నేతన్నలపై కాంగ్రెస్ కక్ష కట్టింది: కేటీఆర్

  • Publish Date - April 4, 2024 / 01:53 PM IST

విధాత : నేతన్నలపై కాంగ్రెస్ సర్కార్ కక్ష కట్టిందని, కార్మికులు ఉపాధి కరువై ఆర్ధికంగా చితికిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా అని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సీఎం రేవంత్‌రెడ్డికి రాసిన లేఖలో అగ్రహం వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు. పదేళ్ల తరువాత సమైక్య రాష్ట్రం నాటి సంక్షోభానికి మరోసారి చేనేత కార్మికులు గురవుతున్నారని, కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అని, నేతన్నల బతుకులు ఆగం అయ్యేలా కాంగ్రెస్ విధానాలున్నాయని కేటీఆర్ లేఖలో ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నలకు వర్క్‌ అర్డర్లు అపేసిందని, గతంలో మాదిరే నేతన్నలకు చేతినిండా అర్డర్లు వెంటనే ఇవ్వాలని సీఎంను డిమాండ్ చేశారు.

బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడంతోపాటు ఎన్నికల కోడ్ వల్ల ఆపిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత మిత్ర వంటి పథకాలను పక్కన పెట్టిందని, అమలులో ఉన్న సంక్షేమ పథకాలను అందించడంతో పాటు మరింత సాయం చేయాలని, కేవలం బీఆరెస్ ప్రభుత్వంపై దుగ్ధతో నేతన్నల పొట్ట కొట్టడం సరైంది కాదన్నారు. రైతన్నల మాదిరే నేతన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం బాధకరమన్నారు. వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Latest News