కాషాయ లక్ష్యానికి తెలుగోడి గండి.. తిరగబడిన బీజేపీ 400 సీట్ల నినాదం

అబ్‌కీ బార్ చార్ సౌ పార్‌.. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. ఈ నినాదాలతో బీజేపీ 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. బీజేపీ ఆశలకు అనూహ్యంగా తెలుగోడి రూపంలో దెబ్బపడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు

  • Publish Date - May 2, 2024 / 07:03 AM IST

  • ఎసరు పెట్టిన రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగ మార్పు ప్రచారం
  • తూటాలా పేలిన రేవంత్‌రెడ్డి మాట
  • అందిపుచ్చుకున్న ఇండియా కూటమి
  • డిఫెన్స్‌లో పడిపోయిన బీజేపీ నేతలు
  • వివరణలిచ్చుకున్న మోదీ, షా, భాగవత్‌
  • నష్ట నివారణకు అగ్రనేతల ప్రతి వ్యూహాలు

విధాత ప్రత్యేకం: అబ్‌కీ బార్ చార్ సౌ పార్‌.. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్.. ఈ నినాదాలతో బీజేపీ 400 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. బీజేపీ ఆశలకు అనూహ్యంగా తెలుగోడి రూపంలో దెబ్బపడిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కమలనాథల కలవరమే దీనికి నిదర్శమని చెబుతున్నారు. బీజేపీ అడుగుతున్న 400 సీట్ల నినాదం వెనుక ఆరెస్సెస్ ఆలోచన అయిన రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర దాగి ఉన్నాయిన రేవంత్‌రెడ్డి బాంబు పేల్చినంత పనిచేశారు. దానికి తోడు అమిత్ షా రిజర్వేషన్ల రద్దుపై చేసిన వ్యాఖ్యల నకలీదిగా చెబుతున్న ఫేక్ వీడియో ఒకటి బయటకు వచ్చింది. సార్వత్రిక ఎన్నికల పర్వంలో దావాగ్నిలా దేశమంతా పాకింది. కమలనాథులను ఆత్మరక్షణలో పడేసే స్థాయికి తీసుకెళ్లింది. రేవంత్ ప్రచారం ధాటికి అధికార బీజేపీ రాముడి హవా కూడా తెరమరుగైందంటే అతిశయోక్తికాదంటున్నారు విశ్లేషకులు. విపక్షాలు ఇండియా కూటమిగా ఏర్పడినా.. మొదట్లో అది బీజేపీకి గట్టి పోటీనైనా ఇస్తుందా? లేదా? అనే సందేహాలు చాలామందిలో ఉండేవి. కానీ.. ఇప్పుడు ఏకంగా హంగ్ వాతావరణం సృష్టించి, గద్దె నెక్కే అవకాశాలకు దగ్గరైందంటే.. అది రేవంత్‌రెడ్డి ఆరంభించిన 400 సీట్లు బీజేపీకి ఎందుకన్న ప్రచారాస్త్రం పుణ్యమేనంటున్నారు.

400 సీట్ల రహస్యం విప్పిచెప్పిన రేవంత్‌
ఎన్డీయే దూకుడు మీద సాగుతున్న ఎన్‌డీఏ కూటమికి దీటుగా దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకునే ఒక గట్టి నినాదం కరువైపోయిందనుకున్న పరిస్థితిలో రేవంత్‌ మాట తూటాలా పేలింది. సొంత మ్యానిఫెస్టోలే ఆపన్నహస్తాలుగా భావిస్తున్న కాంగ్రెస్‌, ఇండియా కూటమి పార్టీలకు బాహుబలి నినాదాన్ని అందించారు రేవంత్‌రెడ్డి. బీజేపీ వేలితో బీజేపీ కన్ను పొడిచినట్లుగా ఆ పార్టీ 400 సీట్ల నినాదం వెనుక ఉన్న భారీ రహస్యాన్ని వారిపైకే తిప్పికొట్టారని పరిశీలకులు అంటున్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగం మార్పు అంశాలపై మైనార్టీలలో ఆలోచన రేకెత్తించడంలో రేవంత్‌రెడ్డి ప్రచార వ్యూహం కాంగ్రెస్‌కు బ్రహ్మస్త్రంగా మారిందని చెబుతున్నారు. ఇప్పటికే కుల గణన ఒక కీలక అంశంగా ఉండగా.. రేవంత్ అందించిన ప్రచారాస్త్రాన్ని రాహుల్‌గాంధీ సహా ఆ పార్టీ నేతలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు ఎన్నికల ప్రచారంలో, సోషల్ మీడియాలో మోగిస్తున్నాయి.

పెను సవాల్‌గా రిజర్వేషన్లు
అయోధ్యలో రామమందిరంలో బాల రాముడు ఓట్లు కురిపిస్తాడని ఆశతో ఉన్న బీజేపీకి ఇప్పుడు రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగం మార్పు ప్రచారాన్ని ఎదుర్కోవడం పెను సవాల్‌గా తయారైందని పరిశీలకులు అంటున్నారు. బీజేపీకి 400 సీట్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తారన్న ప్రచారంతో ఎదురవుతున్న నష్టాన్ని సకాలంలో గుర్తించి మేల్కొన్న బీజేపీ, సంఘ్ పరివార్ అంతే వేగంగా నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించాయి. తాను మతపరమైన ముస్లిం రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి ఫేక్ వీడియో సృష్టించి వైరల్ చేసి ప్రజల మధ్య వర్గ వైషమ్యాలు, భయాలు రెచ్చగొట్టారంటూ హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలో కేసు వేశారు. ఢిల్లీ పోలీసులు హుటాహుటిన తెలంగాణ పీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్‌కు నోటీసులు జారీ చేసి, విచారణకు రావాలంటూ హుకుం జారీ చేశారు.

సుదీర్ఘ వివరణలు ఇచ్చుకున్న నేతలు
రేవంత్‌ ప్రచారంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాలతో పాటు ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్‌ వరుసగా తెలంగాణ పర్యటనలు పెట్టుకుని రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ చేస్తున్న ప్రచారాన్ని ఖండించుకుంటూ సుదీర్ఘ వివరణలు ఇచ్చుకోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ అయితే తన ప్రాణమున్నంత వరకు రాజ్యాంగం, రిజర్వేషన్లు కొనసాగుతాయని గట్టిగా నమ్మబలకాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తంగా బీజేపీ 400 సీట్ల నినాదం రేవంత్‌ కొట్టిన దెబ్బకు బీజేపీకే బూమర్యాంగ్‌ అవుతున్నదని అంటున్నారు.

మతపరమైన రిజర్వేషన్ల వ్యాఖ్యలతోనే లొల్లి
కాంగ్రెస్‌ పార్టీ ముస్లింలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని అంటున్నది. అయితే.. ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్లను ఓబీసీల కోటా నుంచి కత్తిరించి.. ఇస్తారని బీజేపీ ఆరోపిస్తున్నది. ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని అడ్డుకుని తీరుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను ‘లాక్కొని’ ముస్లింలకు ఇస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లింలకు అమలవుతోన్న రిజర్వేషన్లను ఆయన దీనికి ఉదాహరణగా చూపారు. కాంగ్రెస్‌ సమర్థిస్తున్న ముస్లింలకు రిజర్వేషన్లు .. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఉందని విమర్శించారు. అదే ధోరణిలో సార్వత్రిక ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ జాతీయ నేతలు తమ పార్టీ పాలసీని ప్రచారం చేస్తున్నారు. అయితే అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మార్ఫింగ్, ఎడిట్‌ చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లుగా వీడియో వైరలైంది. ఈ తరహా దుశ్చర్యకు ఎవరు పాల్పడ్డారన్నది పక్కన పెడితే ఈ ప్రచారం మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 సీట్ల లక్ష్యానికి గండి కొట్టడంతో పాటు సంపూర్ణ మెజార్టీ సాధనకు బ్రేక్‌లేసేదిగా తయారైందని విశ్లేషకులు చెబుతున్నారు.

మోదీ, షా ద్వయం ప్రారంభించిన మతపరమైన రిజర్వేషన్ల వ్యవహారాన్ని కాంగ్రెస్ అటుఇటుగా మార్చి బీజేపీ 400 సీట్ల నినాదంతో రిజర్వేషన్ల రద్దు, రాజ్యాంగం మార్పును ముడిపెట్టి ఆ పార్టీపైనే ప్రయోగించడంలో రాజకీయంగా విజయవంతమైందని అంటున్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వారసత్వ ఆస్తిపన్ను వ్యాఖ్యల ఆధారంగా కాంగ్రెస్ వారసత్వ పన్ను విధించబోతున్నదంటూ మోదీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టారు. మెజార్టీల సంపదను లాక్కుని మైనార్టీలకు పంచుతారని, మహిళల మంగళసూత్రాలు కూడా లాగేసుకుంటారంటూ ఆ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోపై దాడి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్‌ చేస్తున్న దాడి.. దానికి దీటుగా ఉన్నదని అంటున్నారు.

నిజానికి కర్ణాటకలో ఓబీసీ కోటాలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్ని, ఏపీ, తెలంగాణలో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ల విధానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని వాదిస్తున్నది. కాంగ్రెస్ మాత్రం రాజ్యాంగంలోని 15,16(4) ఆర్టికల్ కింద ముస్లిం రిజర్వేషన్లను సమర్థిస్తున్నది. సచార్ కమిటీ సిఫార్సులను ప్రామాణికంగా తీసుకోవాలని చెబుతున్నది. 2009లో జాతీయ స్థాయిలో దేశమంతా ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది కానీ అమలు చేయలేదు. 2011లో దేశవ్యాప్తంగా ముస్లింలకు 6 శాతం రిజర్వేషన్లు ఓబీసీ కింద ఇవ్వాలనుకుంది. తరువాత దాన్ని 4.5 శాతానికి తగ్గించారు. కానీ అమలు చేయలేదు. అదే సమయంలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని, క్రిమిలేయర్ పాటించాలన్న వాదన.. సుప్రీం ఆదేశాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికే ఓబీసీ కోటా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నది. కర్ణాటకలో ముస్లింలు ఓబీసీ కోటాలో 4% ఉప-కోటాను కలిగి ఉన్నారు. దీనిని బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం 2023లో వొక్కలిగలు, లింగాయత్‌ల మధ్య పునఃపంపిణీ చేసింది. కానీ.. సుప్రీంకోర్టు దీనిపై స్టే విధించింది. కేరళలో ఓబీసీ కోటాలో 8% ముస్లిం కోటా ఉంది. తమిళనాడు, బీహార్‌లలో సైతం ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి.

Latest News