బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు: కేటీఆర్‌

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్క‌య్యాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు

  • Publish Date - April 27, 2024 / 04:55 PM IST

బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉంది
ఫిరాయింపుదారులను ఖచ్చితంగా ఓడిస్తాం
రేవంత్ రెడ్డిది మాట నిలుపుకునే చరిత్ర కాదు
ద‌మ్ముంటే హ‌రీశ్‌రావు స‌వాల్‌కు స్పందించాలి
ఎన్నికల తర్వాతా పార్టీ నిర్మాణంపై ఫోకస్‌
మీడియా చిట్ చాట్‌లో కేటీఆర్‌

విధాత, హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆరెస్‌ను ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్క‌య్యాయని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో మీడియా చిట్ చాట్‌లో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌, బీజేపీలపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలో బీఆరెస్ తిరిగి పుంజుకోవద్దన్న కుట్రతో ఎంపీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెల‌వ‌నియొద్దంటూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ పార్టీ బీజేపీకి సహకరించేందుకే చాలా చోట్ల ఎంపీ అభ్యర్థులుగా డమ్మీ అభ్యర్థులను పెట్టారని, పోటీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆయా నియోజకవర్గాలతో సంబంధమే లేదన్నారు.

మల్కాజిగిరితో సంబంధమే లేని సునీత మహేందర్ రెడ్డిని అక్కడ పోటీలో నిలిపారని, రేవంత్ రెడ్డి బీజేపీకి సహకరిస్తున్నాడనే దానికి ఇదే ఉదాహరణగా కేటీఆర్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని ప్రజలు గుర్తించి ఆ రెండు పార్టీల కుట్రలను తిప్పి కొట్టి ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ గొంతుక బీఆరెస్‌ను గెలిపించాలని కోరుతున్నామన్నారు. బీజేపీకి కేంద్రంలో అంశాల వారీగా మాత్రమే గతంలో మేం మద్దతు ఇచ్చామని, తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బీజేపీతో రాజీ పడిందని కేటీఆర్ ఆరోపించారు. లిక్కర్ స్కామ్ జరిగిందా? లేదా అనేదానిపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

రాహుల్ గాంధీ కేరళలో సీపీఎంను తిడుతున్నారని, దేశంలో మిగతా ప్రాంతాల్లో సీపీఎంతో పొత్తు పెట్టుకున్నారని,అసలు రాహుల్ గాంధీకి స్పష్టమైన వైఖరి లేదని ఎద్దేవా చేశారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ను సీఎం రేవంత్ రెడ్డి బండ బూతులు తిట్టారని, అయినా ఇక్కడి సీపీఎం నేతలు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆప‌ద మొక్కులు మొక్కుతున్నాడ‌ని, ఇచ్చిన మాట నిలుపుకోలేని అస‌మ‌ర్థ నాయ‌కుడని, సొంత జిల్లాలో ఎంపీ సీట్లు గెలవడం కూడా కష్టమేనన్నారు. ఇంఛార్జ్ ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని రేవంత్ రెడ్డి ఆ బాధ్యతల‌ నుంచి తప్పుకున్నారని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదన్నారు. కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నాడని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తామని చెప్పి ఓడిపోయిన తర్వాత మాట తప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు మోసం పార్ట్-1 జ‌రిగిందని, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు ముందు మోసం పార్ట్ -2 కొన‌సాగుతోందని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రుణమాఫీ చేయడని, నేతి బీరకాయలో నెయ్యి ఉండని తీరుగానే రేవంత్ రెడ్డి మాటల్లో నిజాయితీ ఉండదని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన పార్టీకే రేవంత్ రెడ్డి కట్టుబడి లేడని, ఆయన ఏ స‌వాల్‌కు కట్టుబడి ఉన్నాడో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే హరీశ్‌రావు విసిరిన సవాల్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, రేవంత్ రెడ్డి మోసాల్ని చూశాక ప్రజలు కేసీఆర్ పాలనే కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీఆరెస్‌కు 10-12 సీట్లు ఇవ్వాలని, అప్పుడు కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించి ప్రజలకు మంచి జరిగేలా చేస్తారని కేటీఆర్ తెలిపారు.

బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకే ఉంది

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి నార్త్ ఇండియాలో ఎదురు గాలులు వీస్తున్నాయ‌ని కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉత్త‌ర భార‌త ప్ర‌జ‌లు మోదీ నాయ‌క‌త్వాన్ని తిర‌స్క‌రిస్తున్నార‌ని, ఎన్డీఏ, ఇండియా కూటమిలో లేకుండా కూడా సుమారు 13 పార్టీలు బయట ఉన్నాయని, కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు మాకు రాజకీయ ప్రత్యర్థులేనని, ఈ రెండు పార్టీలు చేసిన ద్రోహానికి దేశానికి ఎంతో నష్టం జరిగిందన్నారు. అందుకే కాంగ్రెస్, బీజేపీలను తిరస్కరించి ప్రాంతీయ పార్టీలకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. కాంగ్రెస్‌కు బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదని, బీజేపీని ఎదుర్కొనే శక్తి ప్రాంతీయ పార్టీలకు మాత్రమే ఉందన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి లేకనే రాహుల్ గాంధీ ఉత్తర భారతదేశం నుంచి కేరళకు పారిపోయిండన్నారు. బీఆరెస్‌ పార్టీ 10- 12 స్థానాలు సాధిస్తే కేంద్రంలో రానున్న ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే అవకాశం ఉందన్నారు

కేటీఆర్‌. ఒకనాడు ఎన్‌టి. రామారావు భారతదేశం అనే పార్టీ పెట్టాలనుకున్నాడని, కానీ ఆయన శిష్యుడు కేసీఆర్ భారత రాష్ట్రసమితితో జాతీయ పార్టీ పెట్టాడని, ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా దేశ వ్యాప్తంగా విస్తరించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికి నీళ్లు, బుల్లెట్ ట్రైన్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, ప్రతి ఒక్కరి ఇళ్లు అని చాలా హామిలిచ్చిన మోదీ ఏ ఒక్కటి కూడా నేరవేర్చకుండా దేశ ప్రజలను మోసం చేశార‌ని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. తెలంగాణ పుట్టుకను అవమానించిన మోదీ.. రాష్ట్రంపై ఎన్నో సార్లు విషం చిమ్మారని, రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయకుండా తెలంగాణకు కావాలనే అన్యాయం చేసిన వ్యక్తి నరేంద్ర మోదీ అని విమర్శించారు. నిత్యావసర వస్తువులను రెట్టింపు కన్నా ఎక్కువ చేసిన పిరమైన ప్రధాని మోదీ అని కేటీఆర్ దుయ్యబట్టారు.

మళ్లీ కేసీఆర్ పాలనే కోరుకుంటున్నారు

తెలంగాణ ప్రజలు నాలుగు నెలలకే కాంగ్రెస్ పాలన పట్ల వ్యతిరేకత పెంచుకున్నారని, మళ్లీ క‌రెంటు కోతలు, తాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పరిపాలనే మళ్లీ కావాలని కోరుకుంటున్నారని, గ్రామాల్లో మార్పు మొద‌లైంద‌ని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలోకి చేరలేదని, రూ. 500 బోనస్, నాలుగు వేల పెన్షన్, రైతు కూలీలకు రూ. 12,000, కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థినులకు స్కూటీలు, తులం బంగారం, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వీటిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్నారు.

ప్ర‌జలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని అర్థమైందని, మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని సూచించారు. దేవుళ్ళ సాక్షిగా ఒట్లు పెట్టి ప్రజలను మోసం చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడని, ఆగస్ట్ 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని పెట్టుకున్నాడని విమర్శించారు. సిరిసిల్లలో మళ్లీ ఆత్మహత్యలు మొదలు అయ్యాయని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గొర్రెల పంపిణీ స్టార్ట్ చేస్తామని చెప్పి చేయలేదన్నారు. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరని గతంలో దివంగత అరుణ్ జైట్లీ అన్నారని, ఆ మాట తప్పని కేసీఆర్ నిరూపించార‌ని, ప‌దేండ్లు అధికారంలో ఉండి తెలంగాణను ప్రగతి పథంలో నడిపించారని చెప్పారు.

రేవంత్‌రెడ్డి పార్టీ మార్పు పక్కా

రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడని, మోడీ నాయకత్వంలోనా..? రాహుల్ గాంధీ నాయకత్వంలోనా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో చేరతాడని, ఇప్పటికి 20 సార్లు నేను ఈ మాట చెప్పిన సరే ఆయన కనీసం ఎందుకు స్పందించటం లేదని కేటీఆర్ నిలదీశారు. హైదరాబాద్ నగరం సంపూర్ణంగా బీఆరెస్‌కు మద్దతు ప్రకటించిందని, కాంగ్రెస్, బీజేపీలను పూర్తిగా తిరస్కరించిందని, ఈ ప్రభుత్వానికి మైనార్టీలను గౌరవించే సంస్కారం లేదని, కనీసం ఒక మంత్రి పదవి కూడా వాళ్లకు ఇవ్వలేదన్నారు.

లోక్ సభ సీట్ల కేటాయింపులో బీఆరెస్‌ సామాజిక సమతూకాన్ని పాటించగా, కాంగ్రెస్, బీజేపీలు మాత్రం అందులో విఫలమయ్యాయని ఆరోపించారు. అందుబాటులో ఉన్న 12 సీట్లలో ఆరు సీట్లు అంటే 50 శాతం బీసీలకే మేం కేటాయించామని, మా పార్టీ కేటాయించిన సీట్లతో సుదీర్ఘకాలం ఉద్యమం చేసిన నాయకులతో పాటు పార్టీకి పనిచేసిన నాయకులు, బీసీలు, దళితులు, గిరిజనుల సహా అన్ని వర్గాల వారున్నారని తెలిపారు.

మల్లారెడ్డి వ్యాఖ్యల మర్మం వేరు

మ‌ల్కాజ్‌గిరి పార్ల‌మెంట్ స్థానంలో ఈట‌ల రాజేంద‌ర్ గెల‌వ‌బోతున్నార‌ని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మ‌ల్లారెడ్డి చేసిన వ్యాఖ్య‌లు రాజకీయ వ్యూహాంతో చేసినవేనని కేటీఆర్ పేర్కోన్నారు. ఈట‌ల రాజేంద‌ర్‌ను మున‌గ చెట్టు ఎక్కించి కింద ప‌డేయాల‌నేది మ‌ల్లారెడ్డి వ్యూహ‌మ‌ని కేటీఆర్ చెప్పారు. ఈ విష‌యంలో మ‌ల్లారెడ్డి త‌న రాజ‌కీయ అనుభ‌వాన్ని చాటుకున్నార‌ని తెలిపారు. మ‌ల్కాజ్‌గిరిలో కచ్చితంగా గెలిచేది బీఆరెస్ పార్టీయేనని, అది ఈటల రాజేందర్‌కు కూడా తెలుసని, మల్లారెడ్డి అన్న మాటల వెనుక అంతరార్థం తెలియక కొంతమంది ఆగమాగ‌మ‌వుతున్నార‌ని కేటీఆర్ పేర్కొన్నారు. కొంతమంది నాయకులు స్వార్థం కోసం పార్టీ నుంచి వెళ్లిపోయినా కేడర్ అంతా వారి వెంట వెళ్లలేదన్నారు.

బీఆరెస్‌లోనే తనకు గౌరవం ఉండేదని పార్టీ మారిన తర్వాత ఈటల రాజేందర్ చెప్పిన మాటను గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ మారిన కేకే, రంజిత్ రెడ్డి పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసని, కష్టకాలంలో పార్టీతో ఉన్నవాడే నాయకుడు అవుతాడని, పారిపోయిన వాళ్లు లీడర్లు ఎలా అవుతారని ప్రశ్నించారు. పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన నాయకులను ఓడించేందుకు ఎక్కువగా కష్టపడతామని, వారందరిని ఖచ్చితంగా ఓడిస్తామన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీ శిక్షణ కార్యక్రమాలతో పాటు పార్టీ నిర్మాణంపైన దృష్టి పెడతామ‌న్నారు కేటీఆర్ తెలిపారు.

Latest News