం చేస్తున్నాడని, సంపూర్ణ రుణమాఫీ (Runa Mafi)కి ఎగనామం పెట్టి మొత్తం మాఫీ చేశానని ఫోజులు కొడుతున్నాడని మాజీ మంత్రి టి.హరీశ్‌రావు మండిపడ్డారు. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయ్యిందంటే నువ్వె చెప్పు… ప్లేస్‌, డైట్, టైమ్ చెప్పు .. ఏ జిల్లాకు, ఏ మండలానికి, ఏ గ్రామానికి పోదామో చెప్పాలన్నారు. నా నియోజక వర్గానికి నువ్వు వస్తావా? నీ నియోజకవర్గానికి నేను రావాలా? రాష్ట్రంలో ఎక్కడికి పోవాలో నువ్వే చెప్పనీ.. అక్కడికి పోయి రుణమాఫీ అయ్యిందో లేదో రైతులను అడిగి రుణమాఫీపై వాస్తవాలను తేల్చేద్ధామని రేవంత్‌రెడ్డికి మరో సవాల్ విసిరారు.

ప్రతిపక్షాన్ని సైద్ధాంతికంగా ఎదుర్కోలేక ప్రశ్నించిన వాళ్లను చావాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాడని, ఉద్యోగాలపై ,రుణమాఫీపై మేం ప్రశ్నిస్తే చావాలని కోరుకుంటున్నాడని, ఈ రోజు చావాలని కోరుకుంటున్నోడో రేపు భౌతిక దాడులకు పురిగొల్పే ప్రయత్నం చేస్నుట్లుగా కనిపిస్తుందని, చంపడానికైనా ప్రయత్నం చేస్తాడన్న అనుమానం కలుగుతుందన్నారు. అయినా మేం భయడపమని మిస్టర్‌ రేవంత్ రెడ్డి.. నీ గాడ్ ఫాదర్స్‌కే మేము భయపడలేదని, నీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడమన్నారు. నువ్వేదో బుల్డోజ్ చేస్తామంటే చూస్తు ఊరుకోబోమని, మేము ఉద్యమం నుండి వచ్చిన వాళ్లం.. రాదన్న తెలంగాణ (Telangana)నే సాధించిన వాళ్లమని నిన్ను వదిలేది లేదన్నారు.

పంచపాండవులు..మంచం కోళ్ల కథలా రుణమాఫీ

దొంగనే దొంగ అన్నట్లుగా పంచ పాండవులు అంటే మంచం కోళ్ల వలె ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపించినట్టుగా కాంగ్రెస్‌ రుణమాఫీ కథ ఉందని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిసెంబర్‌ 9వ తేదీన రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీ(Runa mafi) ని మొదటి సంతకంతో చేస్తానని అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్‌ రెడ్డి ఊదరగొట్టారని అన్నారు. అప్పుడు 40వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారన్నారు. డిసెంబర్‌ 9న రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పారని విమర్శించారు.

తర్వాతా లోక్‌సభ ఎన్నికల్లో పంద్రాగస్టులోగా 31వేల కోట్లను మాఫీ చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) దేవుళ్ల మీద ఒట్లు పెట్టారని గుర్తుచేశారు. కానీ గడువులోగా పాక్షికంగానే రుణమాఫీ చేశారన్నారు. పాక్షికంగానే రుణమాఫీ చేశా.. తప్పయ్యిందని రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలని సూచించారు. అంతేతప్ప మొత్తం రుణమాఫీ చేశానని బూతులు మాట్లాడితే ప్రజలు క్షమించరని అన్నారు. పాక్షికంగా రుణమాఫీ చేసి.. పూర్తిగా మాఫీ చేశామని అంటే ఒప్పుకోవడానికి సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. బీఆరెస్ పార్టీ వదిలిపెట్టదని స్పష్టం చేశారు.

రుణమాఫీపై బోగస్ లెక్కలు..కప్పదాట్లు

అసెంబ్లీ ఎన్నికలప్పుడు మ్యానిఫెస్టోలో 40వేల కోట్లు అని చెప్పి.. ఇప్పుడు 17వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారని హరీశ్‌రావు తెలిపారు. అంటే 23వేల కోట్లు కోత పెట్టారని మండిపడ్డారు. ఇచ్చింది తక్కువ.. కోత పెట్టింది ఎక్కువ అని విమర్శించారు. రాష్ట్రంలో 31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని.. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. 31వేల కోట్లు అని చెప్పి.. ఇప్పుడు 14వేల కోట్లు కోత పెట్టారని విమర్శించారు. రూ.14వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయ్యిందని సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు.

నీది నోరా? మోరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.31వేల కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉందని చెప్పి.. 17వేల కోట్లు మాఫీ చేస్తే.. రుణమాఫీ సంపూర్ణంగా అయినట్టా? కానట్టా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. 47లక్షల మంది రైతులు అని చెప్పి.. 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేశారని అన్నారు. కేవలం 46 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని తెలిపారు. సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టారని మండిపడ్డారు. ఇది మోసం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Exit mobile version