CM Revanth Reddy Inaugurates ₹1000 Cr Development Works in Narsampet; Launches Warangal–Narsampet Four-Lane Road Project
సంక్షిప్తంగా
దశాబ్దాలుగా నర్సంపేట వాసులు ఎదురు చూస్తున్న కల ఎట్టకేfinally నెరవేరబోతోంది. జిల్లా రాజధాని వరంగల్ నగరానికి అనుసంధానించే రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సీఎం అర్జెంట్‌గా ఈరోజు శంకుస్థాపన చేశారు.
ముఖ్యమంత్రి వరాల జల్లులో తడిసిపోయిన నర్సంపేట : పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం
దశాబ్దాలుగా నర్సంపేట వాసులు ఎదురు చేస్తున్న కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. జిల్లా రాజధాని వరంగల్ నగరానికి అనుసంధానించే రహదారిని నాలుగు వరుసలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేసారు.
(విధాత, వరంగల్) డిసెంబర్ 5, 2025:
Narsampet – Warangal 4 Lane Road | నర్సంపేట ఈ రోజు అభివృద్ధి హంగులతో నిండిపోయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు వరంగల్–నర్సంపేట నాలుగు వరుసల రోడ్డు పనులకు అధికారికంగా శంకుస్థాపన చేసి, మొత్తం రూ.1000 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ప్రధాన రహదారి విస్తరణకు నేడు బీజం పడటంతో నర్సంపేట ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైద్య, విద్య, రవాణా రంగాల్లో భారీగా మార్పులు తెచ్చే ప్రాజెక్టులను ఒకే వేదికపై సీఎం ప్రారంభించడం నర్సంపేట నియోజకవర్గానికి మరపురాని మలుపుగా నిలిచింది.
వరంగల్–నర్సంపేట రోడ్డు ఇక నాలుగు వరుసలు
సీఎం రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా 40 కిమీ నాలుగు వరుసల రహదారి విస్తరణ పనులకు పచ్చజెండా ఊపారు. రూ.165 కోట్లతో విస్తరించబడే ఈ ప్రధాన రహదారి వరంగల్ నగరాన్ని నర్సంపేటతో సహా, ఖమ్మం, మహబూబాబాద్, ఇల్లెందు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలకు ప్రయాణాన్ని సులభం చేయనుంది. అదీకాక, ఆసియాలోనే అతిపెద్దదైన ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు కూడా మంచి అనుసంధానం ఏర్పడుతుంది. కరీంనగర్ వైపు నుండి మహబూబాబాద్ వైపు వచ్చే వాహనాలు ఇదే దారి గుండా ప్రయాణించాల్సిఉంటుంది. రోజూ 24 గంటలపాటు భారీ రద్దీ ఉండే ఈ మార్గంలో, ప్రత్యేకించి వెంకట్రామా థియేటర్ నుంచి నర్సంపేట బస్‌స్టాండ్ వరకు ప్రయాణికులు సంవత్సరాలుగా కష్టాలు పడుతూ వస్తున్నారు. పైగా రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన ఈ రెండు వరుసల రోడ్డు నాలుగు వరుసలుగా మారడం పలు సమస్యలకు పరిష్కారం కానుంది. గీసుకొండ, కొమ్మాల, గిర్నిబావి, లక్నేపల్లి మీదుగా నర్సంపేటకు ఇప్పుడున్న రోడ్డునే నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. మధ్యలో అందమైన పచ్చని చెట్ల మీడియన్‌తో, అటు రెండు లేన్లు, ఇటు రెండు లేన్లతో ఈ దారి మెరిసిపోనుంది.
కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌కు కూడా ఇదే రోడ్డు మీద నుండి రాకపోకలు జరగాల్సిఉండటంతో రోడ్డు వెడల్పు అనివార్యంగా మారింది. భవిష్యత్తులో పార్క్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభమైనప్పుడు ఈ రూట్ ప్రాధాన్యం మరింత పెరిగే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు.
నర్సంపేట వైద్య–విద్యా రంగాలకు భారీగా నిధులు
ఈ సందర్భంగా నర్సంపేట పర్యటనలో సీఎం పలు కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు:
- మెడికల్ కాలేజ్ బిల్డింగ్ — ₹150 కోట్లు (ప్రారంభం పూర్తి)
- ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ — ₹200 కోట్లు
- నర్సింగ్ కాలేజ్ — ₹45 కోట్లు
- మురుగునీటి కాల్వల ఆధునీకరణ — ₹20 కోట్లు
ఈ కార్యక్రమాల ద్వారా నర్సంపేట ప్రాంతం వైద్య, విద్యా రంగాలలో మరింత బలోపేతం అవుతుందని సీఎం తెలిపారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పూర్తయ్యాక ప్రాంతంలో ఉద్యోగావకాశాలు, మౌలిక వసతులు విస్తరించనున్నాయని అధికారులు అన్నారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అభ్యర్థన మేరకు నియోజకవర్గ కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి పర్యటనను వేలాది ప్రజలు స్వాగతించారు. ఒక్కరోజులో ఇంత పెద్ద స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభించిన సందర్భం జిల్లాలో అరుదని నాయకులు పేర్కొన్నారు.
నర్సంపేట—పరకాల పరిధిలో సంవత్సరాలుగా పెరుగుతున్న అభివృద్ధి లోటు భర్తీ చేసే దిశగా ఈ రోజు జరిగిన కార్యక్రమాలు కీలక మలుపు కానున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా రవాణా, వైద్య, విద్యా రంగాలకు బలమైన పునాది పడింది.
