Site icon vidhaatha

G. Jagadish Reddy | అబద్ధానికి పర్యాయపదంగా సీఎం రేవంత్‌రెడ్డి … మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి

అసెంబ్లీ సాక్షిగా విద్యుత్తు ఒప్పందంపై అసత్యాలు
ఉదయ్ స్కీమ్ వివరాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలకు పర్యాయపదంగా మారాడని, మోటార్లకు మీటర్లు పెడుతామని కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుందంటూ అసెంబ్లీ వేదికగా అసత్యాలు ప్రచారం చేశాడని విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జి.జగదీశ్ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తన పెంపుడు పత్రికల్లో రోత రాతలు రాయిస్తున్నాడని, శాసనసభలో జరిగిన చర్చ ఒకటైతే పచ్చ పత్రికల్లో రాసిన రాతలు మరోకటన్నారు. తెలంగాణ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ఈ వార్త పత్రికలకు సరైన సమాధానం జనాలే చెప్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలు, అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే అబద్ధాలతో పాలన సాగిస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం బీఆరెస్ ప్రభుత్వం మెడపై కత్తి పెట్టి రైతుల మోటార్లకు మీటర్లను పెట్టమన్నా కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. కానీ 2017 లోనే రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడానికి కేసీఆర్ ఒప్పుకున్నట్లు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పి సభను ప్రజలను తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. సభలో రేవంత్ రెడ్డి చదివిన పేపర్ అబద్ధమని, రేవంత్ రెడ్డి చదివింది ఉదయ్ స్కీమ్‌ పథకానికి చెందిన పేపర్ అని, దానిలో ఉన్న విషయాన్ని పూర్తిగా చదవకుండా.. కొద్ది భాగాన్ని మాత్రమే సభలో చెప్పి ప్రజలను తప్పుదోవపట్టించారన్నారు. మీడియాలో తప్పుడు వార్తలు రాసేలా.. పతాక శీర్షికల్లో వచ్చేలా సీఎం రేవంత్ కుట్ర పన్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ దుష్పచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. భూకబ్జాలతో భూములను మింగినట్టు అసెంబ్లీలో పదాల్ని మింగేసిన ఘనుడు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. అందుకు సాక్ష్యంగా ఆయన ఉదయ్ పూర్తి వివరాల పత్రాలను మీడియాకు వెల్లడించారు. పరీక్షలో కాపీ కొట్టే పిల్లవాడు సైతం సీఎం కంటే దరిధ్రంగా పనిచేయడని ఎద్దేవా చేశారు. వాస్తవానికి కేసీఆర్ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం 30వేల కోట్ల రుణ సదుపాయంతో పాటు పలు ఆఫర్లను కేంద్రం ఇవ్వచూపినప్పటికి వద్దనుకుని రైతుల సంక్షేమానికే ప్రాధాన్యతనిచ్చి మోటార్లకు మీటర్లు పెట్టలేదని గుర్తు చేశారు. అయితే త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తు వినియోగదారులను కసాయి వాళ్లకు అప్పగించడానికి కుట్ర చేస్తున్నారన్నారు. విద్యుత్తు సంస్థలను ప్రైవేటు వాళ్లకు అప్పగించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయని.. విమర్శించారు. తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి కుట్రలను గమనించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, కార్పొరేషన్ నూజీ చైర్మన్ కె వాసుదేవ రెడ్డి ఉన్నారు.

Exit mobile version