Winter Heaters Risk | చలికాలంలో ఇళ్లలో హీటర్స్‌ వాడటం ఎంత సేఫ్‌?

చలికాలం వచ్చిందంటే గ్రామీణ ప్రాంతాల్లో చలి మంటలు వేసుకుంటారు. కానీ.. పట్టణాల్లో హీటర్స్‌ వాడుతున్నారు. ఇవి సురక్షితమేనా? నిపుణులు ఏమంటున్నారు?

winter heater, ai creation

Winter Heaters Risk | చలికాలం మొదలైందంటేనే ఇళ్లల్లో ఏసీలు ఆగిపోతాయి.. క్రమంగా ఫ్యాన్‌ స్పీడ్‌ తగ్గుతుంది.. కొన్ని రోజులకు అది కూడా బంద్‌! అదే సమయంలో గదిని వెచ్చబర్చేందుకు కొంతమంది హీటర్స్‌ వాడుతూ ఉంటారు. ఇలా హీటర్స్‌ వాడటం సరైందేనా? సురక్షితమేనా? దీన్ని చెప్పుకొనే ముందు ఈ రెండు ఘటనలు చూడండి..
గత ఏడాది నోయిడాలో ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు చనిపోయారు. కారణం.. రాత్రంతా వారు ఉపయోగించి గ్యాస్‌ హీటర్! దాని వల్ల గదిలో కార్బన్‌ మొనాక్సైడ్‌ స్థాయి పెరిగిపోయి.. ఆక్సిజన్‌ తగ్గిపోయింది. దీంతో వాళ్లు నిద్రలోనే చనిపోయారు. ఇలానే జమ్ముకశ్మీర్‌లో మొత్తం కుటుంబం హీటర్‌ నుంచి వెలువడిన విషపూరిత వాయువు కారణంగా ప్రాణాలు కోల్పోయారు.

శీతాకాలాల్లో ప్రజలు హీటర్స్‌, బ్లోయర్స్‌ వాడటం ద్వారా చలి నుంచి రక్షణ పొందుతూ ఉంటారు. కానీ.. ఈ రక్షణే కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా పరిణమిస్తూ ఉంటుంది. నిజానికి ఈ హీటర్స్‌.. విషపూరితమైన కార్బన్‌ మొనాక్సైడ్‌ (CO) అనే వాయువును విడుదల చేస్తాయి. ఆ గదికి వెంటిలేషన్‌ లేనిపక్షంలో ఆ వాయువు గది నిండా వ్యాపిస్తుంది. దీంతో చాలా నష్టాలు ఉన్నాయి. ఈ వాయువు కారణంగా తీవ్ర అలసట, బలహీనత, సృహకోల్పోవడం వంటివి సంభవిస్తాయి. తద్వారా చావుకు దగ్గరవుతారు. నవజాత శిశువుల్లో 88 శాతం మందికి హీటర్స్‌ కారణంగా తీవ్ర దగ్గు, శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారని నేషనల్‌ లైబ్రరీ ఆఫ్‌ మెడిసన్‌లో ప్రచురితమైన ఒక రిపోర్ట్‌ పేర్కొంటున్నది.

హీటర్స్‌తో అతిపెద్ద సమస్య ఏంటి?

నిరవధికంగా హీటర్స్‌ను ఉపయోగించడం వల్ల గదిలో తేమ శాతం తగ్గిపోతుంది. దాని వల్ల గొంతు, ముక్కు, చర్మం పొడిబారిపోతాయి. పొడి గాలి శ్వాసకోశ వ్యవస్థను చికాకుపరుస్తుంది. దానితో దగ్గు, అలెర్జీలు, ఆస్తమా వంటి సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు.. చర్మం పొడిబారడం, కళ్లు మండటం లేదా కండ్ల కలకలు వంటివి వస్తాయి. నిరవధికంగా హీటర్స్‌ను వాడటం వల్ల మెదడులో అంతర్గత రక్తస్రావం లేదా బ్రెయిన్‌స్ట్రోక్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. హీటర్లు.. ప్రమాదకరమైన రంగు, వాసన లేని కార్బన్‌ మొనాక్సైడ్‌ను విడుదల చేస్తాయి. ఈ వాయువు మూసి ఉంచిన గదిలోనే తిరుగుతూ శరీరంలో ఆక్సిజన్‌ స్థాయిని తగ్గిస్తుంది. దానితో తల నొప్పి, మగత, నీరసం, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సీరియస్‌ కేసులలో ఇది సృహ కోల్పోవడానికి, ఆఖరుకు మరణానికి కూడా దారి తీస్తుంది. నవజాత శిశువులు, చిన్నపిల్లలు ఉన్నట్టయితే హీటర్స్‌ వాడకపోవడమే మంచిది.

సురక్షితంగా వాడటం ఎలా?

చలికాలంలో హీటర్‌ అవసరం ఉందని అనుకుంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. గదిలోకి తాజా గాలి వచ్చేలా చూసుకోవాలి. గదిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గకుండా ఉండాలి. గదిలోని తేమను హీటర్‌ మింగేస్తుంది కాబట్టి.. ఒక కుండలో నీటిని నింపి మూత పెట్టకుండా వదిలేయాలి. అప్పుడు గదిలో తేమ కొనసాగే అవకాశం ఉంటుంది. అలాగని హీటర్‌ మీద పెట్టకూడదు.. కొంచెం దూరంగా ఉంచాలి. ఆస్తమా, అలర్జీలు, లేదా హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లు ఎక్కువ సేపు హీటర్‌ ముందు కూర్చొనకూడదు. హీటర్‌కు దగ్గరలో దుస్తులు లేదా మంటలు అంటుకునే స్వభావం ఉన్న వస్తువులేవీ ఉంచకూడదు. హీటర్‌ కచ్చితంగా పనిచేసేలా ఉండాలి. ఏ మాత్రం సమస్య ఉన్నదాన్ని వాడినా ప్రమాదమే.
ఇది ప్రాథమిక అవగాహనకోసమే. మరిన్ని వివరాలకు మీకు తెలిసిన ఆరోగ్య నిపుణులను సంప్రదించాలి.

Read Also |

Most Expensive Whisky | ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన 8 లిక్కర్లు.. రూ.256 కోట్ల వరకు..
Heliconia | మోదీ–పుతిన్ భేటీలో అందరినీ తనవైపుకు తిప్పుకున్న మొక్క
China Longest Airlines : ప్రపంచంలోనే పొడవైన ఎయిర్ రూట్ ప్రారంభం!

Latest News