సీఐడీ హెడ్‌కానిస్టేబుల్‌.. అందాల రాణి.. కట్‌ చేస్తే లిక్కర్‌ మాఫియాతో దొరికిపోయింది!

మనిషిని రూపాన్ని బట్టి అంచనావేయకూడదంటారు! ఈమెను చూస్తే అదే అనిపిస్తుంది. ఆమె పేరు నీతా చౌదరి. గుజరాత్‌ తూర్పు కచ్‌ ప్రాంత సీఐడీ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌. గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నది.

  • Publish Date - July 3, 2024 / 07:01 PM IST

అహ్మదాబాద్‌: మనిషిని రూపాన్ని బట్టి అంచనావేయకూడదంటారు! ఈమెను చూస్తే అదే అనిపిస్తుంది. ఆమె పేరు నీతా చౌదరి. గుజరాత్‌ తూర్పు కచ్‌ ప్రాంత సీఐడీ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌. గుజరాత్‌లో మద్య నిషేధం అమల్లో ఉన్నది. కానీ.. మద్యం మాఫియాతో కుమ్మక్కయి.. వారికి సహకరిస్తూ పట్టుబడిపోయింది. పట్టుబడటానికి ముందు చాలా పెద్ద కథే నడిచింది. కారులో మద్యం బాటిళ్లతో వస్తున్న నీతా చౌదరి.. ఒక చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీల నిమిత్తం ఆపేందుకు ప్రయత్నించగా.. వారిపై నుంచి కారును దూకించి.. పారిపోయేందుకు ప్రయత్నించింది. పోలీసు వ్యవస్థపైనే నమ్మకాన్ని దెబ్బతీసేలా వ్యవహారం ఉన్నది.
ఆదివారం రాత్రి పోలీసులు భచావు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చౌపడ్వా వంతెన వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన తెల్లని థార్‌ వెహికల్‌ను పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. ఆ కారులో నీతా చౌదరి ఉన్నది. కారును ఆపకపోగా.. పోలీసుపైకి దూకించి.. పారిపోయేందుకు ప్రయత్నించింది ఈ క్రమంలో పోలీసులకు చెందిన ఒక ఫార్చ్యూనర్‌, మరో ఐ20 కారును ఢీకొన్నది. పోలీసులు ఆ కారును వెంటాడారు. తీవ్ర ప్రయాస తర్వాత ఒక రోడ్డు చివరిలో కారును దిగ్బంధించారు. కారులో తనిఖీలు నిర్వహించగా.. 16 మద్యం బాటిళ్లు, రెండు కేన్స్‌లో బీర్‌ లభించాయి. కారులో ఉన్న నీతాచౌదరితోపాటు స్మగ్లర్‌ యువరాజ్‌సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు. మద్యం తరలిస్తున్నట్టు తమకు ముందుగా అందిన సమాచారం మేరకు నిఘా పెట్టామని తూర్పు కచ్‌ ఎస్పీ సాగర్‌ బాగ్మార్‌ తెలిపారు. కారులో మద్యం పట్టుబడటంతో ప్రొహిబిషన్‌ కేసులో వారిద్దరినీ అరెస్టు చేసినట్టు చెప్పారు. యువరాజ్‌సింగ్‌పై 16 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. హత్య కేసు సహా ఆరు కేసులలో వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్నాడని పేర్కొన్నారు. అరెస్టయిన సమయంలో నీతా చౌదరి మద్యం ప్రభావంలో ఉన్నట్టు చెబుతున్నారు.

నీతా చౌదరి లైఫే సపరేటు!

నీతా చౌదరి సీఐడీ ఆఫీసరే అయినప్పటికీ.. ఆమె చేసే వీడియోలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టాయి. గతంలో పోలీసు యూనిఫాంలో ఉండి డ్యాన్సులు చేయడం సహా సంప్రదాయేతర ప్రవర్తన కలిగి ఉన్నందుకు వివాదాల్లో చిక్కుకున్నారు. నీతా చౌదరిది గ్లామరస్‌, లగ్జరీ లైఫ్‌. కార్లు, బైకులు, హెలికాప్టర్లు, ఆఖరుకు గుర్రాలంటే కూడా ఎంతో అభిమానం. గతంలో తగిన ప్రవర్తన లేని కారణంగా ఆమె ఒకసారి సస్పెన్షన్‌కు కూడా గురయ్యారు. ఆమెకు లగ్జరీ కార్లంటే ఎంతో ఇష్టం. అంతేకాదండోయ్‌.. ఆమె వద్ద పలు లగ్జరీ కార్లు కూడా ఉన్నాయట. ఎంతైనా సీఐడీ విభాగంలో, అందులోనూ గుజరాత్‌లో హెడ్‌కానిస్టేబుల్ కదా! కార్లతోనే సరిపెట్టుకోలేదామె. హెలికాప్టర్లపైనా మనసు పారేసుకున్నదని సోషల్‌ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఆమెకు సంబంధించిన అనేక వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Latest News