మోదీ, కేడీ చీకటి ఒప్పందం: సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలంగాణలో మోదీ, కేడీ ఒక్కటయ్యారు... బిడ్డ బెయిల్ కోసం ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీఆరెస్ నేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి

  • Publish Date - April 19, 2024 / 08:40 PM IST

బిడ్డ బెయిల్ కోసం బీఆరెస్‌ తాకట్టు
జూన్ 9న ఎర్రకోట పై మూడు రంగుల జెండా
ప్రధానిగా రాహుల్ కంటే అర్హులెవరున్నారు
మోదీ, కేడీ ఇచ్చిన హామీలేమయ్యాయి?
విభజన హామీలు విస్మరించిన బీజేపీకి హక్కులేదు
మహబూబాబాద్ జనజాతర సభలో రేవంత్ రెడ్డి

విధాత ప్రత్యేక ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు తెలంగాణలో మోదీ, కేడీ ఒక్కటయ్యారు… బిడ్డ బెయిల్ కోసం ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం జరిగిందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీఆరెస్ నేత కేసీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. రాష్ట్రంలో మహబూబ్ నగర్, మల్కాజిగిరి, చేవెళ్ళ, భువనగిరి, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ, బీఆరెస్ మధ్య ఈ ఒప్పందం జరిగిందని విమర్శించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆరెస్ పార్టీని మోదీ కాళ్ళ దగ్గర కేసీఆర్ తాకట్టు పెట్టారని మండిపడ్డారు. మోదీ, కేడీ మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని గుర్తించి తెలంగాణ ప్రజలు ఆలోచించి తీర్పు నివ్వాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా మహబూబాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన జనజాతర సభకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ ను వంద మీటర్ల గోతిలో బొందపెట్టారని అన్నారు. ఢిల్లీలో మోడీ, గజ్వేల్ లో ఉండే కేడీ తోడు దొంగలు, ఒకరిని బండకేసి కొట్టి మరొకరని విడిచిపెడుతారా? అంటూ ప్రశ్నించారు. పార్లమెంటులో ఏ బిల్లు వచ్చినా నరేంద్రమోదీకి అండగా నిలబడి బీజేపీని గెలిపించింది బీఆర్ఎస్ ఎంపీలు కాదా? ఆ కవితైనా…ఈ కవితైనా బీజేపీకి మద్దతు తెలిపినవారే కదా? అని ప్రశ్నించారు. అడిగే కనీస అర్హత బీఆరెస్, బీజేపీకి లేదన్నారు. విభజన హామీలు అమలు చేయలేదన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదన్నారు. బయ్యారంలో ఉక్కు పరిశ్రమను పాతరేసిందెవరంటూ ప్రశ్నించారు. ఉక్కు పరిశ్రమ ఇవ్వని బీజీపి దద్దమ్మలకు ఓటు అడిగే హక్కెక్కడిదంటూ నిలదీశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఇస్తే ఉపాధి లభిస్తుందని సోనియమ్మ భావిస్తే ఇక్కడి పరిశ్రమను లాథూర్ కు తరలించుకపోయిన బీజేపీ సన్నాసులకు ఓట్లు అడిగే హక్కుందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేండ్ల తర్వాత గిరిజన యూనివర్సీటీ ప్రకటించారన్నారు. ఐటీఐఆర్, మూసీ ప్రాజెక్టు అమలు చేయకుండా తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించ మోదీ
తల్లిని చంపి బిడ్డను బతికించిండని మోదీ అనేక సార్లు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పార్లమెంటులో అవమానించిండని రేవంత్ అన్నారు. సోనియా, మన్మోహన్ తలుపులు దగ్గరేసి తెలంగాణ తెచ్చారని, తెలంగాణ రాష్ట్రాన్ని, బిల్లును వ్యతిరేకించిన మోదీ, కిషన్ రెడ్డిలు తెలంగాణలో ఓట్లెలా అడుగుతారని ప్రశ్నించారు. ఉత్తర భారత దేశంలో కుంభమేళాకు, గంగానది పారిశుధ్యానికి వేల కోట్లు ఖర్చుచేశారగానీ, మేడారం జాతరకు ఏం ఇచ్చారు…ముష్టిమూడు కోట్లిచ్చారని సీతక్క చెప్పారు. మన ప్రభుత్వం రూ.150 కోట్లిస్తే వాటిని ఖర్చుచేశామన్నారు. మేడారం జాతరను జాతీయ గుర్తింపు ఇవ్వని బీజేపీ నాయకులు ఓట్లు ఎలా అడుగుతారంటూ ప్రశ్నించారు.

రాహులుకున్న అర్హతలెవరికున్నాయి?
ప్రధానిగా రాహుల్ గాంధీ కున్న అర్హతలు ఈ దేశంలో ఎవరికున్నాయంటూ సీఎం రేవంత్ ప్రశ్నించారు. దేశ ప్రజల మధ్య ఐక్యత కోసం రాత్రీపగలూ, ఎండా, వాన, చలి తేడా లేకుండా వేల కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర నిర్వహించి ప్రజలపట్ల, ప్రజా సమస్యలపట్ల అంకితభావం ఉన్న రాహుల్ కంటే గొప్ప నాయకుడెవరుంటారని అన్నారు. రాహూల్ ఈ దేశానికి ప్రధాని కావడం ఖాయమని, జూన్ 9న ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగురవేసి ప్రధాని కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రధాని కావాలంటే రాష్ట్రంలో 14 మంది ఎంపీలను గెలిపించాలన్నారు. ‘ఏపీలో అన్యాయం జరిగినా, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ ఇచ్చారు. అమరులు, బిడ్డల త్యాగాలను చూసి చలించి పోయి రాష్ట్రాన్నిచ్చిన తల్లి సోనియమ్మ కుమారుడు రాహుల్ ప్రధాని అయితే తప్పా?’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.

పదేండ్లలో మోదీ, కేడీ ఏం చేశారు?
పదేండ్లు మోదీ అక్కడ…కేడీ ఇక్కడ అధికారంలో ఉన్నా ఏం చేశారంటూ సీఎం రేవంత్ నిలదీశారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ ఇరవైకోట్ల ఉద్యోగాలిచ్చారా? అంటూ ప్రశ్నించారు. రైతుల ఆదాయం డబులు చేస్తానని హామీ ఇచ్చిన మోదీ ఆ రైతును కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్విస్ బ్యాంకుల్లోని నల్లధనాన్ని తెచ్చి జనధన్ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని చెప్పి ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేయటంలేదని, రేవంత్‌ దిగిపోవాలని బీఆరెస్‌ నేతలు అంటున్నారన్న రేవంత్‌.. ‘దిగిపోవడానికి నేనేమ్మన్న అయ్యపేరు, అవ్వపేరు చెప్పి అధికారంలోకి రాలేదు. అల్లాటప్పగా రాలేదు. పాలమూరు పల్లె నుంచి తొక్కుకుంటూ వస్తే, కాంగ్రెస్ కార్యకర్తలంతా కలిసి కూర్చుండబెడితే ఇక్కడ కూర్చున్నా’ అని ఉద్ఘాటించారు.

వంద రోజుల్లో పథకాలు అమలు

మహిళలకు ఉచిత బస్సు పథకం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్, 4లక్షల50వేల ఇందిరమ్మ ఇండ్లు, 30వేల ఉద్యోగాలిచ్చామని రేవంత్ రెడ్డి చెప్పారు. కుల జనాభా గణనకు ఆదేశాలిచ్చామని వివరించారు. మాట ఇస్తున్నా ఆగస్టు 15 తారీఖు లోపల రూ.2లక్షల రుణ మాఫీ అమలు చేస్తాం… భద్రాద్రి సాక్షిగా, మంత్రి తుమ్మల సాక్షిగా రుణమాఫీఅమలు చేసి రైతుల రుణం తీర్చుకుంటామనేది నా గ్యారంటీ అంటూ ప్రకటించారు. వచ్చే సీజన్ లో వడ్లకు బరాబర్ రూ.500 బోనస్ అమలు చేస్తామన్నారు. మానుకోట ఎప్పటికీ కాంగ్రెస్ కు కంచుకోట అని మరోసారి నిరూపించారన్నారు. ఈ సభకు ఇండియా కూటమి నేతలు కూడా హాజరై మద్ధతు తెలపడం సంతోషకరమని చెప్పారు. రెండు మూడు రోజుల్లో కలిసొచ్చే వారిని కలిసి, ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు అన్ని శక్తులను కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తామన్నారు.

కేసీఆర్ చిప్పకూడు తింటారు
కేసీఆర్ చిప్పకూడు తినడం ఖాయం, జైలుకెళ్ళడం తప్పదు. ఫోన్ ట్యాపింగులు చేసిన దుర్మార్గుడంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తున్నారు, ఈ కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని మంత్రి ధనసరి సీతక్క పిలుపునిచ్చారు.కాంగ్రెస్ ప్రతిష్టను పెంపొందించాలని పిలుపు నిచ్చారు. ఈ సభకు మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రాంతం నుంచి భారీ సంఖ్యలో జనం హాజరయ్యారు. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ అధ్యక్షతవహించగా రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ధనసరి అనసూయ సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ అభ్యర్ధి పోరిక బలరామ్ నాయక్, విప్ రామచంద్ర నాయక్, దొంతి మాధవరెడ్డి, యశస్వినిరెడ్డి, కోరం కనుకయ్య, తెల్లం వెంక్రటావు, పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Latest News