విధాత, హైదరాబాద్: BRS పార్టీకి ఉప ఎన్నికలు అచ్చి వచ్చినట్లు కనిపించడంలేదు. ఏ ఎన్నిక వచ్చినా గెలుపు మాదే అని ధీమాగా ప్రకటించిన BRS పార్టీకి 2023 తరువాత వరుసగా వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం చెంది తమ ఖాతాలో ఉన్న స్థానాలను హస్తం పార్టీకి అప్పజెప్పింది. దీంతో BRS వర్కింగ్ ప్రెసిడెండ్ KTR చరిష్మాపై రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై భారీ అంచనాలు పెట్టుకున్న BRS శ్రేణులు ఒక్కసారిగా ఫలితాల తరువాత చతికిల పడ్డాయి. పార్టీ క్యాడర్‌లో నిరుత్సాహం ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజాగ్రహం ఉందని, ఈ సమయంలో జూబ్లీహిల్స్‌లో సునాయసంగా గెలుస్తామన్నధీమాతో BRS ఉన్నది. దీంతో ఈ ఉప ఎన్నికల ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకత్వాన్ని జూబ్లీహిల్స్‌లో మొహరించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు అందరూ జూబ్లీహిల్స్‌పై దృష్టి కేంద్రీకరించి ప్రచారం చేశారు. అయినా ఆశించిన ఫలితం రాలేదు. BRS అభ్యర్థి మాగంటి సునీతపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
రాష్ట్రంలో 2023 తరువాత జరిగిన ఉప ఎన్నికలు రెండు కూడా BRS ఎమ్మెల్యేల అకాల మరణంతో వచ్చినవే.. ఈ ఉప ఎన్నికల్లో BRS తన సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అక్కడ 2024లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి గణేశ్‌నారాయణ్ గెలుపొందారు. తిరిగి ఏడాది తరువాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ కూడా తాజాగా ఉప ఎన్నిక జరిగింది. BRS తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీ చేసింది.
భర్త చనిపోయాడన్న సెంటిమెంట్ తోపాటు, కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతతో తాము గెలుస్తామని భావించారు . కానీ ప్రజలు సెంటిమెంట్‌ను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించారు. ఇలా రెండు ఉప ఎన్నికలు షాక్ ఇవ్వడంతో గులాబీ పార్టీలో గుబులు మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవే ఫలితాలు రిపీట్ అయితే మన పరిస్థితి ఏమిటా అన్న చర్చలు జరుగుతున్నాయి.
