Site icon vidhaatha

బీఆర్ఎస్‌ను బొంద పెట్టాం.. ఇక ఢీకొట్టాల్సింది బీజేపీనే : సీఎం రేవంత్ రెడ్డి

రాజ‌న్న సిరిసిల్ల : తెలంగాణ‌లో బీఆర్ఎస్‌ను బొంద పెట్టాం.. ఇక ఈ పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీని ఢీకొట్టాలి అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డిసెంబ‌ర్‌లో జ‌రిగిన సెమీ ఫైన‌ల్స్‌లో బిల్లా రంగాను ఓడించాం.. 13వ తేదీన జ‌ర‌గ‌బోయే ఫైన‌ల్స్‌లో మోదీ, అమిత్ షాను ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌కు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. సిరిసిల్ల జన జాతర బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్ర‌సంగించారు.

సిరిసిల్ల‌కు వెళ్లాల్సిందేన‌ని చెప్పి ఆల‌స్య‌మైనా ఇక్క‌డ‌కు వ‌చ్చాను అని రేవంత్ తెలిపారు. క‌రీంన‌గ‌ర్ నుంచి బీఆర్ఎస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న వినోద్ రావు అపర మేధావి, బండి సంజయ్  అరగుండు మేధావి అని విమ‌ర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో బయ్యారం ఉక్కు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, గిరిజన యూనివర్సిటీ , ఐఐటీ, ఐఐఎం లాంటివి పెట్టింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ హక్కులను పట్టించుకోలేదు. పాలమూరు రంగారెడ్డి కి జాతీయ హోదా ఇవ్వలేదు అని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. `

తెలంగాణకు రావాల్సిన హక్కులు, నిధులు ఇవ్వకుండా ప్రధాని మోదీ అవమానించారని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మోదీ అవమానించారు. తల్లిని చంపి బిడ్డను బతికించారంటు పార్లమెంట్ సాక్షిగా మోదీ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను అవమానించిన మోదీకి రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు ఉందా..? రిజర్వేషన్ల రద్దుకు మోదీ ప్రయత్నిస్తుంటే కేటీఆర్ ఎందుకు మాట్లాడటం లేదు..? 2022 ఫిబ్ర‌వ‌రిలో రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటోంది. రిజర్వేషన్లు రద్దు చేస్తామంటుంటే చూస్తు ఊర్కుకుందామా..? బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే బీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదు అని రేవంత్ నిల‌దీశారు.

కారు కార్ఖానా కు పోయింది.. జుమ్మేరాత్ బజార్‌లో అమ్మాల్సిందే అని రేవంత్ ఎద్దెవా చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర  చూస్తుంటే తిక్కలోడు తిరునాళ్ళకు పోయినట్లుంది. బీఆర్ఎస్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాలితే కాల్చిపారేస్తాం. కారు గుర్తు వాన్ని మా గల్లీలో కూడా అడుగుపెట్టనివ్వం. ఎన్నికల తర్వాత బీజేపీతో కలిసి పోవాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఒకటో రెండో గెలిస్తే మోదీకి అమ్మేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. రైతు నల్లచట్టాలతో పాటు బీజేపీ తీసుకువచ్చిన బిల్లులకు కేసీఆర్ మద్దతు ఇచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ చీకటి ఒప్పందం చేసుకొని ప్రచారం చేస్తున్నారు అని రేవంత్ పేర్కొన్నారు.

Exit mobile version