- తిరుమల లడ్డూలో కెమికల్ నెయ్యి
- బోలే బాబా డెయిరీ దురాగతం
- కెమికల్స్ సరఫరా చేసిన అజయ్ అరెస్టు
- కల్తీ నెయ్యి కాంట్రాక్టు విలువ రూ.250 కోట్లు
హైదరాబాద్, విధాత : ఒక్క చుక్క పాలు లేకుండానే నెయ్యి తయారైంది. ఆ నెయ్యితోనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూను తయారు చేసి భక్తులకు విక్రయించారు. పరమ పవిత్ర లడ్డూ గా భావించి భక్తులు లొట్టలేసుకుని లాగించేశారు. ఇలాంటి విస్తుగొలిపే విషయాలు సీబీఐ, సిట్ విచారణలో వెలుగు చూశాయి. టీటీడీతో పాటు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహాస్తి, ద్వారకా తిరుమల, కాణిపాకం, విజయవాడ కనకదుర్గ ఆలయం, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవాలయాలకు కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు సిబీఐ గుర్తించింది. కల్తీ నెయ్యికి అవసరమైన రసాయనాలు సరఫరా చేసిన ఢిల్లీ వ్యాపారి అజయ్ కుమార్ సుగంధిని సిట్ అరెస్టు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
తిరుమల లో భక్తులకు విక్రయించే లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతున్న విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర దర్యాప్తు కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు అప్పగించింది. కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ టీటీడీ ఛైర్మన్ వైవీ.సుబ్బారెడ్డి పాత్ర ఉందని దర్యాప్తు సంస్థ తేల్చింది. ఉత్తరాఖండ్ కు చెందిన బోలే బాబా డెయిరీ రూ.250 కోట్ల విలువైన నెయ్యిని టీటీడీకి సరఫరా చేసింది. కాంట్రాక్టు అగ్రీమెంట్ ప్రకారం 2019 నుంచి 2024 వరకు అంటే వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పదవీకాలంలో. ఒక్క చుక్క పాలు, వెన్న సేకరించకుండానే బోలే బాబా డెయిరీ 6.8 మిలియన్ కిలోల నెయ్యిని తయారు చేసి టీటీడీకి ప్రత్యేక వాహనాల ద్వారా రవాణా చేసింది. బోలే బాబా డెయిరీ యాజమాన్యం మోనోడిగ్లైసరైడ్స్, అసిటిక్ ఈస్టర్ వంటి రసాయణాలు, పామాయిల్ ను ఉపయోగించి నెయ్యి తయారు చేశారని అజయ్ కుమార్ సుగంధ్ తన విచారణలో సీబీఐ అధికారులకు వెల్లడించారు. దక్షిణ కొరియా నుంచి ఈ రసాయనాలు కొనుగోలు చేసి డెయిరీ యజమానులకు విక్రయించినట్లు వివరించారు. ఈ డెయిరీ ని పొమిల్ జైన్, విపిన్ జైన్ లు నిర్వహిస్తున్నారని, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకుండానే పాలు సేకరించినట్లు, పాల ఉత్పత్తిదారులకు డబ్బులు చెల్లించినట్లు తప్పుడు రికార్డులు తయారు చేసినట్లు విచారణలో వెల్లడించారు. 2022 లో బోలేబాబా డెయిరీ ని బ్లాక్ లిస్టులో పెట్టినప్పటికీ , వైష్ణవి డెయిరీ (తిరుపతి), మాల్ గంగా (ఉత్తర ప్రదేశ్), ఏఆర్ డెయిరీ (తమిళనాడు) సంస్థల ద్వారా కల్తీ నెయ్యిని సరాపరా చేయడం విశేషం.
సీబీఐ నివేదిక ప్రకారం ఏఆర్ డెయిరీ జంతువుల కొవ్వు తో నెయ్యి తయారు చేసినట్లు నివేదిక రావడంతో గతేడాది జూలై నెలలో నాలుగు ట్యాంకర్లను టీటీడీ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇలా తిరస్కరించి తిప్పి పంపిన నాలుగు ట్యాంకర్లను బోలె బాబా డెయిరీ బయట పారబోయకుండా తిరిగి వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి పంపించింది.
