IND vs SA 3rd ODI | దక్షిణాఫ్రికాతో ఆఖరి మ్యాచ్​ : భారత్ భారీ విజయం – సిరీస్​ కైవసం

విశాఖపట్నం వన్డేలో భారత్ 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. యశస్వీ జైశ్వాల్ తొలి వన్డే  శతకం, కోహ్లీ, రోహిత్​ల అర్థశతకాలు, ప్రసిద్ధ్–కుల్దీప్ చెరో 4 వికెట్లతో చెలరేగడంతో భారత్​ సునాయాస విజయం సాధించి, సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది.

యశస్వీ జైశ్వాల్ తొలి వన్డే సెంచరీ సాధించిన క్షణం. దీంతో మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు

India vs South Africa 3rd ODI: Jaiswal’s Maiden Hundred, Kohli’s Fast Fifty Seal 9-Wicket Win for India

(విధాత స్పోర్ట్స్ డెస్క్‌)

IND vs SA 3rd ODI | విశాఖపట్నంలో జరిగిన సిరీస్ నిర్ణాయక మూడో వన్డేలో టీమిండియా దక్షిణాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన క్షణం నుంచి మ్యాచ్ భార‍త్ పక్షానికి మారిపోయింది. కొత్త బంతితో కొంత స్వింగ్ ఉన్నా, మొత్తం మ్యాచ్‌ అంతా భారత్ పూర్తి ఆధిపత్యం చూపింది.

దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసి 270 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్ అద్భుతమైన సెంచరీతో రాణించాడు. ఒక సమయంలో ప్రొటీస్ స్కోరు 350 దాటేలా కనిపించింది. కానీ అక్కడ నుంచి భారత బౌలర్లు మ్యాచ్‌ను పూర్తిగా తమ చేతుల్లోకి లాగేసుకున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ చెరో నాలుగు వికెట్లు తీసి మిడిల్​, లోయర్ ఆర్డర్‌ను కుప్పకూల్చడంతో  సౌతీలు 270 పరుగులకే పరిమితమైంది.

పద్ధతిగా లక్ష్యాన్ని కరిగించిన బ్యాటర్లు

271 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ దీటుగా ఆరంభించింది. రోహిత్ శర్మ, యశస్వీ జైశ్వాల్ ఇన్నింగ్స్‌ను చాలా సులభంగా నడిపించారు. రోహిత్ తన అనుభవంతో జైశ్వాల్‌ను గైడ్ చేస్తూ, బంతి స్వింగ్ అవుతున్న సమయంలో జాగ్రత్తగా ఆడించాడు. రోహిత్ 75 పరుగులు చేసి అవుట్ అయ్యేసరికే భారత్ గెలుపు వైపు పయనిస్తోంది.

రోహిత్ ఔటయ్యాక, యశస్వీ తన బ్యాటింగ్‌ను మరింత వేగంగా కొనసాగించాడు. చివరకు తన మొదటి వన్డే శతకం నమోదు చేశాడు. మరోవైపు వీర ఫాంలో ఉన్న విరాట్ అలవోకగా ఆడాడు. కేవలం 45 బంతుల్లో 65 పరుగులు బాది మ్యాచ్​ను ముగించాడు. మ్యాచ్ ముగిసే సమయానికి ఇంకా 10 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్ ఎంత సులభంగా గెలిచిందో తెలిసిపోతోంది.

టాస్​ ఓటముల దురదృష్టానికి చెక్​ పెట్టిన ఇండియా

ఈ సిరీస్‌లో భారత జట్టు బాగా ఆడినా, టాస్ కారణంగా కొంత ఇబ్బందులు పడింది. వరుసగా 20 మ్యాచుల్లో టాస్​ ఓడిన భారత్​, చివరికి ఈ మ్యాచ్​లో టాస్​ గెలిచి తన చెత్త రికార్డును మరుగుపరిచింది. ఇండియా గత రెండు మ్యాచ్‌ల్లో టాస్ ఓడినా , మొదటి మ్యాచ్​ గెలవడంతో సిరీస్ ఈ డిసైడర్‌కి తీసుకువచ్చింది. చివరికి కెప్టెన్​ రాహుల్ ఈ మూడో మ్యాచ్‌లో టాస్ గెలవడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. టాస్ కీలక పాత్ర పోషించినా, దానిపైనే భారత్ పూర్తిగా ఆధారపడలేదు. బౌలర్లు సరైన సమయానికి వికెట్లు పడగొట్టి కీలకపాత్ర పోషించగా, రోహిత్, జైశ్వాల్, కోహ్లీ  లక్ష్యాన్ని ఓ పద్ధతిగా చేధించారు.

సిరీస్‌లో సీనియర్లు కోహ్లీ, రోహిత్​ ఇద్దరూ అద్భుత ఫాంతో రాణించి వన్డేల్లో తామెంత ముఖ్యమో చాటిచెప్పారు. మొత్తం మీద ఈ సిరీస్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించింది. మూడు మ్యాచ్‌ల్లోను పిచ్ పరిస్థితులు వేర్వేరుగా ఉండటం, టాస్ కీలకమవడం, జట్ల మధ్య సమంగా పోటీ ఉండటం ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చాయి. చివరికి అనుభవం, క్రమశిక్షణ, స్థిరమైన బ్యాటింగ్‌తో భారత్ సిరీస్‌ను 2–1తో కైవసం చేసుకుంది.

Latest News