హైదరాబాద్: కమర్షియల్ ట్యాక్స్ ఇన్‌పుట్ సబ్సిడీ కుంభకోణం కేసును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసింది. అక్రమ మార్గంలో 75 కంపెనీలకు 1400 కోట్ల మేరకు జీఎస్టీ ఎగవేతకు అవకాశం కల్పించారన్న కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కుంభకోణంలో సీసీఎస్ పోలీసులు ఇప్పటికే ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలో సీసీఎస్ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్టు వార్తలొస్తున్నాయి. 75 కంపెనీలు/పన్ను చెల్లింపు దారుల వివరాలను ఆన్‌లైన్‌లో కనిపించకుండా చేసి, పన్ను ఎగవేసేందుకు అవకాశం కల్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్ చుట్టూ ఉచ్చు బిగిసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయన వ్యవహారంపైనా విచారణ కొనసాగుతున్నది. సోమేశ్‌కుమార్‌పై, కమర్షియల్ ట్యాక్స్ విభాగంలోని మరో ఇద్దరు సీనియర్ అధికారులపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Commercial Tax Scam | సీఐడీకి కమర్షియల్ ట్యాక్స్ స్కాం కేసు
