CM Revanth:ఈ విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిదని, ప్రతిపక్షాలు ఇకనైనా వ్యవహారశైలి మార్చుకోకపోతే భూకంపం వచ్చి కాలగర్భంలో కలిసిపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు

CM Revanth Reddy

హైదరాబాద్, నవంబర్ 14(విధాత): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిదని, ప్రతిపక్షాలు ఇకనైనా వ్యవహారశైలి మార్చుకోకపోతే భూకంపం వచ్చి కాలగర్భంలో కలిసిపోతారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం కృషి చేసిన అందరికీ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. గెలుపు కోసం సహకరించిన తెలంగాణ సమాజానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు మా బాధ్యతను మరింత పెంచిందని అన్నారు. ఎన్నికల్లో నెగ్గితే ఉప్పొంగడం.. ఓడితే కుంగిపోవడం కాంగ్రెస్ కు తెలియదు, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాడటం.. అధికారంలో ఉంటే సమస్యలను పరిష్కరించడమే కాంగ్రెస్ పార్టీకి తెలుసని అన్నారు. అందుకే ప్రజల్లో కాంగ్రెస్ పై ఇప్పటికీ ఆదరణ తగ్గలేదని పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారు.. పోలైన ఓట్లట్లో 51 శాతం ఓట్లు కాంగ్రెస్ కు, 38 శాతం బీఆరెస్ కు , 8 శాతం బీజేపీ ఓటు వేశారని, మా రెండేళ్ల పాలనను ప్రజలు నిశితంగా గమనించి ఎన్నికల్లో తీర్పు ఇచ్చారన్నారు. నగరాన్ని అభివృద్ధి చేసేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. మన పాత్రలను, వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు విస్పష్టంగా తీర్పు ఇచ్చారని సీఎం తెలిపారు. ఇది బాధ్యత భావించి నగరాన్ని విశ్వ నగరంగా అభివృద్ధి చేయాలని సంకల్పించామన్నారు.

మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, మూసీ పునరుజ్జీవం, ట్రాఫిక్ సమస్యల పరిష్కారం, గోదావరి జలాల తరలింపు లాంటి కార్యక్రమాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. సోషల్ మీడియాలోఫేక్ ప్రచారాలతో ప్రభుత్వంపై బీఆరెస్ విషం చిమ్మిందని విమర్శించారు. ప్రధాన ప్రతిపక్షం అభివృద్ధికి సహకరించకపోగా ప్రతీ సందర్భంలో అవహేళన చేసే ప్రయత్నం చేసిందన్నారు. హైడ్రా, మూసీ విషయంలో ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను రాబట్టుకోకుండా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహాయ నిరాకరణ చేస్తున్నారని, వీలయినంత మేరకు కేంద్రంలో అడ్డు తగులుతున్నారు. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డినే అభ్యర్థిగా మారి పనిచేస్తే 17 వేల ఓట్లు వచ్చాయని, ఈ ఫలితాల తరువాతైనా కిషన్ రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోవాలన్నారు.

ఇది భూకంపం వచ్చే ముందు వచ్చే అలర్ట్ లాంటిది, ఇకనైనా వ్యవహారశైలి మార్చుకోకపోతే భూకంపం వచ్చి కాలగర్భంలో కలిసిపోతారు. ఈ ఫలితాలు విశ్లేషించుకుని తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఉద్దేశించి సీఎం అన్నారు.‘ కిషన్ రెడ్డిగారు.. సచివాలయానికి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నా.. కేంద్రం వద్ద పెండింగ్ అనుమతులు, నిధులపై చర్చిద్దాం. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ అనుమతులు, నిధులకు సంబంధించి సమీక్ష పెట్టి నివేదిక రూపంలో ఎంపీలకు ఇవ్వాలని ఉపముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా’ అని అన్నారు. అలాగే ‘ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరికీ ఈ వేదికగా సూచన చేస్తున్నా.. హరీష్ గారు.. మీ అసూయను తగ్గించుకోండి, కేటీఆర్… మీ అహంకారాన్ని తగ్గించుకోండి, అధికారం ఎవరికీ శాశ్వతం కాదు’ అని హితువు పలికారు.

ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చి కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు, 65 అసెంబ్లీ స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఖచ్చితమైన మెజారిటీ ఇచ్చారు. జూబ్లీహిల్స్ లో 51 శాతం ఓట్లతో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. బీఆరెస్, బీజేపీ ఓట్లు కలిపినా అన్ని ఓట్లు రాలేదు. ప్రజలు మీ అసూయను, అహంకారాన్ని గమనిస్తున్నారు. మీ ఇద్దరి నాయకత్వాన్ని ఎలా ఆమోదిస్తారని మీరు భావిస్తున్నారు. సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్లు ఉంది.. రెండేళ్లు అభివృద్ధికి సహకరించండి, ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయండి.. సమస్యలు ఉంటే ప్రశ్నించండి, ధర్నాలు చేయండి. మీ సోషల్ మీడియాలో మీరు చెప్పిందే రాస్తారు.. అదే నిజమని మీరు భ్రమల్లోకి వెళితే ఎలా? అని ప్రశ్నించారు. వ్యాపార దృక్పథంతో కొన్ని మీడియా సంస్థలు తప్పుడుసమాచారం వ్యాపింపజేస్తున్నాయి. కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నా కొన్ని ఛానళ్లు బీఆరెస్ హవా మొదలైందని వార్తలు వేశాయి, దయచేసి మీ విశ్వసనీయత కోల్పోకండి.. మాపై మీకు వ్యతిరేకత ఉంటే ఇంకో రకంగా చూపించండి. ఈ ఫలితాలపై విశ్లేషణ చేయండి… అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకు పెరుగుతూ వస్తోంది, 2023 ఎన్నికల్లో 39.5 శాతం ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 41 శాతం ఓట్లు కాంగ్రెస్ కు ఇచ్చారు. ఇప్పుడు 51 శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు, కాంగ్రెస్ ఒక్కతాటిపై ఉన్నప్పుడు ఎవరి తాతలు దిగొచ్చినా కాంగ్రెస్ ని ఓడించలేరని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.