KCR | సోషల్ మీడియాలో ఖాతా తెరిచిన కేసీఆర్‌

బీఆరెస్ అధినేత కేసీఆర్ సోష‌ల్ మీడియాలో తొలిసారిగా అడుగుపెట్టారు. శుక్రవారం ట్విటర్ ఎక్స్ ఖాతా తెరిచిన తొలి రోజునే గంటల వ్యవధిలో వరుస ట్విట్లతో అదరగొడుతున్నారు

  • Publish Date - April 27, 2024 / 05:02 PM IST

కరెంటు కోతలపై ఎక్స్‌లో ట్వీట్

విధాత, హైదరాబాద్: బీఆరెస్ అధినేత కేసీఆర్ సోష‌ల్ మీడియాలో తొలిసారిగా అడుగుపెట్టారు. శుక్రవారం ట్విటర్ ఎక్స్ ఖాతా తెరిచిన తొలి రోజునే గంటల వ్యవధిలో వరుస ట్విట్లతో అదరగొడుతున్నారు. @KCRBRSpresident పేరుతో కేసీఆర్ తన ట్విటర్ ఎక్స్‌ (X) ఖాతాను, ఇన్‌స్ట్రాగ్రాం ఖాతాలను తెరిచారు. ఖాతా ఓపెన్ చేసిన గంటల వ్యవధిలోనే 10వేలకు పైగా ఫాలోవర్స్ వచ్చారు. ఇక నుంచి కేసీఆర్ ఎక్స్ వేదికగా విస్తృత ప్రచారం చేయనున్నారు.

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ బస్సుయాత్ర చేపట్టి ఆయా నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ యాత్రకు సంబంధించిన వివరాలను, అలాగే రాజకీయాలను ఎప్పటికప్పుడు ఎక్స్ అకౌంట్ లో కేసీఆర్ పంచుకుంటారు. ఎక్స్ ద్వారా కేసీఆర్ ఎలాంటి విషయాలను పంచుకుంటారోనని నెటిజన్లు, రాజకీయ వర్గాలు, మరికొందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఖాతాల ద్వారా కేసీఆర్ ట్రెండ్ సృష్టించే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు. కేసీఆర్ ఎక్స్‌ను ఫాలో కావాలనుకునే వారు Link – http://x.com/kcrbrspresident  లింక్‌ను ఓపెన్ చేసుకోవాలి.

గంటల్లో రెండు ట్విట్లు పెట్టిన కేసీఆర్‌

సోషల్ మీడియా ఖాతాలు తెరిచిన తొలిరోజునే కేసీఆర్ ఎక్స్‌లో తొలి పోస్టును తన ఉద్యమకాలం నాటి తన ఫోటోతో పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు..బస్సుయాత్ర వివరాలతో చేశారు. ఆ వెంటనే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ క‌రెంట్ కోత‌ల‌పై రెండో ట్వీట్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో చాలా చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయని, నేను గంట క్రితం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంటు పోయిందని ట్విట్‌లో పేర్కోన్నారు. ప్రతి రోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కరెంటు పోవడం లేదని ఊదరగొడుతున్నారని, నాతోపాటు ఉన్న మాజీ ఎమ్మెల్యేలు వారి వారి నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతున్నదని ఈ సందర్భంగా నాకు చెప్పారని తెలిపారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పరిపాలనా వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుంది? రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలి అని కేసీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

Latest News