గులాబీ ఆట ముగిసింది.. వేట షురూ!

  • Publish Date - April 5, 2024 / 05:20 PM IST

విధాత ప్రత్యేక ప్రతినిధి: ఉద్యమ పార్టీగా ఆవిర్భవించి, దశాబ్దకాలం రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ అధికార ఆట ముగియగానే ఆ పార్టీని కాంగ్రెస్, బీజేపీలు వేటాడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు ఓ వెలుగువెలిగిన ఆ పార్టీ, ప్రధాన నాయకత్వం ఇప్పుడు సంక్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిలో లోక్ సభ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయి. ఎంపీ అభ్యర్ధుల ఎంపిక కూడా ఇబ్బందిగా మారింది. ఎవరు ఎప్పుడు పార్టీని వీడుతారోననే ఆందోళన నాయకత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

నిన్నటి వరకు నమ్మకమైన వ్యక్తులు తెల్లారేసరికి పార్టీని వీడుతున్నారు. ఈ స్థితిలో అనేక అడ్డంకులను అధిగమించి 17 ఎంపీ స్థానాల్లో అభ్యర్ధులను ఎంపిక చేస్తే ముందు చేవెళ్ళ అభ్యర్ధి రంజిత్ రెడ్డి, తర్వాత వరంగల్ అభ్యర్ధి కడియం కావ్య ఎదురుతిరిగారు. ప్రకటించిన అభ్యర్థిత్వాలను కాదని అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మరోసారి వరంగల్ ఎంపీ అభ్యర్ధి ఎంపిక పై అంతర్గతంగా నాయకత్వ కసరత్తు సాగుతోంది.

మెజార్టీ సిట్టింగ్ ఎంపీలు జంప్

రాష్ట్రంలో అధికారం కోల్పోయి, మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్టీల స్థానాలు తలకిందులయ్యాయి. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ముందుగా సిట్టింగ్ ఎంపీలు చేజారడం ప్రారంభమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు మెజారిటీ పార్టీని వీడారు. అభ్యర్ధిగా ప్రకటించిన తర్వాత కూడా తిరస్కరించి కాంగ్రెస్, బీజేపీల్లో చేరి అభ్యర్ధులుగా ఎదురు నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి పార్టీకి పరీక్షగా మారింది. ఈ కష్టకాలాన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కొంటుందనే చర్చసాగుతోంది.

గులాబీ పార్టీకి నేతల గుడ్ బై

గత లోక్ సభ ఎన్నికల్లో సారూ…కారూ…పదహారు అంటూ ప్రచారం చేసి ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఎంత ప్రచారం చేసినప్పటికీ తొమ్మిది స్థానాలను కైవసం చేసుకున్నారు.. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, చేవెళ్ళ, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, జహీరాబాద్, పెద్దపల్లి స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకున్నది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలను బీజేపీ, హైదరాబాద్ ఎంపీ స్థానంలో ఎంఐఎం విజయం సాధించింది. నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది.

ఇదిలా ఉండగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ లోక్ సభ అభ్యర్ధుల ఎంపిక ప్రారంభంలో బీఆర్ ఎస్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రకటించింది. తొలి అభ్యర్ధిగా చేవెళ్ళ నుంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డిని ప్రకటించారు. కానీ, కొద్ది రోజుల్లోనే పరిస్థితి మారిపోయి సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పార్టీని వీడుతున్నారు. ముందుగా పెద్దపల్లి ఎంపీ వెంకటేషన్ నేత కాంగ్రెస్ లో చేరి బోణీ కొట్టారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మంత్రైన పట్నం మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చి దంపతులిద్దరు కాంగ్రెస్ లో చేరారు.

మహేందర్ రెడ్డి భార్య సునీతను మల్కాజిగిరి ఎంపీ అభ్యర్ధిగా నిర్ణయించారు. తర్వాత రంజిత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్ధిగా ఎంపిక చేసిన కడియం కావ్య, ఆమె తండ్రి ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు ఊహించని షాకిచ్చి కాంగ్రెస్ లో చేరిపోయారు. దీంతో కావ్యను కాంగ్రెస్ అభ్యర్ధిగా ఆ పార్టీ ప్రకటించింది. దీనికి ముందు వరంగల్ సిట్టింగ్ ఎంపీలు పసుసూరి దయాకర్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు.

ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పోతుగంటి రాములు ఆయన కుమారుడు, జడ్పీటీసీ భరత్, జహీరాబాద్ సిట్టింగ్ ఎంపీ బీబీపాటిల్, బీఆర్ఎస్ నేత నగేష్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్, మాజీ ఎంపీలు సీతారాం నాయక్ బీజేపీలో చేరగానే ఎంపీ అభ్యర్ధులుగా ఎంపిక చేశారు. ఆరూరి రమేష్ ను కట్టడిచేసేందుకు యత్నించినా ఆయన బీజేపీలో చేరిపోయారు. గత ఏడాదే బీఆర్ఎస్ మాజీ ఎంపీలు బూర నర్సయ్య, కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిపోయి ఎంపీ అభ్యర్ధులుగా ఎంపికయ్యారు. బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పైకి గొప్పగా చెప్పినట్లు కనిపించినా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు పార్టీల్లో పోటీపడే అభ్యర్ధుల్లో ఎక్కువ మంది నిన్నటి వరకు బీఆర్ఎస్ కు చెందిన వారే కావడం గమనార్హం.

నిన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులు ఆ పార్టీని వీడుతున్న తీరుకు ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు. సిట్టింగ్ ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలేకాకుండా పార్టీ సెక్రటరీ జనరల్ గా ఉన్న కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మీ, మాజీ మేయర్, పలువురు జడ్పీ చైర్మన్లు ఇప్పటికే పార్టీని వీడారు.

ప్రజా తీర్పు.. బలమైన ప్రతిపక్షం

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలై అధికారం కోల్పోయినప్పటికీ 39 స్థానాలను కైవసం చేసుకున్నది. బీజేపీ 8స్థానాల్లో, 7 స్థానాల్లో ఎంఐం గెలుపొందింది. అధికారం కాంగ్రెస్ కు కట్టబెట్టినా బలమైన ప్రతిపక్షాన్ని ప్రజలు కోరుకున్నారు. వాస్తవానికి బీఆర్ఎస్ వచ్చిన 39 స్థానాలు తక్కువేం కాదు. రాష్ట్రంలో ఉన్న 119 సీట్లలో మూడవ వంతు స్థానాలను కైవసం చేసుకున్నది. అయినప్పటికీ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకుంటామనే నమ్మకం ఆ పార్టీ నాయకత్వం నెమ్మదిగా కొల్పోతోంది.

నిన్న పక్కన ఉన్న ఎమ్మెల్యే రేపు ఉంటారో. జారిపోతారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పి ఆ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులను నిస్సిగ్గుగా ప్రోత్సహించి విపక్షపార్టీలను కోలుకోలేని దెబ్బకొట్టారు. ముఖ్యంగా రెండవ పర్యాయం భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుని విపక్షాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు. పరిస్థితి తిరుగబడి ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఫిరాయింపులు ప్రారంభం కావడం విషాదం.

రాజకీయ విలువలు, సంప్రదాయాలు వీడి అధికారం లేకుంటే ఒక్క రోజు ఉండలేని పరిస్థితి గెలిచిన ఎమ్మెల్యేల్లో నెలకొనగా, అధికారంలోకి వచ్చన పార్టీలు వివిధ రూపాల్లో ఆశజూపి విపక్షపార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు. అధికారంలోకి రాగానే అన్ని పార్టీలు ఈ పద్దతిని పాటిస్తూ విపక్షలో ఉన్నప్పుడు నీతులు చెప్పడం సాధారణ అంశంగా మారింది. ఈ ఫిరాయింపులతో ప్రజాతీర్పును సైతం అవహేళన చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తున్నారు. ఈ ప్రయత్నంలో అవినీతి, అక్రమాలు, కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి రాష్ట్రంలో ఫిరాయింపుల పర్వానికి తెరతీయడం గమనార్హం.

Latest News