విధాత: ముచ్చటగా మూడోసారి శాసనసభ సమరానికి సిద్ధమైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓరుగల్లు గడ్డ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న కేసీఆర్.. ఎవరూ ఊహించని విధంగా సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. అక్టోబర్ 16వ తేదీన వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించి, ఆ వేదిక నుంచే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటిస్తానని పలు సందర్భాల్లో ప్రస్తావించిన కేసీఆర్.. తన నిర్ణయాన్ని మార్చుకున్నారు.
తెలంగాణ భవన్ వేదికగానే బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రకటించాలని సీఎం నిర్ణయించారు. అక్టోబర్ 15వ తేదీనే తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశమై, అదే రోజు మేనిఫెస్టోను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. అదే రోజు హుస్నాబాద్ నియోజకవర్గం వేదికగా నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.
అక్టోబర్ 15వ తేదీన సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు కేసీఆర్ వివరించనున్నారు. పలు కీలక సూచనలు చేయనున్నారు. కాగా.. అదే సందర్భంలో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ బయల్దేరి.. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్నారు. 16న జనగామ, భువనగిరి, 17న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, మేడ్చల్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు.
9న నామినేషన్లు దాఖలు చేయనున్న ముఖ్యమంత్రి
నవంబర్ 3వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక 9వ తేదీన కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఆ రోజు ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. గజ్వేల్‌లో మొదటి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు కామారెడ్డిలో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు.